83: అదే జరిగితే.. ‘83’ చిత్రం వెంటనే ఓటీటీలో విడుదల

సినీ, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘83’. గతేడాది డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదలైంది. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ సాధించిన చారిత్రాత్మక ఘట్టం, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవిత చరిత్ర నేపథ్యంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది.

Updated : 17 Sep 2022 14:14 IST

దర్శకుడు కబీర్‌ ఖాన్

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘83’. గతేడాది డిసెంబర్‌ 24న థియేటర్లలో విడుదలైంది. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ సాధించిన చారిత్రక ఘట్టం, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవిత చరిత్ర నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆంక్షల కారణంగా పలు చోట్ల థియేటర్లు మూతబడటం బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది.  దీంతో ‘83’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారా..? అనే అంశంపై దర్శకుడు కబీర్‌ ఖాన్‌ స్పందించారు.

‘‘ ఈ చిత్రం మాకెంతో స్పెషల్‌. 18నెలల ముందే ‘83’ విడుదలకు సిద్ధమైనా.. ప్రేక్షకులు థియేటర్లో వీక్షించాల్సిన చిత్రమని వాయిదా వేస్తూ వచ్చాం. కరోనా కేసుల కారణంగా థియేటర్లు మళ్లీ మూతపడుతున్నాయి. 83 విడుదలైన నాలుగో రోజే దిల్లీలో థియేటర్లపై ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర, బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవే ఆంక్షలు కొనసాగితే.. త్వరలోనే ‘83’ని ఓటీటీలో విడుదల చేస్తాం. ప్రస్తుతం థియేటర్లో వీక్షించేవారంతా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు’’ అని  అన్నారు.

కాగా ఇప్పటి వరకు ‘83’ సుమారు రూ.116 కోట్లకు చేరువైందని ట్రేడ్‌ వర్గాల మాట. కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించగా, ఆయన సతీమణిగా దీపికా పదుకొణె నటించారు. తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా, కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని