
Gopichand: యాక్షన్ బుల్లెట్
‘‘జనరల్‌గా నేనెవడి మీద చెయ్యెత్తను. నా తండ్రి మీద ఎవడైనా చెయ్యి వేస్తే విరిచేదాక వదిలి పెట్టను’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. తాండ్ర రమేష్ నిర్మించారు. నయనతార కథానాయిక. అక్టోబరు 8న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘పేరు శివ.. పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్. పరిచయమైతే నేను మర్చిపోను. పంగా అయితే నువ్వు మర్చిపోలేవు’’ అంటూ గోపీచంద్ చెప్పే సంభాషణలతో ట్రైలర్‌ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఏ లక్ష్యం లేకుండా ఖాళీగా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా ప్రచార చిత్రంలో ఆయన పాత్రని చూపించారు. ఇలాంటి కుర్రాడు తన తండ్రికి ఓ ప్రతినాయకుడి నుంచి ఆపద ఎదురైతే ఏం చేశాడు? అతని నుంచి తన తండ్రిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది ట్రైలర్‌లో చూపించారు. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది.