ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకున్న నటి మధుమిత

కొన్ని ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజు కింద 50 శాతం ఫీజులు తీసుకోవడం లేదని, పూర్తి ఫీజు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయని టాలీవుడ్‌ నటి, శివబాలాజీ సతీమణి మధుమిత పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించినందుకు పరీక్షలకు ముందు వారి పిల్లల్ని తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మణికొండలోని ఒక ప్రైవేటు పాఠశాల తమ

Updated : 02 Oct 2020 18:22 IST

సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి

హైదరాబాద్‌: కొన్ని ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజు కింద 50 శాతం ఫీజులు తీసుకోవడం లేదని, పూర్తి ఫీజు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయని టాలీవుడ్‌ నటి, శివబాలాజీ సతీమణి మధుమిత పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించినందుకు పరీక్షలకు ముందు వారి పిల్లల్ని తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మణికొండలోని ఒక ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించడంపై శివబాలాజీ దంపతులు గతంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో విజయలక్ష్మికి కూడా ఫిర్యాదు చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు అయ్యే వరకు తాము పోరాడుతామని వారు స్పష్టం చేశారు. కాగా తాజా విలేకరుల సమావేశంలో శివబాలాజీ, మధుమిత పాల్గొన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఆపై కేసీఆర్‌ను కలుస్తామని శివబాలాజీ అన్నారు. అన్యాయంగా ప్రవర్తిస్తున్న ప్రైవేటు పాఠశాలల తీరు మారేంత వరకూ పోరాడతామని అన్నారు.

అనంతరం ఆయన సతీమణి మధుమిత మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల్ని అన్యాయంగా పీకి పడేస్తుంటే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాం. కొన్ని పాఠశాలలు మీరు పాస్‌ చేసిన జీవో 46ను కొంచెం కూడా పట్టించుకోకుండా.. గత సంవత్సరం పూర్తి ఫీజు ఎలాగైతే తీసుకున్నారో.. ఈ ఏడాది కూడా అలానే పూర్తి ఫీజు కట్టాల్సిందేనని చెబుతూ.. దానికి ట్యూషన్‌ ఫీజు అని పేరు పెట్టారు. దాని రూపంలో మొత్తం కలిపి తీసుకుంటున్నారు. జీవో 193 ప్రకారం ట్యూషన్‌ ఫీజు 50 శాతం ఉండాలని మీరు అన్నారు. తల్లిదండ్రుల్ని ఆదుకోవాలని మీరు ట్యూషన్‌ ఫీజు మాత్రం కట్టమన్నారు. కానీ చాలా పాఠశాలలు మొత్తం కలిపి కట్టాలని చెబుతున్నాయి’.

‘మేము పాఠశాల మొత్తం ఫీజులో 40 శాతం కట్టేశాం. 100 శాతం కట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఎందుకు ఇంత తీసుకుంటున్నారు.. ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోండి’ అని తల్లిదండ్రులు అడిగినందుకు.. సరిగ్గా పరీక్షల ముందు ఆ పిల్లల్ని వద్దన్నారు. చిన్న పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, పసి మనసుల్ని ఎందుకు గాయపరుస్తున్నారు. ఓ నటిగా, ఆడ బిడ్డగా, ఇల్లాలిగా నేను జీవితంలో ఎన్నో చూశా, భరించాను కేసీఆర్‌ సర్‌. కానీ, నా పిల్లల్ని పాఠశాల నుంచి తీసేసినప్పుడు చలించిపోయాను. నా భర్త నాకు కొండంత అండగా ఉన్నాడు కాబట్టి.. నేను బయటికి వచ్చి, ఇలా మాట్లాడుతున్నా. కానీ ఎంత మంది తల్లిదండ్రులు ఇలా బయటికి రాగలరు సర్‌? ఎంత మంది తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరుగుతారు? మీరు చొరవ తీసుకుంటేనే దీనికి ఓ పరిష్కారం లభిస్తుంది. మీకెన్నో సమస్యలు ఉన్నాయి. కరోనా సంక్షోభాన్ని మనం ఊహించలేదు. నిజమే.. కానీ మీరు దృష్టిసారిస్తేనే దీనికి ఓ పరిష్కారం లభిస్తుంది. లక్షల మంది తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని మధుమిత ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని