Updated : 10 Sep 2021 19:13 IST

muddamandaram: 40 ఏళ్ల ముద్ద మందారం

తెలుగు తెరపై చెదిరిపోని ప్రేమకావ్యం ‘ముద్దమందారం’. కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న టాలీవుడ్‌కి సరికొత్త కథ, కథనాలతో ఒక ఒరవడిని సృష్టించారు దర్శకుడు జంధ్యాల. ‘అలివేణీ ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా’, ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం’లాంటి పాటలు తెలుగు ప్రేక్షకులను ఊయలలూగించాయి. రమేశ్‌ నాయుడు సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్‌. గోపాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ ‘ముద్దమందరా’న్ని ఎప్పటికీ వన్నె తగ్గని ప్రేమకథగా  నిలిపాయి. ఆ చిత్రం విడుదలై 40 ఏళ్లైన సందర్భంగా హీరోహీరోయిన్లు ప్రదీప్‌, పూర్ణిమ ‘ఈనాడు’తో ముచ్చటించారు.

కమర్షియల్‌ చిత్రాల హవా నడుస్తున్న కాలంలో తెలుగు తెరపై ‘ముద్ద మందారం’ అందమైన ప్రేమను ఆవిష్కరించింది. పెద్దింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య ప్రణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? చివరకు వారి ప్రేమను పెద్దలెలా ఒప్పుకున్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. పెళ్లి పీటలపై పసిపిల్లాడికి పాలిస్తూ వధువు తాళి కట్టించుకోవడం చూసి ప్రేక్షకలోకం ఆశ్చర్యపోయింది. 1981 సెప్టెంబర్ 11న విడుదలైంది. జంధ్యాల దర్శకత్వంలో ప్రదీప్, పూర్ణిమ జంటగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకొని  మంచి ప్రేమకథగా నిలిచింది. 

రచయిత నుంచి దర్శకుడిగా జంధ్యాల

‘అహ నా పెళ్లంట’ లాంటి ఆల్ టైమ్‌ కామెడీ క్లాసిక్‌ని అందించిన దర్శకుడు జంధ్యాల. ఇప్పటికీ తెలుగునాట హాస్యచిత్రాలంటే గుర్తొచ్చేది ఆయనే. తెలుగులో విజయవంతమైన రచయితగా దూసుకుపోతున్న ఆయన్ను దర్శకుడిగా మార్చిన సినిమా ‘ముద్దమందారం’. మాటల రచయితగా ‘శంకరాభరణం’, ‘వేటగాడు’, ‘అడవి రాముడు’ లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు పనిచేశారాయన. అప్పటికే జంధ్యాల 300కు పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. ఒకే సంవత్సరం 83 సినిమాలకు రాసిన ఘనత ఆయనది. కమర్షియల్‌ చిత్రాల రచయితగా పేరొందిన జంధ్యాల మొదటి సినిమాతో ఇలాంటి ప్రయోగం చేయడం ఒక సాహసమే. ‘ముద్ద మందారం’తో దర్శకుడిగా ఆయన అరంగేట్రం చేస్తూనే ప్రదీప్‌, పూర్ణిమలను హీరోహీరోయిన్లగా వెండితెరకు పరిచయం చేశారు. కోటీశ్వరుడైన అబ్బాయి, పూలమ్ముకొనే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథను జంధ్యాల భావాత్మకంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. అంతేకాదు ఈ సినిమా చూసి  ఓ జంట ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నామని లేఖ రాశారని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆనాటి తెలుగు యువతపై ఈ సినిమా ప్రభావమేంటో ఈ ఒక్క సంఘటన చాలు. 

అర్ధరాత్రి పోస్టర్లు చూస్తూ ఆనందపడ్డా: ప్రదీప్, ముద్దమందారం కథానాయకుడు

‘‘తెలుగు సినీ పరిశ్రమలో ‘ముద్దమందారం’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.  మాలాంటి నూతన నటీనటులతో ఈ ప్రేమకావ్యాన్ని తీయడం మా అదృష్టం. ఆయన తలుచుకుంటే పెద్దవాళ్లతో సినిమా చేసేవారు. ‘ప్రేమకోసం జీవితం’ అనే నినాదం ఆనాటి  ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. నా సమకాలికులంతా నన్ను ‘ముద్దమందారం’ హీరో అనే పిలుస్తుంటారు. ఈ సినిమా 80 నుంచి 90 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఘనవిజయాన్ని అందుకుంది. ‘అలివేణి ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా కాలాలు మారేనా’ పాటలు ఇప్పటి ప్రేక్షకులనూ అలరిస్తూనే ఉంటాయి. మా మేనమామ విజయరాం గారి స్నేహితుడు జంధ్యాల. ‘అడవిరాముడు’ సినిమా విడుదలప్పుడు ఆయన మా ఇంటికి వచ్చారు. నేను తనకు సినిమా డైలాగ్స్  చెప్పేవాడిని. నన్ను దగ్గరికి తీసుకొని ఓ రోజు నేను నీతో సినిమా చేస్తానన్నారు. ఏదో మాట వరసకు అన్నారనుకున్నా. డిసెంబర్‌లో రవీంద్రభారతిలో ‘చీకటి రాత్రి’ అనే నాటకం వేశా. ఆ నాటకాన్ని చూసి గ్రీన్ రూంలోకి వచ్చి నా సినిమాలో హీరోగా నటిస్తావా అన్నారు. అప్పటి వరకూ మట్టి ముద్దలా ఉన్న నన్ను ‘ముద్దమందారం’ ద్వారా అద్భుతమైన శిల్పంగా మలిచారు. ఈ సినిమాలో పూర్ణిమకు తాతగా నటించిన విన్నకోట రామన్నపంతులు నిజ జీవితంలో నాకు తాతయ్య. జంధ్యాల గారి గురువు. మా తాత, మా మేనమామ విజయరాంలతో కలిసి ఇందులో నటించడం అదృష్టం. ‘ముద్దమందారం’ విడుదలకు వారం ముందు రామకృష్ణ సినీ స్టూడియోలో ప్రివ్యూ వేశారు.  మొదటిసారి తెరపై చూసుకున్నప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. మల్కాజ్ గిరి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ లో నా పోస్టర్లను చూసి స్నేహితులు ఇంటికి వచ్చి చెప్పేవాళ్లు. అప్పటి వరకూ నాకు మోటరు సైకిల్, కారు లేదు. రాత్రి 11 గంటలకు నేనూ మా తమ్ముడు ఒక సైకిల్ మీద 40 కిలోమీటర్లు తిరిగాం. ప్రతి పోస్టర్, కటౌట్ దగ్గర నిల్చొని హీరో అయ్యానని తలుచుకొని ఆనందించేవాణ్ని. ఈ 40 ఏళ్లలో సినిమా, టీవీ రంగంలో 12 నందులు అందుకున్నా, ఎంతో డబ్బు సంపాదించినా ఆ రాత్రి ముద్ద మందారం పోస్టర్ల వద్ద గడిపిన క్షణాలే ఎంతో ఆనందాన్నిచ్చాయి.  అందుకే ‘ముద్దమందారం’  నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం.  ఇంతగా ఎదిగానంటే గురువు జంధ్యాలగారే కారణం’’

నాన్న ఒప్పుకోలేదు: పూర్ణిమ, ముద్దమందారం కథానాయిక

                    

‘‘హీరోయిన్‌గా ‘ముద్దమందారం’ నా మొదటి సినిమా. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా. దుర్గ పాత్ర కోసం నేనైతే బాగుంటుందని దర్శకులు జంధ్యాల మా నాన్నను అడిగారు. ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. మూడుసార్లు వచ్చి కథ వినిపించారు.  జంధ్యాల గారు నా పాత్ర, సన్నివేశాలు చక్కగా వివరించడంతో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మాక అంగీకరించారు. అప్పటికి నటించడం అంటే ఏంటో తెలియదు. జంధ్యాల గారే ప్రతీది చేసి చూపించేవారు. ఆయన చెప్పినట్టు చేసేదాన్ని. ప్రదీప్ కూడా ఎంతగానో సహకరించారు. ఒక సీన్ చేస్తున్నప్పుడు సుమారు 15 టేకులు తీసుకున్నాను. అయితే చివరి ప్రయత్నంగా బాగా చేస్తాను. సెట్‌లో ఉన్నవాళ్లందరికి పాయసం చేసి పెట్టండని జంధ్యాలగారిని అడిగాను. అంతే అందరు గొల్లున నవ్వారు. అలాగే నా నవ్వు కూడా సినిమాలో భాగమైంది. సినిమా ఘన విజయం సాధించడంతో చాలా సంతోషం కలిగింది. క్లైమాక్స్‌లో పెళ్లి సీన్ చేసేటప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి పెళ్లిళ్లు కూడా అవుతాయా అనిపించింది. ‘ముద్దమందారం’ తర్వాత సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తర్వాత 100 సినిమాలు చేశాను. ‘నాలుగు స్తంభాలాట’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మాపల్లెలో గోపాలుడు’... ఇలా  విజయవంతైమన సినిమాల్లో నటించాను. ఎక్కువగా కృష్ణగారికి చెల్లెలిగా చేశా. తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కింది. తొలి సినిమా ముద్ద మందారం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ యవ్వనం, సహజత్వం ఎప్పటికి తిరిగిరావు.  ప్రేక్షకులు ‘ముద్దమందారం’ చిత్రాన్ని ఆదరించిన తీరు నాకు ఇప్పటికీ జ్ఞాపకముంది’’


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని