Sudheer babu: ఆ మాటలే నిరూపించుకునేలా చేశాయి

‘‘చేసిన సినిమాల సంఖ్య.. సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే.. నటుడిగా నేను సంపాదించుకున్న గౌరవమే నాకు ముఖ్యం. ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. నటుడిగా వందశాతం కష్టపడ్డానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు హీరో

Updated : 10 Feb 2022 07:08 IST

‘‘చేసిన సినిమాల సంఖ్య.. సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే.. నటుడిగా నేను సంపాదించుకున్న గౌరవమే నాకు ముఖ్యం. ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. నటుడిగా వందశాతం కష్టపడ్డానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు హీరో సుధీర్‌బాబు. ‘ఎస్‌ఎమ్‌ఎస్‌’ సినిమాతో 2012లో వెండితెరకు పరిచయమైన ఆయన.. ఈ పదేళ్ల సినీ ప్రయాణంలో ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘సమ్మోహనం’ లాంటి విజయంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తున్నారు. గురువారంతో సుధీర్‌ చిత్రసీమలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుధీర్‌బాబు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న
విశేషాలివి..

‘‘ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇన్నేళ్ల కెరీర్‌ ఉంటుంది అన్న ఆలోచనతో రాలేదు. సినిమాపై తపనతో వచ్చాను. నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మా నాన్న వ్యాపారాలు
చూసుకోవచ్చు కదా అన్నారు. కొన్నాళ్లు చేశాక.. ఏదో సాధించాలన్న తపన మొదలైంది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇటువైపు వచ్చాను. సినిమాల విషయంలో నాకంటూ ప్రత్యేక ప్రణాళికలేమీ లేవు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ క్రమంలో విజయాలు, వైఫల్యాలు చూశాను. కానీ, వేటికీ పొంగిపోలేదు.. కుంగిపోలేదు. వైఫల్యాలు నాకు విలువైన పాఠాలు నేర్పించాయి. స్క్రిప్ట్‌లు ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్‌లు, టెక్నికల్‌ టీమ్‌ని కూడా పరిగణలోకి తీసుకోవాలని గ్రహించాను’’.

‘‘నేను నా హార్డ్‌ వర్క్‌ని ఎక్కువ నమ్ముతాను. తొలి సినిమా సమయంలో మొదటి రోజు నన్ను సెట్లో చూసి.. మా కెమెరామెన్‌ తన అసిస్టెంట్లతో ‘తనది ఫొటోజెనిక్‌ ఫేస్‌ కాదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు’ అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు బాధగా
అనిపించినా.. తర్వాత నేనేం చేయాలో ఆలోచించుకునేలా చేసింది. నాపై అతనికి ఉన్న ప్రతికూల విశ్వాసం.. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రేరేపించింది. నేను హీరోగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలోనే ‘ఏమాయ చేశావే’లో సమంతకు అన్నగా నటించాను. హిందీలో ‘బాఘీ’ చిత్రంలో విలన్‌గా చేశాను’’.

‘‘నటుడిగా కృష్ణగారు, మహేష్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ‘ప్రేమ కథా చిత్రమ్‌’ విడుదలైనప్పుడు మహేష్‌ నన్ను మెచ్చుకున్నారు. నాకది ఎంతో ప్రత్యేకం. ఈ పదేళ్ల సినీ ప్రయాణంలో నేనెప్పుడూ మహేష్‌ని ఏ ఫేవర్‌ కోసం సంప్రదించలేదు. అది నేను పాటిస్తున్న సూత్రం. దర్శక నిర్మాతలు నా ప్రతిభను గౌరవిస్తున్నారు. అందువల్లే ఆఫర్లు వస్తున్నాయి. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది నా కోరిక. బాలీవుడ్‌ నుంచి ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ, ఇక్కడ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరట్లేదు’’.  

‘‘నాకు యాక్షన్‌ చిత్రాలంటే ఇష్టం. జాకీ చాన్‌కు పెద్ద అభిమానిని. రాబోయే రోజుల్లో బెంచ్‌ మార్క్‌ యాక్షన్‌ సినిమాలు చేయబోతున్నా. ప్రస్తుతం నటుడు, రచయిత హర్ష వర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ‘లూజర్‌ 2’ దర్శకుడు   అభిలాష్‌ రెడ్డితో ఒక చిత్రం చేస్తున్నా. వీటితో పాటు మరో రెండు కథలు ఒప్పుకున్నా. అలాగే పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కూడా ఉంటుంది. దానికోసం ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని