BalaKrishna: తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అఖండ’ దిక్సూచిలా నిలిచింది : బాలయ్య

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది...

Updated : 12 Mar 2022 22:07 IST

కర్నూలు: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ‘‘అఖండమైన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్ఞతలు. హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని ఇనుముడింప జేసిన చిత్రం ‘అఖండ’. ప్రకృతి, ఆడవాళ్లు, పసిపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడన్న భగవత్‌ సందేశాన్ని ఈ చిత్రంలో చూపించాం. మా ద్వారా ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని అందించే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. యావత్‌ భారత దేశం తలెత్తుకునేలా చేసింది ‘అఖండ’ చిత్రం. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు .. ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తాం. బోయపాటి శ్రీను, మేము.. డబ్బును దృష్టిలో పెట్టుకుని సినిమా తీయం. కట్టె..కొట్టె.. తెచ్చె అనే మూడు మాటలతోనే సినిమా తీస్తాం. ముత్యాలు ఏటవాలుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో... నటీ నటుల నుంచి అలాంటి హావభావాలు రాబట్టగల దర్శకుడు బోయపాటి శ్రీను.

సాధారణ సినిమా అఖండమైన విజయం సాధించడం గొప్ప విషయం. సందేశాత్మ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చాం. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఒక థియేటర్‌లో ‘అఖండ’ చిత్రం 100 రోజుల ప్రదర్శించడం ఆనందంగా ఉంది. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే. మాకు మేమే పోటీ. సింహాకు పోటీ లెజెండ్‌,  లెజెండ్‌కు పోటీ ‘అఖండ’. నటనంటే కేవలం నవ్వించడమే కాదు.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి శోధించి మీ ముందుకు తీసుకు వచ్చి జీవింపజేసినందుకు రచయితకు, దర్శకుడికి కృతజ్ఞతలు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణలో పాల్గొన్నాం. షూటింగ్‌లో బిజీగా ఉండి కరోనా ఉందన్న విషయం కూడా మర్చిపోయాం. అమెరికాలోని థియేటర్లలో ‘అఖండ’ సినిమా విడుదలైతే  స్పీకర్లు కూడా బద్దలయ్యాయి. అలాంటి సునామీ సృష్టించింది ఈ సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిలా నిలిచింది ఈ చిత్రం. ‘అఖండ’ చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు, చిత్ర బృందానికి అభినందనలు’’ అని బాలకృష్ణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని