ఇప్పుడు ‘జల్లికట్టు’.. అంతకుముందు ఏవి?

ఆస్కార్‌.. ప్రతి సినీ కళాకారుడు ఎంతో అపురూపంగా భావించే సత్కారం. అవార్డు అందుకోకపోయినా.. కనీసం నామినేషన్‌ వరకు వెళ్లినా ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని ప్రతిభ కనబర్చిన నటులు, సాంకేతిక నిపుణులకు అందిస్తున్నారు....

Updated : 27 Nov 2020 19:22 IST

ఆస్కార్‌కు వెళ్లిన సినిమాల గురించి తెలుసా?

ఆస్కార్‌.. ప్రతి సినీ కళాకారుడు ఎంతో అపురూపంగా భావించే సత్కారం. అవార్డు అందుకోకపోయినా.. కనీసం నామినేషన్‌ వరకు వెళ్లినా ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని ప్రతిభ కనబర్చిన నటులు, సాంకేతిక నిపుణులకు అందిస్తున్నారు. ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో భారత్‌ నుంచి ‘జల్లికట్టు’ బరిలోకి దిగింది. లిజో జోస్‌ తెరకెక్కించిన ఈ మలయాళీ చిత్రం ఇప్పుడు విదేశీయుల దృష్టిలోనూ పడింది. ప్రతి దేశం నుంచి వెళ్లిన సినిమాను వీక్షించిన అకడమీ జ్యూరీ సభ్యులు తుది పోటీకి ఐదు చిత్రాలను ఎంపిక చేయనున్నారు. 2021 ఫిబ్రవరిలో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎలా వీటిని ప్రదానం చేయనున్నారో చూడాలి. గత ఐదేళ్లలో భారత్‌ నుంచి పురస్కారం కోసం వెళ్లిన సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దామా..!

మనిషిలోని మృగం..

విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించబడ్డ ‘జల్లికట్టు’ అరుదైన ఖ్యాతిని దక్కించుకుంది. 2020 ఆస్కార్‌కు భారత్‌ నుంచి ఈ చిత్రాన్ని ఎంపిక చేసి పంపారు. కేరళలోని ఓ మారుమూల అటవీ గ్రామంలో నడిచే కథ ఇది. గేదె మాంసాన్ని అమ్మే ఆంటోని దగ్గరున్న ఓ దున్న భయంతో తప్పించుకుని.. పంటలను నాశనం చేస్తూ.. అడ్డొచ్చిన వారిని గాయపర్చడంతో ఊరంతా గందరగోళం ఏర్పడుతుంది. మనిషికి, మనిషిలోని మృగానికి మధ్య జరిగే అంతర్యుద్ధంగా దీన్ని రూపొందించారు. 2019లో ఇది అందరి మన్ననలు అందుకుంది.

మురికివాడ కుర్రాడి కల

ముంబయిలోని అతి పెద్ద మురికివాడలో పెరిగిన కుర్రాడు (రణ్‌వీర్‌ సింగ్‌) దేశం మెచ్చే గాయకుడు కావాలని కలలు కంటాడు. ఈ ప్రక్రియలో ఎన్నో అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కొంటాడు. అయినా సరే పట్టువదలకుండా.. చివరికి ర్యాపర్‌గా విజయం సాధిస్తాడు. అతడి ప్రయాణంలో ప్రేయసి అలియా భట్‌ కూడా ప్రోత్సాహం అందిస్తుంది. ఈ వృత్తాంతంతో రూపొందిన ‘గల్లీబాయ్‌’ 2019లో ప్రేమికుల రోజున విడుదలై, ఆదరణ అందుకుంది. జోయా అక్తర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం 65వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలో 13 పురస్కారాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. 92వ అకడమీ అవార్డులకు ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో భారత్‌ నుంచి పేరు నమోదు చేసుకుంది. కానీ తుది బరిలో నిలబడలేకపోయింది.

గిటార్‌పై ప్రేమ..

‘పద్మావత్’, ‘రాజీ’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘మహానటి’ లాంటి చిత్రాలతో పోటీపడి 2018లో ఆస్కార్‌ బరికి అవకాశం దక్కించుకున్న అసోం చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’. దర్శకురాలు రీమా దాస్‌ రచయితగా, నిర్మాతగా, ఎడిటర్‌గా, ఛాయాగ్రాహకురాలిగా.. అన్నీ తానై ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. కడు పేదరికంలో పుట్టిన ఓ పదేళ్ల బాలిక గిటార్‌ కొనాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి ఎంతగా తపించిందోనన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అసోంలోని ఓ కుగ్రామంలో అతి తక్కువ బడ్జెట్‌తో.. నటనతో ఏ మాత్రం పరిచయం లేని వారితో దీన్ని తెరకెక్కించారు. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. అంతేకాదు 70కి పైగా ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ప్రశంసలతోపాటు 44 పురస్కారాలు గెలుచుకుంది.

ఓటు చుట్టూ..

ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ రావును ఎన్నికల డ్యూటీ నిమిత్తం అడవుల్లో నక్సల్స్‌ అధీనంలో ఉన్న ఓ గ్రామానికి పంపుతారు. అక్కడి సమస్యలను ఎదుర్కొని, ఎలా తన విధుల్ని నిర్వహించారనే కథాంశంతో రూపొందించిన చిత్రం ‘న్యూటన్‌’. ఎన్నికలు, ఓట్లు అంటే తెలియని అక్కడి ప్రజలకు వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు రాజ్‌ కుమార్‌ రావు. ఈ కథాంశంతో రూపొందిన సినిమాకు అమిత్‌ వి.మసుర్కర్‌ దర్శకత్వం వహించారు. 2017 సెప్టెంబరులో విడుదలైన ఈ చిత్రం ఆస్కార్‌ పోటీకి భారత్‌ నుంచి నామినేట్‌ అయ్యింది.

డ్రైవర్‌ రాసిన కథ..

ఓ సాధారణ ఆటోడ్రైవర్ రాసిన నవల ఆస్కార్ వరకూ వెళ్లింది. 2015లో తమిళనాడుకు చెందిన చంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం ‘విసారణై’. ఇది విజయం అందుకోవడంతోపాటు అనేక పురస్కారాలు దక్కించుకుంది. నాలుగు జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొల్లగొట్టి.. ఇండియా నుండి ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. అమాయకులైన నలుగురు యువకుల జీవితాలను పోలీసులు ఎలా ప్రమాదంలోకి నెట్టారు? వారి జీవితం ఏమైంది? వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ఈ చిత్రం ‘విచారణ’ టైటిల్‌తో విడుదలైంది. 

తొలిసారి..

అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో ఆస్కార్‌ పురస్కారాల్ని నిర్వహిస్తున్నారు. 1957 నుంచి ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో అవార్డుల్ని ప్రకటిస్తున్నారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పలు భాషా చిత్రాల నుంచి ఒక్కదాన్ని ఎంపిక చేసి ఆస్కార్‌ పోటీకి పంపుతోంది. ప్రతి దేశం నుంచి నామినేటైన చిత్రాన్ని సబ్‌టైటిల్స్‌తో చూసిన అకాడమీ జ్యూరీ సభ్యులు ఉత్తమ చిత్రాల్ని జల్లెడపడతారు. భారత్‌ నుంచి తొలిసారి (1957) ‘మదర్‌ ఇండియా’ సినిమా నామినేషన్‌కు వెళ్లింది. మరో నాలుగు విదేశీ చిత్రాలతోపాటు ఫైనల్‌ పోటీకి ఎంపికైంది. విజయానికి చేరువలో, ఒక్క ఓటు తేడాతో అవార్డుకు దూరమైంది. 1957లో ‘నైట్స్‌ ఆఫ్‌ క్యాబిరియా’ పుస్కారం అందుకుంది.

తుది పోరుకు 3..

1957 నుంచి కేవలం ఒక్కసారి మాత్రం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌కు సినిమాను పంపలేదు. 2003లో భారత్‌లో తీసిన ఏ సినిమా విదేశీ చిత్రాలతో పోటీపడే స్థాయిలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు భారత్‌ నుంచి వెళ్లిన చిత్రాల్లో ‘మదర్‌ ఇండియా’ (1957), ‘సలామ్‌ బాంబే’ (1988), ‘లగాన్‌’ (2001) చిత్రాలు ఆస్కార్‌ తుది పోరులో నిలబడ్డాయి. మిగిలిన చిత్రాలన్నీ ఆదిలోనే ఆగిపోయాయి.

1986లో తెలుగు ఎవర్‌గ్రీన్‌ చిత్రం ‘స్వాతిముత్యం’ భారత్‌ నుంచి ఆస్కార్‌కు ఎంట్రీ సంపాదించుకుంది. ‘నాయకన్‌’, ‘అంజలి’, ‘తెవార్‌ మగన్‌’ (‘క్షత్రియ పుత్రుడు’), కురుదిపునల్ (ద్రోహి), ‘ఇండియన్‌’, ’జీన్స్‌’, ‘దేవదాస్‌’, ‘బర్ఫీ’ తదితర చిత్రాలు భారత్‌ నుంచి అకాడమీ అవార్డు కోసం ఎంట్రీ పొందాయి. కానీ ఫైన్సల్స్‌ వరకు వెళ్లలేకపోయాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని