యూట్యూబ్‌ పాట.. 105 కోట్ల వ్యూస్‌

ఓ ప్రైవేట్‌ సాంగ్‌కి యూట్యూబ్‌లో లక్ష వ్యూస్‌ వస్తే గొప్ప. మిలియన్‌ కొడితే సూపర్‌ సక్సెస్‌. మరి 100 కోట్లు దాటితే..? అతి పెద్ద సంచలనమే.

Published : 07 Jul 2021 01:23 IST

ఓ ప్రైవేట్‌ సాంగ్‌కి యూట్యూబ్‌లో లక్ష వ్యూస్‌ వస్తే గొప్ప. మిలియన్‌ కొడితే సూపర్‌ సక్సెస్‌. మరి 100 కోట్లు దాటితే..? అతి పెద్ద సంచలనమే. ‘అప్పట్లో గంగ్నమ్‌ స్టైల్‌’ వంద కోట్లు అందుకుంటే అంతా నోరెళ్లబెట్టారు. ఇప్పుడు.. ‘52 గజ్‌ కా దమన్‌’ దేశాన్ని ఊపేస్తూ 105 కోట్లతో రికార్డు సృష్టించింది. పాడిందీ, పాటలో ఆడిందీ.. పందొమ్మిదేళ్ల రేణుకా పన్వర్‌. ఈ టీనేజీ అమ్మాయి సంగతులు.

ఎందుకింత పాపులారిటీ: ‘52 గజ్‌ కా దమన్‌’ యువతకు బాగా దగ్గరైన పాట. సాహిత్యం, సంగీతం, డ్యాన్స్‌.. అందరినీ కట్టిపడేసేలా ఉంది. కాలేజీ ఉత్సవాలు, పెళ్లిళ్లు, ఇతర షోలు.. ఎక్కడ చూసినా ఇదే మార్మోగిపోతోంది. అందుకే కేవలం తొమ్మిది నెలల్లో వంద కోట్ల వ్యూస్‌ను దాటింది.

అమ్మాయి నేపథ్యం: రేణుక ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేకడాలో జన్మించింది. హిందీ, హర్యాణ్వీ పాటలు పాడుతుంది.

మొదటి సాంగ్‌: ‘సున్‌ సోనియో..’ మొదటి పాట. పదోతరగతిలో ఉండగానే పాడింది. ఆమె గొంతుకు అంతా ఫిదా అయ్యారు. వారిచ్చిన ఉత్సాహంతో సరిగమల సాధన మొదలు పెట్టింది. తర్వాత ‘ఖుదా కీ ఇనాయత్‌ హై..’ అంటూ మొదటి పాట పాడి యూట్యూబ్‌లో వదిలింది. తర్వాత అంతా చరిత్రే.

ఇప్పటికెన్ని పాడింది: లిలో చమన్‌ 2, బాబా 4, బొర్లా చాందీ కా, సోనా బాబూ, ములాఖత్‌, కోయీ ఔర్‌ మిల్‌గయా జాత్‌ గెల్యా యారీ, ఊంచీ హవేలీ.. ప్రైవేట్‌ సాంగ్స్‌ పాడింది. ప్రతి పాటకీ యూట్యూబ్‌లో మిలియన్‌కి పైగానే వ్యూస్‌ వచ్చాయి. 

పాటలు కాకుండా.: రేణుక మంచి డ్యాన్సర్‌ కూడా. స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సింగ్‌ స్టార్‌’లో పాల్గొని టైటిల్‌ గెలిచింది.

సంపాదన: రేణుక వయసు ప్రస్తుతం 19. సరదాగా పాడటం మొదలుపెట్టినా సోషల్‌ మీడియా ద్వారా బాగా పాపులర్‌ అయింది. కేవలం యూట్యూబ్‌ ద్వారానే తను ఇప్పటికి రూ.3కోట్లు సంపాదించింది.

ముద్దుపేరు: షాలూ. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.9లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని