Nuvve Nuvve: ‘నువ్వే నువ్వే’ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం: త్రివిక్రమ్‌

తాము రూపొందించిన ‘నువ్వే నువ్వే’ చిత్రాన్ని గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నామని తెలిపారు దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత రవికిశోర్‌.

Updated : 16 Nov 2023 14:56 IST

హైదరాబాద్‌: తాము రూపొందించిన ‘నువ్వే నువ్వే’ (Nuvve Nuvve) చిత్రాన్ని గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నామని దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram), నిర్మాత రవికిశోర్‌ (Ravi Kishore) తెలిపారు. తరుణ్‌ (tarun) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సోమవారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నగరంలోని ఎ.ఎం.బి. సినిమాస్‌లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది. దర్శకనిర్మాతలు, హీరో తరుణ్‌, హీరోయిన్‌ శ్రియ తదితరులు పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. 

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతున్న సమయమది. రవి కిశోర్ గారు, నేనూ ఆ హౌస్‌ పక్కనున్న ఖాళీ స్థలంలో అటూఇటూ తిరిగేటప్పుడు నేను ఆయనకు కథ చెప్పా. వెంటనే ఆయన చెక్ బుక్ తీసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రచయితగా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో.. దాదాపుగా అంతే డబ్బును అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన 'నువ్వే కావాలి' షూటింగ్‌ అవుతోంది. నేను ఏం చేయగలనో తెలియదు కానీ, నేను చెప్పిన కథ విని నన్ను రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు.

‘‘మద్రాసులో ‘నీరం’ చూసి అందులో సన్నివేశాలను నాకు ఇష్టం వచ్చినట్లు ఎలా మార్చేయాలో చెబుతుంటే రవికిశోర్ గారు విన్నారు. ‘స్వయం వరం’ సినిమాకు మాటలు రాసిన తర్వాత నేను భీమవరంలో ఉండగా మా ఇంటి పక్కన ఎస్‌టీడీ బూత్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ కథను మీరు అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెబుతానని రవికిశోర్‌ గారితో వాదిస్తే ‘నీ ఇష్టం వచ్చినట్టు చేయ్‌’ అని ప్రోత్సహించారు. రాత్రిపూట స్క్రిప్ట్ చదివి నేను రాసిన డైలాగ్ నచ్చడంతో ఆయన ఫోన్ చేసి ఏడ్చారు. ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడిని నాకు చూపించినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి’’

‘‘నువ్వే నువ్వే’ కోసం దిల్లీకి వెళ్లి శ్రియ‌తో పాటు ఆమె తల్లికి  కథ చెప్పటం, శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వటం.. ఇలా అన్నీ గుర్తున్నాయి. షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్‌తోనే ఓ యాక్షన్‌ సీన్  చేయించా. అప్పుడే నాలో వయలెన్స్ ఉందని అర్థమైంది. ‘అతడు’ చిత్రం చూసిన వెంకటేశ్‌గారు ‘నువ్వు చూడటానికి సాఫ్ట్‌గా ఉంటావ్‌.  సినిమా వైలెంట్‌గా తీశావ్’ అని అన్నారు’’

‘‘నాలో ఉన్న రచయిత, దర్శకుడిని నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడిన వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా. ఆయన నాకు సోదరుడిలాంటివారు. రవికిశోర్‌, సీతారామశాస్త్రిగారి మధ్య ఉన్న అనుబంధాన్ని నేను ఇంకెవ్వరి దగ్గర చూడలేదు. ‘గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?’ అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఈ చిత్రాన్ని ఆయనకు నివాళిగా అంకితం చేస్తున్నాం ’’ అని త్రివిక్రమ్‌ అన్నారు. 

రవికిశోర్ మాట్లాడుతూ ‘‘నాకు ‘నువ్వే కావాలి’ సినిమా సమయంలో త్రివిక్రమ్ కథ చెప్పాడు. 2002లో ప్రారంభించి, ఆ ఏడాదే విడుదల చేశాం. త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు ఇందులో తండ్రి పాత్ర ప్రకాశ్ రాజ్ మాత్రమే చేయాలని అతణ్ని ఫిక్స్ చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్’ షూటింగ్ టైమ్‌లో ప్రకాశ్‌పై నిషేధం ఉండటంతో ఆయనలేని సన్నివేశాలను ముందుగా చిత్రకరించాం. ఆయన తప్ప ఆ సినిమాలోని  పాత్రకు ఎవరూ న్యాయం చేయలేకపోయేవారు. ‘నువ్వే నువ్వే’లో కూడా అంతే. అద్భుతంగా నటించారు. త్రివిక్రమ్ ఒక వండర్. మేజిక్ క్రియేట్ చేస్తాడు. నేను రాముడు అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకపోవడం బాధాకరం. ఆయనతో నాకున్న అనుబంధం గురించి చెప్పడానికి మాటలు రావటం లేదు. మా సంస్థలో వచ్చిన సినిమాలకు ఆయన సుమారు 90 పాటలు రాశారు. ఆయన పాట రాయటం పూర్తయ్యాక నా కళ్ళలోకి చూసి నచ్చిందో లేదో చెప్పేవారు. ‘నువ్వే నువ్వే’ను ఆయనకు అంకితం ఇస్తున్నాం’’ అని రవికిశోర్‌ తెలిపారు.

తరుణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా విడుదలై 20 ఏళ్లు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్‌లో ఈ సినిమా చూస్తా. నన్ను ‘నువ్వే కావాలి’తో రామోజీరావుగారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ 
సినిమాలు చేశా. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమా మరోటి చేయమని చాలా మంది అడుగుతున్నారు. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే.. ఎప్పటికీ బోర్ కొట్టవు’’ అని తరుణ్‌ చెప్పారు.

ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదని రవికిశోర్‌గారు అన్నారు. మేమంతా లేకపోతే ‘నువ్వే నువ్వే’ లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సమయంలో నన్ను బ్యాన్ చేస్తే... బ్యాన్‌ వైదొలిగే వరకూ ఈ చిత్ర బృందం నా కోసం వేచి చూసింది. సినిమాని ఎంతో ప్రేమించే రవికిశోర్, త్రివిక్రమ్‌తో చేసిన ప్రయాణాన్ని మరిచిపోలేను. త్రివిక్రమ్ దర్శకుడుకాక ముందే రచయితగా నాకు తెలుసు. నా కోసమే మాటలు రాసేవాడని అనిపించేది’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 

శ్రియ మాట్లాడుతూ.. ‘‘త్రివిక్రమ్‌, రవి కిశోర్ గారు నా కోసం దిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. తరుణ్ స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఈ సినిమా మరిచిపోలేని జ్ఞాపకం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని