Sujeeth: ‘సాహో’తో ఎన్నో నేర్చుకున్నా!

ప్రభాస్‌ కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించిన ‘సాహో’ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దర్శకుడు సుజిత్‌ అన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించి ‘రన్‌ రాజా రన్‌’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుజిత్‌..

Published : 04 Jul 2021 21:40 IST

యాక్టర్‌ అవ్వాలనుకున్నా.. ఆడిషన్స్‌కి వెళ్లా

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించిన ‘సాహో’ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దర్శకుడు సుజిత్‌ అన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించి ‘రన్‌ రాజా రన్‌’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుజిత్‌.. రెండో సినిమాకే ప్రభాస్‌ని డైరెక్ట్‌ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ప్రభాస్‌కి ఓ మంచి స్థానం ఉందని తెలిపారు.

‘ఒకానొక సమయంలో నాకు యాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కలను సాకారం చేసుకోవడం కోసం ఎన్నో ప్రొడెక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగాను. ఆడిషన్స్‌కి వెళ్లాను. ఎక్కడా నాకు అవకాశం దొరకలేదు. దాంతో షార్ట్‌ ఫిల్మ్స్ తెరకెక్కించాను. వాటికి నేనే హీరో, నేనే డైరెక్టర్‌. నాలో నటుడి కంటే కూడా మంచి డైరెక్టర్‌ ఉన్నాడని ఆ తర్వాత నాకు అర్థమైంది. డైరెక్టర్‌ కావాలని ఫిక్స్‌ అయ్యాను. అలాంటి సమయంలో నేను తెరకెక్కించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ని ఓసారి ప్రభాస్‌ ఎక్కడో చూశారు. ఆ ఫిల్మ్‌ ఆయనకు బాగా నచ్చింది. దాంతో యూవీ క్రియేషన్స్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ‘‘మిర్చి ఆడియో ఫంక్షన్‌కి’ ప్రభాస్‌ మిమ్మల్ని రమ్మన్నారు’ అని అన్నారు. నేను జోక్‌గా తీసుకుని ఫంక్షన్‌కి వెళ్లలేదు’

‘నేను డైరెక్టర్‌గా పరిచయమైన ‘రన్ రాజా రన్‌’ హిట్‌ అయ్యాక ఓ పార్టీలో మొదటిసారి ప్రభాస్‌ని కలిశాను. ఏదైనా కథ ఉంటే చెప్పు చేద్దామన్నారు. సరే అని చెప్పి ఏడాది తర్వాత యూవీ క్రియేషన్స్‌ వాళ్లకి ‘సాహో’ లైన్‌ చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. తర్వాత ప్రభాస్‌ని కలిసి.. కథ చెప్పాను. ఆయన ఎంతో ఆసక్తితో కథ విన్నారు. అలా సినిమా పట్టాలెక్కింది. ‘సాహో’ సినిమా షూట్‌ సమయంలో నేను ఏం టెన్షన్‌ పడలేదు. ప్రతి షెడ్యూల్‌ని ఎంతో సరదాగా పూర్తి చేశాను. ‘సాహో’ రిజల్ట్‌ గురించి పక్కనపెడితే.. ఆ సినిమా వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కొత్త టెక్నాలజీలు చూశాను’

అనంతరం ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ ఓ మంచి వ్యక్తి. ఆయనకు నా మనసులో ముఖ్యమైన స్థానం ఉంది. ఇప్పటికీ ఆయనకు నా వర్క్‌పై ఎంతో నమ్మకం ఉంది. నాకంటే నన్ను ఎక్కువగా నమ్మేది ప్రభాస్‌ అన్నే. ఒకవేళ ఇప్పుడు ఫోన్‌ చేసి.. ‘అన్నా.. కథ ఉంది సినిమా చేస్తారా?’ అని అడిగితే చేస్తా అనే చెబుతారు’ అని సుజిత్‌ వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts