వర్మ బాటలో నిర్మాతలు, ఓటీటీలు..!

ఓటీటీలకు ప్రతి నెలా/వార్షిక చందా చెల్లించి సినిమాలు చూసే వెసులుబాటు భవిష్యత్‌లో ఉండదా? సినీ నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కొత్త

Updated : 13 Oct 2020 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలకు ప్రతి నెలా/వార్షిక చందా చెల్లించి సినిమాలు చూసే వెసులుబాటు భవిష్యత్‌లో ఉండదా? సినీ నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కొత్త దారిలో పయనించనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. లాక్‌డౌన్‌లోనూ వరుస సినిమాలు తీసి, పే పర్‌ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని కూడా కొన్ని సినిమాలకు ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇప్పటికే వినియోగిస్తున్న సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, కొన్ని సినిమాలకు అదనంగా కొంతం మొత్తం చెల్లించాల్సి ఉంటుందా? అసలు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని వారు కూడా నేరుగా ఆ మొత్తం చెల్లించి ఉండవచ్చా? అన్నదానిపై కసరత్తులు చేస్తున్నాయి.

తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘రణసింగం’ చిత్రాన్ని పే ఫర్‌ వ్యూ మోడల్‌లో విడుదల చేశారు. ఈ సినిమాను జీ ప్లెక్స్‌లో వీక్షించడానికి టికెట్‌ రూ.199లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అనన్యా పాండే, ఇషాన్‌ కట్టర్‌ నటించిన ‘ఖాలీ పీలి’కి కూడా ఈ విధానాన్నే అవలంబించారు. ఈ సినిమాకు ఏకంగా రూ.299 టికెట్‌ ధర నిర్ణయించారు. ఒకసారి ఓటీటీ వేదికకు సినిమాను అమ్మేస్తే, నిర్మాత ఒడ్డున పడినట్టే. అయితే, ఆ సినిమా మంచి టాక్‌ తెచ్చుకోకపోతే ఓటీటీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోవైపు పైరసీ కూడా వాటిని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలవైపు ఓటీటీ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. అయితే, సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా కొంతం మొత్తం చెల్లించి ప్రేక్షకులు సినిమా చూస్తారా? అంటే అందుకు కాలమే సమాధానం చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని