Jagadam: 16 ఏళ్ల ‘జగడం’.. ఆ స్టార్‌ హీరోలతో అనుకుని.. రామ్‌తో తీసి!

రామ్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జగడం’. ఈ సినిమా విడుదలై 16 ఏళ్లైన సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీకోసం..

Updated : 16 Mar 2023 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పొందినా వాటి గురించి ప్రేక్షకులు చర్చిస్తూనే ఉంటారు. కథ ఫెయిల్‌ అయినా హీరో ఫెయిల్‌కాలేదంటుంటారు. అలాంటి చిత్రాల్లో ‘జగడం’ (Jagadam) ఒకటి. రామ్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన చిత్రమిది. 2007 మార్చి 16న విడుదలైన ఈ సినిమా నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘జగడం’ కథ ఏ హీరో కోసం సుకుమార్‌ రాసుకున్నారో.. రామ్‌తో ఎందుకు చేయాల్సివచ్చిందో చూద్దాం..

ముందుగా మహేశ్‌బాబు (Mahesh Babu)ని ఊహించుకుని సుకుమార్‌ ఆ స్టోరీని రాశారట. సాధ్యపడకపోవడంతో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో తీయాలనుకున్నారు. కానీ, అదీ వీలుపడలేదు. అలా ఎందుకు జరిగిందో గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకుమార్‌ ఇలా వివరించారు. ‘‘నా తొలి సినిమా ‘ఆర్య’కు ఎలాంటి అడ్డంకులు లేవు. కథ విన్నవారంతా బాగుందని, తెరకెక్కించేందుకు ఓకే చెప్పారు. అది సూపర్‌హిట్‌ అయింది. తదుపరి సినిమా విషయంలోనూ అలానే ఉంటుందనుకున్నా. ‘జగడం’ స్టోరీని ముందుగా మహేశ్‌ కోసం రాసుకున్నా. ఆ తర్వాత బన్నీని అనుకున్నా. నిర్మాత ఆ కథపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాకు కోపం వచ్చింది. రాత్రికి రాత్రే రామ్‌ను కలిసి, కథ చెప్పా. మరుసటి రోజు ఉదయం సినిమాని ప్రారంభించా. దాని ఓపెనింగ్‌కు బన్నీని, నిర్మాత దిల్‌ రాజుని ఆహ్వానించా. ‘కోపం వస్తే ఇలా చేసేస్తావా?’ అని దిల్‌ రాజు నన్ను ప్రశ్నించారు. బన్నీ కూడా అడిగాడు. అప్పుడు నాది అమాయకత్వం అని కొన్నాళ్లకు అర్థమైంది. ఆ చిత్రం ఫ్లాప్‌ అవడంతో నాలో మార్పొచ్చింది’’ అని వివరించిన సుకుమార్‌.. ఆ సినిమాలో రామ్‌ అద్భుతంగా నటించాడన్నారు. అదే చిత్రాన్ని రామ్‌తోనే రీమేక్‌ చేయాలనుందని మరో సందర్భంలో తెలిపారు.

అప్పుడు మహేశ్‌తో ‘జగడం’ తెరకెక్కించలేకపోయిన సుకుమార్‌ కొన్నాళ్ల తర్వాత ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. ‘ఆర్య’ తర్వాత సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య 2’, ‘పుష్ఫ’ రూపొందాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ ‘పుష్ఫ’ పార్ట్‌ 2తో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు