Karthikeya: పెద్ద దెబ్బలే తగిలాయి..ఎవరికీ చెప్పలేదు

‘ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేస్తున్నా. ప్రశాంత్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రం చేయనున్నా. శ్రీదేవి

Updated : 20 Feb 2022 09:52 IST

‘ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేస్తున్నా. ప్రశాంత్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రం చేయనున్నా. శ్రీదేవి మూవీస్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే అజయ్‌ భూపతి, నేను మరో చిత్రం చేయనున్నాం. ఇది ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశముంది’’.

‘‘నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే.. బిగ్‌ స్టార్‌ అనిపించుకోవాలి. ఇప్పుడు నేను హీరోగా చేసినా.. విలన్‌గా చేస్తున్నా.. అది నా కెరీర్‌ను ఆ దిశగా ముందుకు తీసుకెళ్లడానికే. అలాగని ఏది పడితే అది చేసేయాలనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మళ్లీ విలన్‌గా చేయాలన్నా.. ఆ కథ బాగుండాలి, అందులో నా పాత్ర కొత్తగా, శక్తిమంతంగా ఉండాలి. అప్పుడే ఆ సినిమా చేయాలన్న ఉత్సుకత కలుగుతుంది’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో హీరోగా మెప్పించిన ఆయన.. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో ప్రతినాయకుడిగానూ అలరించారు. ఇప్పుడాయన ‘వలిమై’ కోసం మరోసారి విలన్‌గా మారారు. అజిత్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు కార్తికేయ. ఆ విశేషాలివి..

‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా చూసి ‘వలిమై’లో విలన్‌గా అవకాశమిచ్చారా?

‘‘లేదు. నా ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం చూసి ఈ సినిమా కోసం సంప్రదించారు. 2019 అక్టోబర్‌లో తొలిసారి హెచ్‌.వినోద్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నాం.. దాంట్లో శక్తిమంతమైన విలన్‌ పాత్ర ఉంది. హీరో ఇమేజ్‌తో పాటు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ ఉన్న నటుడు కావాలి. ‘ఆర్‌ఎక్స్‌100’ చూశాను. మీ లుక్‌, ఫిజిక్‌ బాగుంది. ఈ పాత్ర మీకు సరిగ్గా సరిపోతుంది. చేస్తారా?’ అని అడిగారు. సరే.. ముందు నాకు కథ, నా పాత్ర గురించి చెప్పండి అంటే.. వాళ్ల అసిస్టెంట్‌ను పంపించి స్క్రిప్ట్‌ వినిపించారు. నాకు బాగా నచ్చింది. ‘గ్యాంగ్‌లీడర్‌’లో చేసిన విలన్‌ పాత్రలో కన్నా దీంట్లో ఇంకా ఎక్కువ షేడ్స్‌ కనిపించాయి. నటనకు మరింత  ఆస్కారముంది అనిపించింది. అందులోనూ అజిత్‌కు విలన్‌ కాబట్టి.. నా పాత్ర మరింత బలంగా తీర్చిదిద్దారు. ఇది చేస్తే తమిళంలోనూ మంచి గుర్తింపు దొరుకుతుంది అనిపించింది. అందుకే స్క్రిప్ట్‌ విన్న వెంటనే చేస్తానని చెప్పేశా’’.

ఇంతకీ ‘వలిమై’ అంటే ఏమిటి?

‘‘వలిమై’ అనేది తమిళ పదం. బలం అనే అర్థంలో వస్తుంది. అలాగని ఇది శారీరక బలం కాదు. మనోబలం గురించి తెలియజేస్తుంది. నిజానికి ఈ సినిమాకి తెలుగు అదే అర్థం వచ్చే ఓ టైటిల్‌ పెట్టాల్సి ఉంది. ఈ సినిమా తెలుగులో   విడుదల చేయనున్నట్లు ప్రకటించడానికి ముందే.. ‘వలిమై’ అన్న పదం జనాలకు బాగా పరిచయమైపోయింది. అర్థం తెలియకున్నా.. అందరి నోళ్లలో బాగా నానిపోయింది. ఇలాంటప్పుడు తెలుగులో మరో కొత్త టైటిల్‌ పెడితే.. డబ్బింగ్‌ సినిమా అన్న ఫీలింగ్‌ వస్తుంది. అందుకే అందరికీ పరిచయమైన పేరునే అలా ఉంచేశారు. ఇదొక విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇది ఏ భాషా ప్రేక్షకులకైనా కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. దీంట్లో నా పాత్ర ఈతరం కుర్రాళ్లకు ప్రతిబింబంలాగే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంగా   చెప్పగలను’’.

అజిత్‌ లాంటి స్టార్‌ హీరోతో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

‘‘ఈ సినిమా ప్రయాణంలో అజిత్‌ నుంచి వృత్తిపరంగా.. వ్యక్తిగతంగా ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను మాటల్లో వర్ణించలేం. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో రేసింగ్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. బైక్‌ రైడ్‌ చేస్తూ.. అదుపు తప్పి పడిపోయారు. పెద్ద దెబ్బలే తగిలాయి. అయితే ఆయన ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మామూలుగా బైక్‌ లేపి.. పక్కకు తీసుకొని వచ్చేశారు. నేనప్పుడు అక్కడే ఉన్నాను. తర్వాత విషయం తెలిసి ‘ఎందుకు సర్‌ ఇంత రిస్క్‌.. రెండ్రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా’ అని అడిగా. దానికాయన ‘ఇప్పుడు నీ డేట్స్‌ ఉన్నాయి. మళ్లీ నీకు కష్టమవుతుంది. అలాగే ఫైట్స్‌ మాస్టర్స్‌ డేట్స్‌, లొకేషన్‌ ఖర్చులు, మళ్లీ ఇక్కడికి రావడాలు.. ఇవన్నీ ఎందుకు. అందరికీ ఇబ్బందే. నేనే ఒకరోజు ఓపిక పడితే సరిపోతుంది కదా’ అన్నారు. అది చూశాక.. నేను ఏస్థాయికి వెళ్లినా వృత్తిపరంగా అంతే నిబద్ధతో ఉండాలని అనుకున్నా’’.

ఈ సినిమా విషయంలో మీకెక్కువ సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?

‘‘రేసింగ్‌ ఎపిసోడ్లే. నాకు బైక్‌ రేసింగ్‌ రాదు. కథ విన్నప్పుడు ఇదే విషయాన్ని దర్శకుడు వినోద్‌కు చెప్పా. పర్లేదు.. మేము చూసుకుంటాం అన్నారు. షూట్‌కు ముందు చెన్నైలో చిన్న వర్క్‌షాప్‌ చేశాం. ఆ సమయంలోనే జాగ్రత్తగా రేసింగ్‌ ఎలా చేయాలో చూపించారు. అయితే అజిత్‌ స్వతహాగానే మంచి బైక్‌ రేసర్‌. సెట్లో ఆయన వేగాన్ని అందుకోవడమే సవాల్‌గా అనిపించేది. ఇలా యాక్షన్‌ చెప్పే లోపే.. ఆయన ఎక్కడికో వెళ్లిపోయేవారు. ఆ వేగాన్ని అందుకోవడం ఛాలెంజింగ్‌గా ఉండేది. అయితే నా ఇబ్బందులు చూసి అజిత్‌ గారే.. కాస్త నెమ్మదిగా నన్ను మ్యాచ్‌ చేసుకుంటూ చేశారు (నవ్వుతూ). సినిమాలో 80శాతం యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని డూప్‌ లేకుండా చేశా. మరీ బైక్‌లు గాల్లోకి ఎగిరే రిస్కీ షాట్లయితే చేయలేదు. అలాగే ఈ చిత్రం కోసం తమిళం నేర్చుకున్నా’’.

హీరో, విలన్‌.. ఈ రెండింటిలో ఏది సౌకర్యంగా అనిపిస్తుంది?

‘‘హీరో, విలన్‌.. ఏ పాత్ర చేసినా కెమెరా ఆన్‌ అయ్యాక నటనలో పెద్దగా తేడాలుండవు. నేనైతే హీరో పాత్ర కన్నా విలన్‌ పాత్రని ఇంకా ఎక్కువ ఆస్వాదిస్తుంటా. ఎందుకంటే హీరో పాత్రలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతినాయక పాత్రలకు అలాంటివి ఉండవు. ముఖ్యంగా ‘వలిమై’లోని సైకో విలన్‌ లాంటి పాత్రల్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేసే అవకాశముంటుంది. దానికి తోడు హీరోగా చేసేటప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. మార్కెట్‌ లెక్కలు, ప్రమోషన్లు అన్నీ మన ఒక్కరితోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి చాలా ఒత్తిడి ఉంటుంది. విలన్‌ పాత్రల విషయంలో ఇలాంటి ఒత్తిడులుండవు’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని