24ఏళ్ల బాల ‘రాముడు’

ఒక సినిమా హీరోగా నటన.. డ్యాన్సు.. డైలాగులు.. ఈ లక్షణాలన్నీ ఉన్న హీరో ఎవరంటే వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చెప్పేస్తారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తెరమీదకు వచ్చి.. పాతికేళ్లయింది.

Published : 15 Apr 2021 16:48 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ తొలి సినిమాకే జాతీయ పురస్కారం

ఇంటర్నెట్‌ డెస్క్‌:  నటన.. డ్యాన్సు.. డైలాగులు.. ఈ లక్షణాలన్నీ ఉన్న హీరో ఎవరంటే వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చెప్పేస్తారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తెరమీదకు వచ్చి 24ఏళ్లు అయింది. సినీజనం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాన్ని తొలి సినిమాతోనే సొంతం చేసుకున్న ఘనత తారక్‌ది. గుణశేఖర్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘రామాయణం’. 1997లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అందర్నీ ఎంతగానో అలరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో బాలరాముడిగా కనిపించిన తారక్‌.. తన నటనతో అందర్నీ ముగ్దుల్ని చేశారు. సీతాదేవిగా స్మితమాధవ్‌, రావణుడిగా స్వాతికుమార్‌, లక్ష్మణుడిగా నారాయణమ్‌ నిఖిల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. మాధవపెద్ది సురేశ్‌, వైద్యనాథన్‌ సంగీతం అందించారు.

జాతీయ పురస్కారం అందుకుంటున్న డైరెక్టర్‌ గుణశేఖర్‌

రామాయణంలో బాలనటుడిగా కనిపించిన తారక్‌ తెరవెనుక విపరీతమైన అల్లరి చేసేవారట. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. చిత్రంలో చాలా మంది బాలనటులు ఉండటంతో వాళ్లందరినీ నియంత్రించడం చిత్రయూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారేదట. ఇక శివ ధనుర్భంగం సన్నివేశం కోసం చాలా ప్రత్యేకంగా కనపడాలని టేకుతో ఓ విల్లును తయారు చేయించారట దర్శకుడు గుణశేఖర్‌. దాంతో పాటు మరో నకిలీ విల్లు కూడా తయారు చేయించి పక్కన పెట్టారు. అయితే, షూటింగ్‌ సమయంలో చిత్ర బృందం అంతా సన్నివేశం కోసం సిద్ధం చేసుకుంటుంటే ఎన్టీఆర్‌ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్‌ విల్లును లేపే ప్రయత్నం చేశారు. అది సులభంగా పైకి లేపగలగడంతో టేకుతో చేసిన విల్లు ఎక్కడుందా? అని వెతికి అందరూ దాన్ని లేపడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు. ఎవరూ పైకి లేపలేకపోయారు. చివరకు తారక్‌ వంతు వచ్చే సరికి దాన్ని బలవంతంగా పైకి లేపి బ్యాలెన్స్‌ చేయలేక కిందపడేయడంతో అది కాస్తా విరిగిపోయింది. దాంతో తారక్‌పై గుణశేఖర్‌కు విపరీతమైన కోపం వచ్చి తిట్టేశారట. దాంతో ‘ఇక నేను సినిమా చేయను. వెళ్లిపోతాను’ అని ఎన్టీఆర్‌ గోల చేశారట. 

అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వానరసైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగడం, మూతులు పీకడం చేసేవారట తారక్‌. రాముడి పాత్ర ధారి అయిన తారక్‌ వాళ్లను బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట.
నిజానికి తారక్‌ ‘బ్రహ్మార్షి విశ్వామిత్ర’తోనే తెరకు పరియం అయినా.. ఫుల్‌లెంగ్త్‌లో ప్రధానపాత్ర పోషించడం ‘రామాయణం’లోనే జరిగింది. ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా అవతారమెత్తారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్‌ నం.1’తో అందరి దృష్టిని ఆకర్షించారు. సింహాద్రి, యమదొంగ, టెంపర్‌, జనతాగ్యారేజ్‌, అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఎదిగారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని