18 Pages: ఓటీటీలో నిఖిల్‌-అనుపమ ‘18 పేజెస్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ‘18 పేజెస్‌’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది

Published : 16 Jan 2023 01:55 IST

హైదరాబాద్‌: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ‘18 పేజెస్‌’. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. క్రిస్మస్‌ కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు, ఏకంగా రెండు వేదికల్లో ఇది అందుబాటులోకి రానుంది. జనవరి 27వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ఆహాతో పాటు, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగానూ స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే: సిద్ధు అలియాస్‌ సిద్ధార్థ్‌ (నిఖిల్‌) యాప్‌ట్రీ కంపెనీలో యాప్‌ డెవలపర్‌గా పనిచేస్తుంటాడు. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ బాధలో దేవదాస్‌లా మందు కొట్టి.. రోడ్లపై తిరుగుతున్న సమయంలో అతనికొక డైరీ దొరుకుతుంది. విజయనగరంలోని అలజంకి అనే పల్లెటూరికి చెందిన నందిని (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయి 2019లో రాసుకున్న డైరీ అది. సాంకేతిక ప్రపంచానికి దూరంగా.. ప్రకృతికి, మానవ సంబంధాలకు దగ్గరగా జీవించే అమ్మాయి తను. ఆమె తాత మాట ప్రకారం వెంకట్రావు అనే వ్యక్తికి ఓ కవర్‌ అందించడం కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఆ డైరీ చదివి.. అందులోని నందిని వ్యక్తిత్వం నచ్చి.. ఆమెను చూడకుండానే తనతో ప్రేమలో పడతాడు సిద్ధు. తర్వాత డైరీలో ఉన్న ఆమె అడ్రస్‌ను వెతుక్కుంటూ వాళ్ల ఇంటికి వెళ్తాడు. కానీ, అక్కడికి వెళ్లాక.. తను ఓ కారు ప్రమాదంలో చనిపోయినట్టు తెలిసి షాకవుతాడు. ఈ క్రమంలో డైరీలో ఉన్న ఘటనల ఆధారంగా రెండేళ్ల క్రితం తనకి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి అతడికి ఎలాంటి నిజాలు తెలిశాయి? నందిని నిజంగా చనిపోయిందా? లేదా? ఆమె తీసుకొచ్చిన కవర్‌లో ఏముంది? ఈ కథలో భాగీ (సరయు), సందీప్‌ (దినేష్‌ తేజ్‌), రాకేశ్‌ (అజయ్‌), మోజో (శత్రు)ల పాత్రలేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని