Krishnam Vande Jagadgurum: ఇది కళ నిద్రలేపేది.. పదేళ్ల ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’

రానా హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. 

Updated : 30 Nov 2022 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మత్స్యం నుంచి కృష్ణుడి వరకు, పశువు నుంచి పశుపతి వరకు మనిషి ఎలా ఎదిగాలో చూపించిన ‘జగన్నాటకం’ అది. భాగవతలీలల అంతరార్థాన్ని చెప్పిన దృశ్యకావ్యం అది. అదే ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ (Krishnam Vande Jagadgurum) చిత్రం. రానా (Rana), నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు క్రిష్‌ (Krish) తెరకెక్కించిన ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాటి సంగతులు గుర్తుచేసుకుందాం..

మూడు కథలతో..

క్రిష్‌కు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) అంటే ప్రత్యేక అభిమానం. తన ప్రతి సినిమాలో సిరివెన్నెల పాట ఉండేలా చూసుకుంటారాయన. సిరివెన్నెల.. క్రిష్‌కు ఓసారి జగద్గురువు తత్వం గురించి చెప్పారట. ఆ క్రమంలో దశావతారాల కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన క్రిష్‌కు తట్టింది. అప్పటికే ‘సురభి నాటకాలు’ కథాంశంగా డ్యాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. మరోవైపు, మైనింగ్‌ మాఫియా అక్రమాలనూ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. మరి, ఒక్కొక్కటి ఒక్కో నేపథ్యం.. ఏం చేయాలి? ఈ సందిగ్ధంలో పడిన క్రిష్‌ బాగా ఆలోచించి మూడింటిని కలిపి ఓ కథగా మలచాలనుకున్నారు. కమర్షియల్‌ హంగులకు తగ్గట్టు ఆ మూడు నేపథ్యాలతో పక్కాగా ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకుని, దానికి ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ టైటిల్‌ పెట్టారు.

అవి అలా.. ఇది ఇలా

తొలి చిత్రం ‘గమ్యం’తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. విమర్శకుల ప్రశంసలూ పొందిన ఆయన రెండో ప్రయత్నంగా ‘వేదం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సైతం మంచి విజయం అందుకుంది. ఇదే సినిమా తమిళంలో రీమేక్‌ చేసిన క్రిష్‌ ఆ తర్వాత ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ తీశారు. ఈ మూడు కథల్లోని ప్రధాన పాత్రల గురించి క్రిష్‌ ఓ సందర్భంలో ఇలా వివరించారు. ‘‘గమ్యం’.. సమాజంలోని  ఓ వ్యక్తి కథ. ‘వేదం’.. సమాజంలోని కొందరు వ్యక్తుల కథ. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’.. ఓ వ్యక్తిలోని సమాజాన్ని చూపించే కథ’’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

సవాలు విసిరిన పాట..

ఈ సినిమా ఇతివృత్తాన్ని చాటి చెప్పడంలో టైటిల్‌ గీతం ప్రధాన పాత్ర పోషించింది. ‘వందే కృష్ణం జగద్గురుమ్‌.. కృష్ణం వందే జగద్గురుమ్‌’ అంటూ తన గానంతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మత్య్స, కూర్మ, వరాహ అవతారాల గురించి వివరించే ఈ పాటను ఎంతో రీసెర్చ్‌ చేసి సుమారు రెండున్నర నెలల్లో రాశారు రచయిత సీతారామశాస్త్రి. ముందుగా ఈ గీతం నిడివి 15 నిమిషాలుకాగా 12 నిమిషాలకు కుదించారు. ప్రేక్షకులు/శ్రోతలు అంత సమయం ఉంటే పాటను ఆస్వాదించలేరేమోనన్న సందేహంతో క్రిష్‌ దాన్ని 9 నిమిషాల 20 సెకన్లు ఉండేలా చేశారు.

ప్రతి పాత్రా ప్రత్యేకమే..

హీరోహీరోయిన్‌ మాత్రమేకాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రా ప్రత్యేకంగా నిలుస్తుంది. నాటకాలు వేసే బీటెక్‌ బాబుగా రానా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌గా నయనతార, సురభి సుబ్రహ్మణ్యంగా కోట శ్రీనివాసరావు, మట్టిరాజుగా ఎల్బీ శ్రీరామ్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేస్తే, బ్రహ్మానందం, సత్యం రాజేశ్‌, రఘుబాబు, హేమ, పోసాని కృష్ణ మురళి తదితరులు నవ్వులు పంచారు. ప్రముఖ నటుడు వెంకటేశ్‌, నటి సమీరా రెడ్డి ఓ ప్రత్యేక గీతంతో సందడి చేశారు. 2012 నవంబరు 30న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.

చప్పట్లు కొట్టించిన సంభాషణలు..

  • అది కల నిద్రలో కనేది.. ఇది కళ నిద్ర లేపేది. 
  • దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడన్నారు. ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు. తాత రాసింది దేవుడి గురించి కాదు సాయం గురించి.
  • అవకాశం ఉన్నవాడికి అవసరం ఉండదు. అవసరం ఉన్నవాడికి అవకాశంరాదు.
  • చచ్చాక ఏడ్చే వాళ్లుంటే చచ్చినా బతికున్నట్టే.. అదే చావు కోసం ఎదురుచూసే వాళ్లుంటే బతికున్నా చచ్చినట్టే.
  • నాటకం రైలు ప్రయాణంలాంటిది. అది ఒకడి కోసం ఆగదు, ఒక్కడున్నా ఆగదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని