18 Pages Review: రివ్యూ: 18 పేజెస్‌

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా ‘18 పేజెస్‌’. ఈ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది.

Updated : 23 Dec 2022 17:19 IST

18 Pages Review చిత్రం: 18పేజెస్‌; నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయు, అజయ్, దినేష్‌ తేజ్, పోసాని కృష్ణమురళి, శత్రు తదితరులు; కూర్పు: నవీన్‌ నూలి; సంగీతం: గోపీ సుందర్‌; ఛాయాగ్రహణం: ఎ.వసంత్‌; కథ: సుకుమార్‌; దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌; నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌; విడుదల తేదీ: 23-12-2022.

వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు కథానాయకుడు నిఖిల్‌. ఇటీవల ‘కార్తికేయ2’తో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్నారు. ఇప్పుడా జోష్‌లోనే ‘18పేజెస్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో.. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఓ సరికొత్త ప్రేమకథతో రూపొందిన సినిమా కావడం.. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ ‘18పేజెస్‌’లో ఉన్న ప్రేమకథ సినీ ప్రియులకు ఎటువంటి అనుభూతి పంచింది? ఈ చిత్రంతో హీరో నిఖిల్, దర్శకుడు సూర్య ప్రతాప్‌ మరో హిట్టు అందుకున్నారా? లేదా? తెలుసుకుందాం పదండి..

కథేంటంటే: సిద్ధు అలియాస్‌ సిద్ధార్థ్‌ (నిఖిల్‌) యాప్‌ట్రీ కంపెనీలో యాప్‌ డెవలపర్‌గా పనిచేస్తుంటాడు. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ బాధలో దేవదాస్‌లా మందు కొట్టి.. రోడ్లపై తిరుగుతున్న సమయంలో అతనికొక డైరీ దొరుకుతుంది. విజయనగరంలోని అలజంకి అనే పల్లెటూరికి చెందిన నందిని (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయి 2019లో రాసుకున్న డైరీ అది. సాంకేతిక ప్రపంచానికి దూరంగా.. ప్రకృతికి, మానవ సంబంధాలకు దగ్గరగా జీవించే అమ్మాయి తను. ఆమె తాత మాట ప్రకారం వెంకట్రావు అనే వ్యక్తికి ఓ కవర్‌ అందించడం కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఆ డైరీ చదివి.. అందులోని నందిని వ్యక్తిత్వం నచ్చి.. ఆమెను చూడకుండానే తనతో ప్రేమలో పడతాడు సిద్ధు. తర్వాత డైరీలో ఉన్న ఆమె అడ్రెస్‌ను వెతుక్కుంటూ వాళ్ల ఇంటికి వెళ్తాడు. కానీ, అక్కడికి వెళ్లాక.. తను ఓ కారు ప్రమాదంలో చనిపోయినట్టు తెలిసి షాకవుతాడు. ఈ క్రమంలో డైరీలో ఉన్న ఘటనల ఆధారంగా రెండేళ్ల క్రితం తనకి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి అతడికి ఎలాంటి నిజాలు తెలిశాయి? నందిని నిజంగా చనిపోయిందా? లేదా? ఆమె తీసుకొచ్చిన కవర్‌లో ఏముంది? ఈ కథలో భాగీ (సరయు), సందీప్‌ (దినేష్‌ తేజ్‌), రాకేశ్‌ (అజయ్‌), మోజో (శత్రు)ల పాత్రలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: ప్రేమకథలు వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా. దీనికంటూ ప్రత్యేకంగా ఓ సీజన్‌ ఏమీ ఉండదు. ప్రతి వారం ఓ ప్రేమకథ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటుంది. అయితే వాటిలో వినూత్నమైన కోణంలో సాగి.. సరికొత్త అనుభూతిని పంచిన ప్రేమకథలకే పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇలాంటి వినూత్నమైన లవ్‌స్టోరీలకు చిరునామాగా నిలుస్తుంటారు దర్శకుడు సుకుమార్‌. ఆయన ‘18పేజెస్‌’ కోసం మరోసారి తనదైన శైలిలో సరికొత్త ప్రేమకథనే అందించారు. దాన్ని సూర్య ప్రతాప్‌ అంతే ఆహ్లాదభరితంగా తెరపై ఆవిష్కరించి.. మెప్పించారు. ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలున్నాయని.. ఈ ప్రేమకథ ప్రేక్షకులకు షాకివ్వడంతో పాటు సర్‌ప్రైజ్‌ చేస్తుందని నిఖిల్‌ ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. సినిమా చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తుంది. వాస్తవానికి ఒకరినొకరు చూసుకోకుండా లేఖల ద్వారానో.. ఇలా డైరీల ద్వారానో నాయకానాయికలు ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఇదీ ఆ కోవకు చెందినదే. కానీ, ఈ కథను ఈతరం ప్రేక్షకులు మెచ్చేలా ఓ కొత్త కోణంలో తెరపై చూపించిన తీరు.. అందులో ఇమిడ్చిన మలుపులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

సిద్ధు ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సినిమాని ప్రారంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ప్రీతి చేతిలో తను మోసపోయిన తీరు ఫన్నీగా అనిపిస్తుంది. అతడు నందిని డైరీ చదవడం ప్రారంభించాకే.. అసలు కథ మొదలవుతుంది. నందిని పాత్ర పరిచయ సన్నివేశాలు చాలా సింపుల్‌గా.. ఆకట్టుకునేలా ఉంటాయి. సెల్‌ఫోన్లకు.. సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయి జీవిస్తున్న ఈ తరానికి నందిని పాత్ర కొత్త అనుభూతిని పంచుతుంది. అలాంటి జీవనాన్ని మనమూ అలవర్చుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ డైరీ చదువుతూ.. సిద్ధు ఆమెతో ప్రేమలో పడటం.. ఆమెలా జీవించే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలతో సినిమా చక్కగా సాగిపోతుంటుంది. నిజానికి నందిని కథ గతంలోనూ.. సిద్ధు కథ వర్తమానంలోనూ సాగుతున్నా.. ప్రేక్షకులు ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేకుండా ఆ కథలతో ప్రయాణం చేసేస్తుంటారు. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తుంది. నందిని లేదని తెలిశాక.. డైరీ ఆధారంగా సిద్ధు ఆమెను వెతుక్కుంటూ చేసే ప్రయాణం మెప్పిస్తుంది. ఓ దశలో సినిమా థ్రిల్లర్‌ జానర్‌లోకి మారుతున్నట్టు అనిపిస్తుంది. నందిని యాక్సిడెంట్‌కు.. తను తీసుకొచ్చిన కవర్‌కు లింక్‌ ఉందని తెలిశాక అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ పెరుగుతుంది. కానీ, ఆ తర్వాత నుంచి సాగే కథ కాస్త గందరగోళంగా.. లాజిక్‌కు దూరంగా వెళ్తుందనే భావన కలుగుతుంది. పతాక సన్నివేశాలు థ్రిల్లింగ్‌గానే అనిపిస్తాయి. భావోద్వేగభరితంగా సినిమాని ముగించిన తీరు మెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే: సిద్ధు పాత్రలో లవర్‌ బాయ్‌లా క్యూట్‌గా కనిపించారు నిఖిల్‌. కంటికి కనిపించని అమ్మాయిని ప్రేమిస్తూ.. ఆమె రాతల్లో తనని భౌతికంగా చూస్తున్నట్లు ఫీలవుతూ.. అతడు పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయింది అనుపమ. ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సెల్‌ఫోనే ప్రపంచంగా బతుకుతున్న ఈతరం యువతకు ఆమె పాత్రతో మంచి సందేశమిచ్చారు దర్శకుడు. అలాగే ప్రేమ విఫలమైనప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలన్నదీ సిద్ధు పాత్రతో చక్కగా చెప్పారు. సిద్ధు స్నేహితురాలిగా భాగీ పాత్రలో సరయు నటన ఆకట్టుకుంది. ఆమె కొన్ని సన్నివేశాల్లో తనదైన పంచ్‌లతో నవ్వించే ప్రయత్నం చేసింది. పోసాని కృష్ణ మురళి, అజయ్, దినేష్‌ తేజ్, శత్రుల పాత్రలు చిన్నవే అయినా ఉన్నంతలో ఆకట్టుకునేలా చేశారు. లవ్‌స్టోరీకి కాస్తంత థ్రిల్లర్‌ టచ్‌ ఇస్తూ.. అందులో ఈతరానికి అవసరమైన సందేశాల్ని దట్టించి దర్శకుడు సుకుమార్‌ రాసుకున్న కథ బాగుంది. దాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించారు సూర్య ప్రతాప్‌. గోపీ సుందర్‌ పాటలు, నేపథ్య సంగీతం కథకు మరింత బలాన్ని అందించాయి. ఛాయాగ్రహణం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు: 👍 కథా నేపథ్యం 👍నిఖిల్, అనుపమ పాత్రలు 👍 కథలోని మలుపులు 👍 సంగీతం

బలహీనతలు: 👎నెమ్మదిగా సాగే కథనం 👎 ద్వితీయార్ధం

చివరిగా: మదిని హత్తుకునే ప్రేమకథా చిత్రం.. ‘18పేజెస్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని