నాటకాలు వేస్తే నాన్న కొట్టేవారు

నభూతో నభవిష్యతి అన్న రీతిలో తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో దాదాపు వేయికి పైగా సినిమాల్లో నటుడిగా.. హాస్య నటుడిగా, హీరోగా నటించి.. ప్రేక్షకులను అలరించి ఎంతో మంది కథానాయకుల చేత, దర్శకుల చేత శభాష్‌ అనిపించుకున్న నటుడు బాబూమోహన్‌...

Updated : 06 Dec 2020 19:13 IST

నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అనేవారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నభూతో నభవిష్యతి అన్న రీతిలో తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో దాదాపు వేయికి పైగా సినిమాల్లో నటుడిగా.. హాస్య నటుడిగా, హీరోగా నటించి.. ప్రేక్షకులను అలరించి ఎంతో మంది కథానాయకుల చేత, దర్శకుల చేత శభాష్‌ అనిపించుకున్న నటుడు బాబూమోహన్‌... మొదటి సినిమా ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు బదులుగా ‘ఈ ప్రశ్నకు బదులేదీ’ అని సమాధానంగా చెప్పొచ్చు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకు అంకితమై ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఆయన ఎన్నో సేవలందించారు. ఈటీవీ వార్తా ఛానల్‌లో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి విచ్చేసిన బాబూమోహన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

ఎవరి పేరులో అయినా ‘బాబూ’ చివర్లో ఉంటుంది. మీ పేరులో మాత్రం అది మొదట్లో ఉంది. అదే మీ అసలు పేరా?

బాబూమోహన్‌: మా నాన్న ఉపాధ్యాయుడు. నా పేరు మోహన్‌రావు. టీచర్‌ కుమారులను, పెద్దవాళ్ల కుమారులను బాబూ అని పిలుస్తారు. అందుకే కొంతమంది నన్ను బాబూ అని పిలిచేవారు. మరికొందరు మోహన్ అని పిలిచేవారు. దీంతో మా నాన్న నా పేరును బాబూమోహన్‌రావు అని పెట్టారు. సినిమా నటుడిని అయ్యాక బాబూమోహన్‌రావు పెద్దగా ఉందని బాబూమోహన్‌ అని పిలిచేవారు.

అంకుశం, ఆహుతి సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?

మోహన్‌బాబు: చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. ఓ ఫంక్షన్‌లో డైలాగ్‌ చెబుతుండగా నన్ను చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి రవీంద్రభారతిలో నాటకం వేస్తున్నాం ఓ పాత్ర పోషించమని అడిగారు. దీంతో అందుకు అంగీకరించాను. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడిరామకృష్ణలతోపాటు పలువురిని పరిచయం చేసిన ప్రతాప్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ అధినేత రాఘవ ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆ నాటకంలో నా నటన చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. నాటకం అనంతరం స్టేజిపైకి వచ్చి నన్ను హత్తుకొని అభినందించారు. నా సినిమా షూటింగ్‌ జరుగుతోంది పాత్ర పోషిస్తావా అని అక్కడే అడిగేశారు. నేను కూడా అంగీకారం తెలిపాను. ఆ విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ షూటింగ్‌లో నా నటన చూసిన హీరో రాజశేఖర్‌ నన్ను మెచ్చుకున్నారు. అనంతరం నేనూ, రాజశేఖర్ మిత్రులమయ్యాం. దీంతో ఆహుతి తీస్తున్న కోడి రామకృష్ణకు నాగురించి చెప్పడంతో ఆహుతిలో క్యారెక్టర్‌ ఇచ్చారు. అందులో నటనకు ప్రశంసలు దక్కాయి. అప్పటినుంచి బిజీ అయ్యాను.


సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేసేవారు కదా.. వాటి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది?

బాబూమోహన్‌: సరదా కోసం చిన్నచిన్న నాటకాలు వేసేవాళ్లం. పదో తరగతి చదివేప్పుడు తాత వేషం వేశా. తండ్రి వేషం వేశా. ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా తీసుకున్నా. కానీ నటనపై ప్రత్యేక సాధన చేయలేదు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మీరు నటనను, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసేవారు?

బాబూమోహన్‌: అందుకు యుద్ధాలు చేసేవాడిని (నవ్వుతూ). నాటకాలు వేస్తే కొద్దిరోజులపాటు ఇంట్లో మాట్లాడేవారు కాదు. చదువుపై అశ్రద్ధ వహిస్తూ ఈ నాటకాలేంటి అని నాన్న కొట్టేవారు. లీవ్‌ ఎందుకు పెట్టావని మా తహసీల్దార్‌ తిట్టేవారు. కావాలనే అందరినీ పిలిచి వారి ముందు నువ్వు సినిమా హీరో అవుతావా.. నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అని తిట్టేవారు. పెళ్లైన కొత్తలో నాటకాలు వేయొద్దని ఇంట్లో గొడవలు జరిగేవి. ఉద్యోగం చేస్తూ హాయిగా ఉండక నీకెందుకు ఇవ్వన్నీ అనేవారు. దీంతో ఇదే చివరి నాటకం అనేవాడిని. కానీ నా భార్య సౌదీ వెళుతున్నప్పుడు నాకు బోర్‌ కొడుతుందేమోనని నాటకాలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అప్పుడే రవీంద్రభారతిలో నాటకం వేశాను. దీంతో నటుడినయ్యా. ఆమె సౌదీ నుంచి తిరిగొచ్చేసరికి నేను ఇండస్ట్రీలో ఉన్నా.

కర్తవ్యం సినిమా చేసేవరకు కూడా మీరు నటుడయ్యారని మీ భార్యకు తెలియదట కదా..

బాబూమోహన్‌: అవును తెలియదు. తాను సౌదీ వెళ్లి రెండు సంవత్సరాలకు తిరిగొచ్చింది. అంతలోనే నేను పలు సినిమాల్లో నటించా. కానీ ఆమె వస్తున్న సమయంలో షూటింగ్‌కి విరామం తీసుకున్నా. నటిస్తున్నట్లు చెప్పొద్దని కుటుంబసభ్యులకు తెలిపా. వస్తున్నప్పుడు వీఐపీ లాంజ్‌లో ఉండి రిసీవ్‌ చేసుకొన్నా. పంపించేప్పుడు లోపలికి రానివ్వలేదు కదా ఇప్పుడెలా వచ్చారు అని అడిగింది. అయితే తెలిసినవారు ఉండటంతో వారి ద్వారా వచ్చానని అబద్ధం చెప్పా. ఆమె వచ్చిన రెండోరోజు సినిమాకు వెళదాం అని అడిగితే కర్తవ్యం సినిమాకి తీసుకెళ్లా. సినిమా మొదలై నా ఎంట్రీ తరువాత ఆమె షాక్‌కి గురైంది. తెరను అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడే తనకు తెలిసింది.

ఒక ఏడాదిలో దాదాపు 80 సినిమాలు చేశారు అది ఎలా సాధ్యమైంది?

బాబూమోహన్‌: నేనుంటేనే సినిమా తీసుకుంటాం అనుకునేవారు బయ్యర్లు (నవ్వుతూ). ఓ ఏడాది సంక్రాంతికి రిలీజైన 15 సినిమాల్లో ఒక్కదాంట్లో మాత్రమే నేను లేను. మిగతా అన్నింట్లో నటించా. నేను లేని ఆ ఒక్కటీ ఇంగ్లిష్ సినిమా (నవ్వుతూ). 

కోటా శ్రీనివాసరావు-బాబూమోహన్ అనే పేర్లు స్నేహానికి చిరునామాగా నిలిచిపోతాయి. ఆయన గురించి మీ మాటల్లో...

బాబూమోహన్‌: మేము సొంత అన్నదమ్ముల్లాగే ఉంటాం. బొబ్బిలి రాజాతో మా కాంబినేషన్‌ మొదలైంది. అప్పుడు సరిగా మాట్లాడలేదు కానీ మామగారు సినిమాతో క్లోజ్‌ అయ్యాం. ఒకే పళ్లెంలో భోజనం చేసేవాళ్లం. కోటన్న వాళ్ల అక్కాతమ్ముళ్లు కూడా నన్ను తమ్ముడనే అంటారు. 

మీకు బాగా ఇష్టమైన ఎన్టీరామారావుని ఎలా కలిశారు? ఆయనతో మీకున్న అనుభవం ఏమిటి?

బాబూమోహన్‌: మా అమ్మానాన్న ఎన్టీరామారావు అభిమానులు. వారి వల్లే నేను ఆయన అభిమానినయ్యా. నటుడు అయినప్పటినుంచీ ఎన్టీఆర్‌ను చూడాలనే కోరిక ఉండేది. లారీ డ్రైవర్‌ నిర్మాత ఎన్టీఆర్‌కు బాగా దగ్గర. నేనూ ఆ నిర్మాతకు బాగా క్లోజ్‌. నా కోరిక మన్నించి విశ్వామిత్ర చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అక్కడికి తీసుకెళ్లి మాట్లాడించారు. అప్పుడే నేను ఎన్టీఆర్‌తో మొదటిసారి మాట్లాడా. బాగా నవ్విస్తున్నారు మీరు. చాలా సంతోషం అని ఆయన అభినందించారు. మోహన్‌బాబు సినిమా రౌడీ గారి పెళ్లాం 100 రోజుల కార్యక్రమంలో ఎన్టీఆర్‌ చేతుల మీదుగానే షీల్డ్‌ తీసుకున్నా. అప్పుడు నా జన్మ ధన్యమైందని అనుకున్నా. 

మరిన్ని ఆసక్తికర విషయాల కోసం కింది వీడియోను చూడండి..


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని