Telugu Movies: ‘హనుమాన్‌’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్‌ ఫస్టాఫ్‌ రిపోర్టు

2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్‌ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్‌, ఏది ఫట్‌ అంటే?

Published : 28 Jun 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ శుక్రవారం ఎవరిని స్టార్‌ని చేస్తుందో.. ఏ చిత్రానికి విజయం అందిస్తుందో ఎవరికీ తెలియదు. అంచనాలున్న కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరుస్తుంటాయి. విడుదలకు ముందు ఎలాంటి సౌండ్‌లేని పలు ప్రాజెక్టులు బరిలో దిగాక రీసౌండ్‌ చేస్తుంటాయి. మరి, 2024లో ఏ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంది? ఈ ఏడాది ఆర్నెల్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ ప్రోగ్రెస్‌ రిపోర్టు చూద్దాం..

కొత్త ఏడాది.. కొత్త నటుడితో

జనవరి: ‘సర్కారు నౌకరి’ (జనవరి 1)తో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది టాలీవుడ్. గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా పరిచయమైన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. తర్వాత.. ‘దీనమ్మ జీవితం’, ‘14 డేస్‌ లవ్‌’, ‘ప్రేమకథ’, ‘రాఘవ రెడ్డి’, ‘డబుల్‌ ఇంజిన్‌’ తదితర చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకొచ్చి, పరాజయాన్నే అందుకున్నాయి. ఎప్పటిలానే ఈ సంక్రాంతి సీజనూ ఆసక్తికర పోటీకి దారి తీసింది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)తో మహేశ్‌ బాబు, ‘నా సామి రంగ’ (Naa Saami Ranga)తో నాగార్జున, ‘సైంధవ్‌’ (Saindhav)తో వెంకటేశ్‌ బరిలో దిగగా ‘హనుమాన్‌’ (Hanu-Man)తో యంగ్‌ హీరో తేజ సజ్జా ఆడియన్స్‌ ముందుకొచ్చారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ రిలీజైన సంక్రాంతి చిత్రాల్లో నం. 1గా నిలిచి, అరుదైన రికార్డు సృష్టించింది ‘హనుమాన్‌’. ఈ సినిమా వసూళ్లు రూ.300 కోట్లకుపైనే. అనుభవజ్ఞుడైన దర్శకుడు, అగ్ర నటుడు లేకపోయినా కథా బలం, మౌత్‌టాక్‌ ఎంతటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడానికి ఆ చిత్రం ఓ ఉదాహరణ. కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తర్వాత వరుసగా ‘గుంటూరు కారం’, ‘నా సామిరంగ’, ‘సైంధవ్‌’ నిలిచాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలైన ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌’, ‘బిఫోర్‌ మ్యారేజ్‌’ వంటి సినిమాలు ఏమాత్రం సందడి చేయలేదు.

ఫిబ్రవరి: తొలి వారంలో సుహాస్‌ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మినహా ‘కిస్మత్‌’, ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘బూట్‌కట్‌ బాలరాజు’, ‘గేమ్‌ ఆన్‌’ వంటి చిత్రాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చాటలేదు. రెండో వారంలో రవితేజ ‘ఈగల్‌’, మమ్ముట్టి ‘యాత్ర 2’రాగా ‘ఈగల్‌’ ఫర్వాలేదనిపించింది. మరుసటి వారం సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకుల్ని అలరించారు. చివరి వారంలో ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’, ‘రాజధాని ఫైల్స్‌’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ తదితర చిత్రాలు ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయాయి. వైవా హర్ష కథానాయకుడిగా పరిచయమైన ‘సుందరం మాస్టర్‌’ కొన్ని నవ్వులు పంచింది.

వేసవి మెరుపులు..

మార్చి: ఈసారి వేసవి సీజన్‌లో ఒక్క అగ్ర హీరో సినిమా విడుదలకాకపోవడం గమనార్హం. మార్చి తొలి వారం వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో పాటు ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్‌ 13’ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అన్నీ డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రెండో వారం గోపీచంద్‌ ‘భీమా’తో, విష్వక్‌ సేన్‌ ‘గామి’తో బాక్సాఫీస్‌ బరిలో తలపడగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మూడో వారంలో ‘రజాకార్‌’, ‘లంబసింగి’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘వెయ్‌ దరువెయ్‌’.. ఇలా అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వరుస కట్టినా హిట్టు మాట వినిపించలేదు. శ్రీవిష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’ అంటూ వినోదాల జల్లు కురిపించారు. ‘టిల్లు స్క్వేర్‌’తో మార్చికి మంచి ఎండ్‌ కార్డు వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో ఆయన రూ. 100 కోట్ల క్లబ్‌లో తొలిసారి జాయిన్‌ అయ్యారు. దీంతోపాటు చివరి వారంలో వచ్చిన ‘తలకోన’, ‘కలియుగ పట్టణంలో’ వంటి సినిమాలు మ్యాజిక్‌ చేయలేపోయాయి.

ఏప్రిల్‌: ఫస్ట్‌వీక్‌లో అంచనాల నడుమ విడుదలైన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) వాటిని అందుకోలేకపోయింది. ‘భరతనాట్యం’, ‘బహుముఖం’ మెరవలేకపోయాయి. రెండో వారంలో అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓకే అనిపించిందిగానీ కార్తీక్ రత్నం, సుహాస్‌ల ‘శ్రీరంగనీతులు’ మెప్పించలేకపోయింది. ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ మినహా మూడు, నాలుగు వారాల్లో ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న ఏ ఒక్క నటుడి చిత్రం విడుదలకాలేదు. సునీల్‌, శ్రద్ధాదాస్‌, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పారిజాతపర్వం’ ఫర్వాలేదనిపించింది. కేరింత ఫేమ్‌ పార్వతీశం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ బిజినెస్‌ చేయలేకపోయింది.

ప్రత్యేకమేగానీ..

మే: పలువురు హీరోలు విభిన్న కోణాలు ఆవిష్కరించిన చిత్రాలు మే, జూన్‌లో విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. కొంత గ్యాప్‌ తర్వాత అల్లరి నరేశ్‌ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. కామెడీ టైమింగ్‌లో ఒకప్పటి నరేశ్‌ కనిపించినా నవ్వులు పెద్దగా పండలేదు. దీంతోపాటు తొలివారంలో విడుదలైన సుహాస్‌ ‘ప్రసన్నవదనం’ థ్రిల్‌ పంచింది. రెండో వారంలో రిలీజైన ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ‘ఆరంభం’ మంచి ప్రయత్నం అనిపించుకుంది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కృష్ణమ్మ’. విజయం మాట ఎలా ఉన్నా హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి. పాత్రికేయుడు మూర్తి తెరకెక్కించిన తొలి చిత్రం ‘ప్రతినిధి 2’ ఆలోచింపజేసింది. ఇందులో నారా రోహిత్‌ హీరో. వీటికి తోడుగా వచ్చిన ‘లక్ష్మీ కటాక్షం’, ‘బ్రహ్మచారి’ వంటి సినిమాలు ఫెయిలయ్యాయి. ‘అక్కడవారు ఇక్కడ ఉన్నారు’, ‘నట రత్నాలు’, ‘బిగ్‌ బ్రదర్‌’, ‘సీడీ’, ‘సిల్క్‌ శారీ’, ‘డర్టీ ఫెలో’ వంటి సినిమాలు అదే నెలలో వచ్చాయనే విషయం చాలామంది తెలియదు. గెటప్‌ శ్రీను హీరోగా లాంచ్‌ అయిన ‘రాజు యాదవ్‌’ ఆశించినంతగా అలరించలేకపోయింది. ఆశిష్‌ రెడ్డి రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘లవ్‌ మీ’, కార్తికేయ ‘భజే వాయు వేగం’, విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఆయా కథానాయకులను కొత్తగా చూపాయి. ‘బేబీ’తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఆనంద్‌ దేవరకొండ ‘గం..గం.. గణేశా’తో మంచి వినోదం పంచారు.

జూన్‌: ‘2. ఓ’గా నవదీప్‌ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్న చిత్రం ‘లవ్‌ మౌళి’, శర్వానంద్‌ 35వ సినిమా ‘మనమే’, కాజల్‌ అగర్వాల్‌ ‘సత్యభామ’, ‘ఓసీ’, ‘ప్రేమించొద్దు’, ‘రక్షణ’ వంటి ప్రాజెక్టులు తొలివారంలో బాక్సాఫీసు ముందుకొచ్చాయి. ‘మనమే’ తప్ప మిగిలినవన్నీ మెప్పించలేదు. రెండో వారంలో ‘హరోం హర’తో సుధీర్‌ బాబు కొత్త తరహా యాక్షన్‌ చూపించారు. చాందిని చౌదరి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు (జూన్‌ 14) రావడం విశేషం. కానీ, ఫలితం విషయంలో నిరాశే. ‘మ్యూజిక్‌షాప్‌ మూర్తి’, ‘యేవమ్‌’ ఆమె నుంచి వచ్చిన చిత్రాలు. మరుసటి వారం రిలీజైన ‘నింద’తో కొత్త వరుణ్‌ సందేశ్‌ ప్రేక్షకులను పలకరించారు. ‘ఓ మంచి ఘోస్ట్‌’, ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘అంతిమ తీర్పు’.. ఇలాంటి పలు చిన్న చిత్రాలు విడుదలకాగా ప్రేక్షకులు వాటికి ఎలాంటి తీర్పు ఇవ్వలేకపోయారు.

ఆఖరి వారం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) విడుదల ఉందని తెలియడంతో మరే చిత్ర బృందం బాక్సాఫీసు ముందుకొచ్చే సాహసం చేయలేదు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ తొలి ఆట నుంచే హిట్టు మాటతో దూసుకెళ్తోంది. గురువారం విడుదలైన ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్టు తొలి రోజు రూ. 191.5 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రం ‘హనుమాన్‌’ కాగా ‘కల్కి’ దాన్ని త్వరలో అధిగమించనుంది. 2024 సెకండాఫ్‌లో అగ్ర హీరోల సినిమాలు వరుసగా రానున్నాయి. ఆ వివరాల కోసం క్లిక్‌ చేయండి..

అనువాదాలు ఇలా..

కంటెంట్‌ బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో పలువురు మేకర్స్‌ పరభాషా చిత్రాలను డబ్‌ చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంటారు. పాన్‌ ఇండియా ట్రెండ్‌లో భాగంగా మరికొన్ని వస్తుంటాయి. అలా ఈ ఏడాది వచ్చిన వాటిలో ‘ప్రేమలు’ మంచి సక్సెస్‌ అయింది. మమ్ముట్టి ‘భ్రయముగం’ అదుర్స్‌ అనిపించుకుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడుజీవితం’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. విజయ్‌ సేతుపతి ‘మహారాజ’ థ్రిల్‌ చేసింది. ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ‘శబరి’ వంటి సినిమాలు సత్తా చాటలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని