Khadgam: శ్రీకాంత్‌ను తీసుకోకపోతే మరో రెండు కోట్లు ఇస్తానన్నా, వద్దన్న కృష్ణవంశీ..!

‘ఖడ్గం’ నవంబరు 29, 2002న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో కేవలం 72 రోజుల షూటింగ్‌ పూర్తి చేశారు.

Published : 30 Nov 2022 01:31 IST

అది 2002. అప్పటికే ‘మురారి’ తీసి మంచి విజయాన్ని అందుకున్నారు కృష్ణవంశీ. మధ్యలో ఓ హిందీ సినిమా తీశారు. మరి తర్వాత ఏంటి? కాలేజీ చదువుకునే రోజుల్లో నుంచే కృష్ణవంశీకి విప్లవ భావాలు ఎక్కువ. ఆ స్ఫూర్తితోనే తన మూడో చిత్రంగా ‘సింధూరం’ తీశారు. మంచి పేరు వచ్చింది. కానీ, డబ్బులు రాలేదు. దేశభక్తి నేపథ్యంలో స్ఫూర్తినింపేలా ఓ సినిమా తీయాలన్నది వంశీ కల. కానీ, ఈసారి డబ్బూ పేరు రెండూ రావాలి. అదే సమయంలో తన మార్కు టేకింగ్‌ ఉండాలి. 1990లో ముంబయిలో ఉగ్రదాడి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దాన్ని అలాగే తీస్తే, మళ్లీ మరో ‘సింధూరం’ అవుతుందని కృష్ణవంశీకి తెలుసు. అందుకే ఆ కథకు కాస్త కమర్షియాలిటీని, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించారు. అన్నీ సమపాళ్లలో కుదిరేలా కథను సిద్ధం చేశారు. ఉగ్రవాదుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెలిసిన పోలీస్‌ ఆఫీసర్‌ ద్వారా జైలుకు వెళ్లి అధ్యయనం చేశారు.

అగ్ర కథానాయకుల కంటే యువ నటులతో సినిమా తీయడానికే కృష్ణవంశీ ఆసక్తి కనబరుస్తారు. అదే సమయంలో అటు విలన్‌గానూ, ఇటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు ప్రకాశ్‌రాజ్‌. ఆయన డైలాగ్‌ డెలవరీ, యాక్షన్‌ ముస్లిం అయిన అంజాద్‌ పాత్రకు సరిపోతుందని అనుకున్నారు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్నా.. హీరో అయ్యే అవకాశం దొరక్క ‘ఒక్కఛాన్స్‌’ కోసం వేచి చూసే యువకుడి పాత్రలో రవితేజను తీసుకున్నారు. ఒక రకంగా రవితేజ అలా ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చినవాడే. మరి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు ఎవరు? ఈ పాత్ర కోసం నిర్మాత వేరొకరి పేరు సూచించారు. కానీ, కృష్ణవంశీ మదిలో శ్రీకాంత్‌ ఉన్నాడు. నిర్మాత మాత్రం శ్రీకాంత్‌ వద్దని చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికి శ్రీకాంత్‌ లవ్‌, ఫ్యామిలీ డ్రామా మూవీస్‌లో టాప్‌ హీరో. వరుస సినిమాలతో తీరికలేకుండా గడిపేవారు. ఆ రోజు కృష్ణవంశీ ఆఫీస్‌కు శ్రీకాంత్‌ను పిలిచారు. ఎదురుగానే నిర్మాత సుంకర మధు మురళి ఉన్నారు. ‘పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు నిన్ను తీసుకోవద్దని మురళి అంటున్నాడు. ఏం చేయమంటావు’ అని కృష్ణవంశీ ఓపెన్‌ అయిపోయారు. అక్కడే ఉన్న మధు మురళి ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని ‘శ్రీకాంత్‌ మీరు ఫ్యామిలీ హీరోగా చేస్తున్నారు. ఇదేమో పవర్‌ఫుల్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ అందుకే వద్దని చెప్పా’ అని సమాధానపరిచే ప్రయత్నం చేశారు. కృష్ణ వంశీ మాత్రం గట్టి పట్టుబట్టారు. అప్పుడు మధు మురళి ‘శ్రీకాంత్‌ను తీసుకోకపోతే ఇంకో రెండు కోట్లు అయినా ఇస్తా’నని ఓపెన్‌ ఆఫర్‌. కానీ, కృష్ణవంశీకి శ్రీకాంత్‌పై నమ్మకం. ఎట్టకేలకు ఆ పాత్ర శ్రీకాంత్‌కే దక్కింది. రాధాకృష్ణగా శ్రీకాంత్‌, కోటిగా రవితేజ, అంజాద్‌ఖాన్‌గా ప్రకాశ్‌రాజ్‌ ఎంపికయ్యారు. ఈ ముగ్గురు నటులతో కృష్ణవంశీ తీసిన ఆ చిత్రమే ‘ఖడ్గం’ (Khadgam) నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఇది కథ: కోటి (రవితేజ) హీరో అవుదామని కృష్ణానగర్‌లోకు వస్తాడు. అంజాద్‌ (ప్రకాశ్‌రాజ్‌) ఆటో డ్రైవర్‌. తన మతం పట్ల ఎంత భక్తి ఉందో.. ఇతరుల మతం పట్ల కూడా అంతే గౌరవంతో ఉంటాడు. అంజాద్‌ సోదరుడు అజార్‌ (షఫీ) కనిపించకుండా పోతాడు. అదే సమయంలో హైదరాబాద్‌ పోలీసులు ఐఎస్‌ఐ తీవ్రవాది మసూద్‌ను పట్టుకుంటారు. కనిపించకుండా పోయిన అజార్‌ పాకిస్థాన్‌లో శిక్షణ తీసుకుని, మసూద్‌ను విడిపించడానికి మతకల్లోలాలు సృష్టించే పనిలో ఉంటాడు. రాధాకృష్ణ (శ్రీకాంత్‌) నిజాయతీ కలిగి పోలీస్‌ ఆఫీసర్‌. తను ఎంతో ప్రేమించి అమ్మాయి స్వాతి (సోనాలి బింద్రే)ను తీవ్రవాదాలు చంపేస్తారు. ఈ క్రమంలో మత కల్లోలాలు సృష్టించడానికి యత్నించిన అజార్‌ను రాధాకృష్ణ ఎలా పట్టుకున్నాడు? తన సోదరుడు అజార్‌ వల్ల అంజాద్‌కు వచ్చిన ఇబ్బందులు ఏంటి? కోటికి ‘ఒక్కఛాన్స్‌’ దక్కిందా? అతను హీరో అయ్యాడా? అనేది మిగతా కథ.

2002 నవంబర్‌ 29న విడుదలైన ‘ఖడ్గం’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో కేవలం 72 రోజుల షూటింగ్‌ పూర్తి చేశారు. పోలీస్‌ ఆఫీసర్‌గా చేయలేడన్న శ్రీకాంత్‌ అదరగొట్టాడు. ప్రకాశ్‌రాజ్‌ తనదైన సంభాషణలతో అలరించారు. ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం’ అంటూ ముస్లింల గురించి ఆయన చెప్పే సంభాషణలు ఉద్విగ్నాన్ని కలిగించాయి. సీనియర్‌ హీరో పాత్ర పోషించిన పృథ్వీ చేయి పట్టుకున్నందుకు అవమానం పాలై, గుక్కతిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పే యువ నటుడిగా రవితేజ నవ్వులు పంచడమే కాదు.. అదరగొట్టారు. ఈ సినిమాతోనే పృథ్వీకి ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పేరు పాపులర్‌ అయింది. బ్రహ్మాజీ, సంగీత, షఫీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. అవార్డులను సైతం ఈ సినిమా తెచ్చి పెట్టింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌, ఉత్తమ మేకప్‌, నంది స్పెషల్‌ జ్యూరీ (రవితేజ) వచ్చాయి. మూడు కేటగిరీల్లో ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డులు వచ్చాయి.

అదిరిపోయే పాటలు ఇచ్చిన దేవి

ఈ సినిమాకు దర్శకుడు, నటీనటులు ఒక ఎత్తయితే.. సంగీతం మరోస్థాయిలో ఉంటుంది. ఇందులోని అన్ని పాటలూ  హిట్‌. దేవిశ్రీ తన మ్యాజిక్‌ చూపించారు. ‘నువ్వు నువ్వు’ మెలోడీ ఎవరూ మర్చిపోలేరు. ఇక ‘మేమే ఇండియన్స్‌’, ‘ఖడ్గం’ వంటి పాటలు ఇప్పటికీ స్వాతంత్ర్యదినోత్సవం రోజున వినిపిస్తూనే ఉంటాయి. హిందీలో ఈ చిత్రం ‘మర్తే దమ్‌’గా డబ్‌ అవ్వగా, తమిళ్‌లో ‘మాణిక్‌ బాషా’గా, భోజ్‌పురిలో ‘భీమ్‌సాల్‌హై హమ్‌’గా రీమేక్‌ అయింది. ఈ సినిమా విడుదల తర్వాత కృష్ణవంశీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్స్‌ కూడా వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో కృష్ణవంశీ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని