
భళ్లాలదేవుడిలో ఎన్నెన్ని కళలో.. మీకివి తెలుసా?
బర్త్‌డే స్పెషల్: టెక్నీషియన్ నుంచి నిర్మాత వరకూ..!
హీరో, విలన్.. అనే తేడా లేదు. నటనే శ్వాసగా.. పాత్రేదైనా, ఘట్టమేదైనా ఫట్ ఫట్‌లాడించేస్తాడు. భళ్లాలదేవుడిగా ‘బాహుబలి’ని ఢీ కొట్టాలన్నా.. రాధా జోగేంద్రగా భార్యను పిచ్చిగా ప్రేమించాలన్నా ఆయన్ను మించిన నటులు లేరు. పాత్రను పండించేందుకు ఎంతకైనా తెగించే వ్యక్తిత్వం. ఇదంతా కథానాయకుడు రానా గురించేనండీ. అగ్ర నిర్మాత సురేశ్‌బాబు కుమారుడిగా వచ్చి.. వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్న స్టార్ ఆయన. సోమవారం రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు..
సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన రానాకి చిన్నతనం నుంచే ఫిలిం మేకింగ్‌పైన ఆసక్తి. బాల్యంలో సెట్‌కి వెళ్లినప్పుడు ఏ పరికరం ఎలా పనిచేస్తోందో చూసేవారట. అందుకే అన్ని విషయాలపైనా అవగాహన పెంచుకున్నారు. ఆయన్ను కేవలం కథానాయకుడిగానే చూడలేం. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నేర్చుకున్నారు. నటుడిగా సెట్లో ఉన్న రోజుల కంటే.. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేసిన రోజులే ఎక్కువ. |
రానా మొదట విజువల్ ఎఫెక్ట్ శాఖలో టెక్నీషియన్‌గా పనిచేశారు. 2006లో మహేశ్‌బాబు ‘సైనికుడు’ సినిమాకు సాంకేతిక నిపుణుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఆపై భారీ అంచనాల మధ్య శేఖర్ కమ్ముల ‘లీడర్’తో (2010) రానా అరంగేట్రం చేశారు. తొలి చిత్రంలోనే రాజకీయ నాయకుడిగా కనిపించడమంటే మాటలు కాదు. రానా ఆ ధైర్యం చేసి, విమర్శకుల ప్రశంసలు పొందారు. అంతేకాదు 2011లో ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇదే ఏడాది ‘దమ్ మారో దమ్’తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించారు. ఆపై ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’ చిత్రాలతో అలరించారు. |
తెరపై హీరోయిజాన్ని ఆవిష్కరించడంలో రాజమౌళి శైలే వేరు. కథానాయకుడి కంటే ప్రతినాయకుడినే బలంగా చూపిస్తుంటారు. ‘బాహుబలి’ని ఢీ కొట్టే విషయంలో ఆ బలాన్ని రానాలో చూశారు రాజమౌళి. అందుకే ఆయన భళ్లాలదేవ అయ్యారు. జక్కన్న నమ్మకాన్ని రానా వమ్ము చేయలేదు. భళా భళ్లాల.. అనేలా, ఆ పాత్రను ఇంకెవరూ చేయలేరు అనిపించేలా అభినయాన్ని ప్రదర్శించారు. ఇందులో నటించిన తారలు అంతర్జాతీయంగా వెలిగిపోయారు. ‘బాహుబలి’ రెండు విభాగాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపించాయి. భళ్లాలదేవుడిగా ఒదిగిపోవడానికి రానా ఎంతో శ్రమించారు. నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు చేసి, 110 కిలోల బరువుకు చేరారు. యుక్త వయసు భళ్లాలదేవ సన్నివేశాల కోసం 20 కిలోలు తగ్గడం విశేషం. యుద్ధ విద్యల్లో మెలకువలు నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయపడ్డారు కూడా. |
‘రుద్రమదేవి’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘యన్.టి.ఆర్’ సినిమాలతో నటుడిగా తన ప్రత్యేకతను చాటారు. ఇలా సాహసాలు చేయడం గురించి రానాను ప్రశ్నిస్తే.. ‘సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేయలేదు. చేయను కూడా! ఎప్పుడూ ఓ కొత్త కథతో ప్రయాణం చేయాలని ఉంటుంది. బలమైన పాత్రల్లో నటించే అవకాశం రావడం కష్టమే. భళ్లాలదేవుడు గురించి ముంబయితోపాటు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది..’ అన్నారు. |
తనకు సినిమా అంటే ప్యాషన్. మేకింగ్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ప్రవేశం ఉంది. ‘బొమ్మలాట’, ‘కేరాఫ్ కంచరపాలెం2 సినిమాలతో నిర్మాతగా అభిరుచి చాటుకున్నారు. ‘అంతా ఇక్కడి నుంచే మొదలైంది..’ అంటూ బాల్యంలో కెమెరాతో ఉన్న ఫొటోను రానా ఓసారి అభిమానులతో పంచుకున్నారు. ఈ మధ్య రానా తనలోని సృజనాత్మకతకు మరింత పదును పెట్టారు. యానిమేటెడ్ వెర్షన్‌లో ‘వై ఆర్ యు’ అనే షోను రూపొందిస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ సౌత్ బేలో ఇది ప్రసారం అవుతుంది. |
రానాకు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మంచు లక్ష్మి మంచి మిత్రులు. చిత్ర పరిశ్రమలో విభజనలు కనిపిస్తున్నా అందరితోనూ స్నేహంగా ఉండటం ఎలా సాధ్యమైందని అడగగా.. ‘చరణ్‌ది నాది ఒకే స్కూల్, క్లాస్. కలిసే చదువుకున్నాం. అలాగే నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ నాకు సోదరులు అవుతారు. నవతరం నటుల్లో చాలా మందితో కలిసి పనిచేశాను. చిత్ర పరిశ్రమలో కనిపించే విభజనల్ని నేనెప్పుడూ పట్టించుకోను. సినిమా కంటే ఎవరూ గొప్పోళ్లు కాదు. తామే గొప్పవాళ్లమని భావించిన వారంతా ఎప్పుడో కనుమరుగైపోయారు..’ అని ఓసారి ఆయన చెప్పారు. |
లాక్‌డౌన్‌లో రానా ఓ ఇంటివాడయ్యారు. ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మిహికా బజాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో వైభవంగా ఏర్పాటు చేసిన వేడుకలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం రానా చేతిలో ‘అరణ్య’, ‘హథీ మేరీ సాథీ’, ‘1945, ‘హిరణ్య కశ్యప’, ‘విరాట పర్వం’ చిత్రాలున్నాయి. -ఇంటర్నెట్‌డెస్క్ |
ఇవీ చదవండి..
రాత్రికి రాత్రే స్టార్‌డమ్ వెనుక ఆరేళ్ల కష్టం..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.