Aadavallu Meeku Johaarlu: నవ్వించిన శర్వా.. మళ్లీ కావాలని అడిగారు

‘‘కుటుంబ వినోదంతో నిండిన  సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది.

Updated : 16 Feb 2022 09:25 IST

‘‘కుటుంబ వినోదంతో నిండిన  సినిమాలు ‘శతమానం భవతి’ తర్వాత చేయలేదు. ‘మహానుభావుడు’లో నవ్వించిన ఆ శర్వా మళ్లీ మాకు కావాలని అడిగారు చాలా మంది. వాళ్లందరి కోరిక నెరవేర్చే సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఓ చిరునవ్వుతో ఇంటికెళ్లేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన్న కథా నాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిండా ఆడవాళ్లే కనిపిస్తారు. యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఎంతగా ఆస్వాదించానో, చిత్రీకరణ దశలోనూ... నిర్మాణానంతర కార్యక్రమాల సమయంలోనూ అదే స్థాయిలో నవ్వుకున్నా. ఖుష్బూ, రాధికలాంటి సీనియర్లతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దేవిశ్రీప్రసాద్‌తో కలిసి ఇది నాకు నాలుగో సినిమా. చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ఆడవాళ్లందరి మధ్య కూర్చుని చాలా సరదాగా చేసిన సినిమా ఇది. కామెడీ కోసమని ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథలో భాగంగానే ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఎదురు చూశా. కిషోర్‌ ఓ బలమైన కథతో, మంచి పేరుతో వచ్చారు. రాధిక, ఖుష్బూ తదితర నటులతో కలిసి నటించడం ఓ లక్ష్యాన్ని చేరుకున్న అనుభూతినిచ్చింది. రష్మిక చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది’’ అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘దర్శకుడు కిషోర్‌ ఈ కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నా. సినిమా చిత్రీకరణలోనూ అంతే. ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదిస్తారు’’ అన్నారు. ‘‘తెలుగులో 250కిపైగా సినిమాలు చేశా. ఈ చిత్రంతో మరో మంచి జ్ఞాపకం. ప్రతీ పాత్రకీ మంచి ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబంతో కలిసి చూడాలి’’ అన్నారు రాధికా శరత్‌కుమార్‌. నటి ఖుష్బూ  మాట్లాడుతూ ‘‘కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో ఈ సినిమా  తెరకెక్కింది. శర్వానంద్‌ ఈ సినిమాకి మూలస్తంభం’’ అన్నారు ఖుష్బూ. నటి ఝాన్సీతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు