పూరి కళ్లలో నీళ్లు తిరిగాయి: సంగీత ద‌ర్శ‌కుడు సునిల్ క‌శ్య‌ప్‌

 ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది

Updated : 25 Oct 2021 23:47 IST

 ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు.  అనిల్ పాదురి దర్శకుడు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


ఆ మాటల్లో కసి కనపడింది

ఈ సినిమాలో సరదాగా చేసిన పాటలు చాలా ఉన్నాయి.  ‘ఇస్మార్ట్ గ్యాంగ్’ అంతా అలా కూర్చుని సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్’.  దర్శకుడు అనిల్ ప్రత్యేకంగా అలాంటి  పాటలే కావాలనేవాడు.  సినిమాకు ‘రొమాంటిక్’ అని టైటిల్‌ పెట్టినప్పటి నుంచి నేనూ రొమాంటిక్‌గా మారిపోయి పాటలను కంపోజ్ చేశాను. హీరోయిన్‌ కేతిక శర్మ పాడిన ‘నా వల్ల కాదే’ అనే పాట  పెద్ద హిట్ అయింది.  వాస్కోడిగామ పాటలో ఆకాష్ వాయిస్ అద్బుతంగా ఉంటుంది. పూరి కన్నా ఆకాష్ వాయిస్ బాగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్ మాట తీరు చూశాక ఆయనలో కసి కనబడింది.  నాకు తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి ‘పీకే కే బాద్’ అని మాట్లాడుతున్నారు. రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలియని వాళ్లు కూడా ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్ర‌మిది. రీరికార్డింగ్‌ చేసేటప్పుడే ఆ విష‌యం స్ఫష్టంగా అర్థమైంది.  


పూరి కళ్లలోంచి నీళ్లు

అనిల్ అద్భుతంగా తెర‌కెక్కించాడు.  చాలా ఇష్టపడి ఈ సినిమాను చేశాం.  సినిమాలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థం భావోద్వేగంగా సాగుతుంది. పూరి మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది సినిమా చూశాక ఆయ‌న కళ్లలోంచి నీళ్లు వ‌చ్చాయి.  రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.


అల్బమ్‌ చూసి ఎంపిక

మేం అంతా ఒక చోట కలిస్తే చాలా సరదాగా ఉంటుంది. పూరి, ఛార్మీ  పక్కనే ఉంటే నేను గిటార్ పట్టుకుని వాయిస్తుంటాను.  కరోనా దయ వల్ల కావాల్సినంత టైం కూడా దొరికింది. అందుకే కష్టం కన్నా ఇష్టం ఎక్కువగా పెరిగింది. పూరితో ఉంటే సెన్సాఫ్ హ్యూమర్ పెరుగుతుంది. భాస్కరభట్ల పీనే కే బాద్ పాటను అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పదాన్ని రాస్తుంటే మేం అలా ఆశ్చర్యపోయేవాళ్లం. నా వల్ల కాదే అనే పాటను కూడా అద్భుతంగా రాసేశారు. నేను చేసిన ఆల్బమ్‌లో చూసే కేతికను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. పాటలు పాడుతుందని తెలిసే తీసుకున్నాం. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది ముఖ్యం కాదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా. పూరి ప్రతీ సినిమాకు నన్ను పిలుస్తారు. అన్ని సినిమాలు నాకు ఇవ్వాలని ఏమీ లేదు. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే నాకు ఇష్టం. 


మరో రెండు ప్రాజెక్టులు

హిందీలోనూ రెండు సినిమాలు చేశాను. సినిమాలే కాకుండా క్లాసికల్ సంగీతం వైపు వెళ్లాలని ఉంది. ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను అనేది చూసుకుంటాను. ఏం జరిగినా మ‌న‌ మంచికే. అలానే ముందుకు వెళ్లాలని అనుకుంటాను.  ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా న‌టిస్తోన్న‌ ‘గాడ్సే’ సినిమా చేస్తున్నాను. మ‌రో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తా.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని