
Kapil Dev: ‘83’ ట్రైలర్ చూశాక.. మా కుటుంబసభ్యుల స్పందన ఇదే!
ఇంటర్నెట్ డెస్క్: అటు సినీ ప్రపంచంతో పాటు ఇటు క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘83’. టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కపిల్‌దేవ్ పాత్రను రణ్‌వీర్ సింగ్ పోషించగా, ఆయన భార్యగా రణ్‌వీర్ సరసన నటి దీపికా పదుకొణె నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూసిన కపిల్ దేవ్ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ వాస్తవానికి ఇందులో నా భార్య పాత్ర ఎంత ఉంటుందన్నది నాకు తెలియదు. అందులో ఎలా చూపించారన్నది తెరపై చూడాల్సిందే.
ట్రైలర్ వీక్షించిన అనంతరం నా కుటుంబసభ్యులు వివిధ రకాలుగా స్పందించారు. ఇందులో రణ్‌వీర్ వంటి ప్రతిభ గల నటుడు నా పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. మొదట్లో కొంచెం ఆందోళన పడ్డా అథ్లెట్‌కు సంబంధించి తెరపై ఎలా చూపిస్తారా అని. కానీ ఏడాదంతా రణ్‌వీర్ పనిచేసిన విధానం చూశాక ఆశ్చర్యపోయా. ఓ పాత్ర కోసం ఎవరైనా ఇంతలా చేయడానికి ప్రయత్నిస్తారా అని నమ్మలేకపోయా. రణ్‌వీర్ మా ఇంటికొచ్చి నాతో సమయం గడిపాడు. నా గురించి పూర్తిగా అధ్యయనం చేశాడు. పాత్ర పోషిస్తున్నంత సేపు ఓ క్రీడాకారుడిగా నేను ఏ డైట్ అయితే ఫాలో అవుతానో..తను అదే ఫాలో అయ్యాడు.’’
రణ్‌వీర్ నన్ను కూల్ చేశాడు!
ఇక రణ్‌వీర్ పాత్రకు సన్నద్ధమవుతున్న తీరు చూసి మొదటి రెండు రోజులు గందరగోళానికి గురయ్యా. చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలిసేది కాదు. నా ముందు రెండు మూడు కెమెరాలు ఉండేవి. అప్పుడు నన్ను గమనించిన రణ్‌వీర్ నాకు ఊరటనిచ్చే మాటలు చెప్పేవాడు. ఇన్ని కెమెరాలు చూసి కంగారు పడకండి. కొన్ని రోజులకు మీరే అలవాటు పడతారు అనేవాడు. రణ్‌వీర్ చెప్పినట్టే నాకు రెండు, మూడు రోజులయ్యాక బాగానే అనిపించింది.