‘రెహమాన్‌ రూ.3.47 కోట్లకు పన్ను కట్టలేదు’

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ రూ.3.47 కోట్ల మొత్తంపై పన్ను శాతం కట్టకుండా ఎగరవేశారంటూ ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.  రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్‌ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను ....

Published : 12 Sep 2020 01:43 IST

పన్ను ఎగవేత.. అధికారుల ఫిర్యాదు

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ రూ.3.47 కోట్ల మొత్తానికి పన్ను కట్టకుండా ఎగవేశారంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రూ.3.47 కోట్ల పారితోషికాన్ని నేరుగా తన ఛారిటబుల్‌ ట్రస్టుకు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. 2011-12 సంవత్సరంలో రెహమాన్ పన్ను దాఖలు చేయడంలో వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యూకేకి చెందిన టెలికాం సంస్థ లిబ్రా మొబైల్స్‌కు రింగ్‌టోన్స్‌ కంపోజ్‌ చేసినందుకుగానూ రెహమాన్‌ రూ.3.47 కోట్ల పారితోషికం తీసుకున్నారని వివరించారు. 2011లో ఇది జరిగిందని, సరికొత్త రింగ్‌టోన్స్‌ కంపోజ్‌ చేసి ఇచ్చేలా.. సదరు సంస్థతో రెహమాన్‌ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. 

పారితోషికం నేరుగా రెహమాన్‌ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందని, దానికి పన్ను కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. పన్ను కట్టిన తర్వాత.. ట్రస్టుకు బదిలీ చేయాలని, కానీ అలా చేయలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం, జస్టిస్‌ వి భవానీ సుబ్బరాయన్‌తో కూడిన ధర్మాసనం రెహమాన్‌కు నోటీసులు జారీ చేసింది.

గత ఫిబ్రవరిలో రెహమాన్ రూ.6.79 కోట్ల బకాయి, రూ.6.79 కోట్ల జరిమానా చెల్లించాలని జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ (సీఈ) జారీ చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రెహమాన్‌ సినిమాలకు సంగీతం అందించడం ద్వారా తీసుకున్న పారితోషికానికి పన్ను చెల్లించలేదని జీఎస్టీ కౌన్సిల్‌ అప్పుడు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని