అఖిల్‌తో ‘సిసింద్రీ’ అలా తీశారు!

అక్కినేని అఖిల్‌, నాగార్జున, శరత్‌బాబు, ఆమని కీలక పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సిసింద్రీ’. శివ నాగేశ్వరరావు దర్శకుడు. సెప్టెంబరు 14, 1995లో విడుదలైన ఈ చిత్రం మంచి

Updated : 15 Sep 2020 09:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని అఖిల్‌, నాగార్జున, శరత్‌బాబు, ఆమని కీలక పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సిసింద్రీ’. శివ నాగేశ్వరరావు దర్శకుడు. 1995 సెప్టెంబరు 14న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్నా, పెద్దా అందరినీ అలరించింది. తాజాగా ఈ చిత్రం 25ఏళ్లు పూర్తి చేసుకుంది.

కథేంటంటే: శరత్‌కుమార్‌ (శరత్‌బాబు), ఆమని భార్యాభర్తలు. వీరికి సిసింద్రీ (అఖిల్‌) ఒక్కొగానొక్క కొడుకు. సిసింద్రీని కిడ్నాప్‌ చేసి శరత్‌కుమార్‌ దగ్గర డబ్బులు డిమాండ్‌ చేయాలని చూస్తాడు అతడి తమ్ముడు శివాజీ (శివాజీ రాజా). దీనికోసం జక్కన్న(గిరిబాబు), అక్కన్న (తనికెళ్ల భరణి), మాదన్న (సుధాకర్‌) సహకారంతో సిసింద్రీని కిడ్నాప్‌ చేస్తాడు? మరి వారి నుంచి సిసింద్రీ ఎలా తప్పించుకున్నాడు? బాబును కిడ్నాప్‌ చేసిన ముగ్గురు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరకు సిసింద్రీ తల్లిదండ్రులను చేరాడా? అన్నది కథ.

హాలీవుడ్‌ చిత్రం ‘బేబీ డే అవుట్’ స్ఫూర్తితో దర్శకుడు శివ నాగేశ్వరరావు, మరుధూరి రాజా ఈ కథను తీర్చిదిద్దారు. అప్పటికి అఖిల్‌ వయసు ఏడాది. ‘సిసింద్రీ’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మరీ ముఖ్యంగా అఖిల్‌ను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సిసింద్రీ కిడ్నాప్‌ అయిన దగ్గరి నుంచి జక్కన్న, అక్కన్న, మాదన్న పడే కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. సినిమా మొత్తం అఖిల్‌ కనిపిస్తాడు. తెరపై తల్లిగా ఆమని కనిపించినా, ఆమె వెనుక అమల ఉండేవారు. అఖిల్‌ నేలపై పాకే సన్నివేశాలు, చిరు నవ్వులు చిందించే సన్నివేశాలు అంత అందంగా రావడానికి అమల ఎంతో కృషి చేశారు. షూటింగ్‌ జరిగినంత సేపూ అఖిల్‌తోనే ఉండేవారు. గ్లాస్‌ డోర్‌ వెనక నిలబడి అమల పిలిస్తే అఖిల్‌ పాకుతూ వచ్చేవాడు. ఇక నాగార్జున ఎక్కువ సన్నివేశాల్లో కనిపించారు. కారు మెకానిక్‌గా సిసింద్రీని కాపాడే పాత్రలో ఆయన నటించారు.

సెట్‌లో అఖిల్‌ గాయం.. భయపడిపోయిన యూనిట్‌

‘సిసింద్రీ’ షూటింగ్‌ జరుగుతుండగా జరిగిన ఓ సంఘటనతో ఆ యూనిట్‌ మొత్తం భయపడిపోయింది. రోజూ అఖిల్‌తో అమల ఉండేవారు. అప్పుడప్పుడు నాగార్జున వచ్చేవారు. ఒకరోజు అమల బయటకు వెళ్తూ, సెట్‌లో అఖిల్‌ను కేర్‌టేకర్‌కు అప్పగించి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అఖిల్‌ ఆడుకుంటూ టీపాయ్‌పై పడ్డాడు. దీంతో కంటి రెప్పపై చిన్నగా గీసుకుంది. అంతే ఈ విషయం తెలిసిన నాగార్జున, అమల పరుగు పరుగున సెట్‌కు వచ్చారు. అప్పుడు దర్శకుడు శివనాగేశ్వరరావు సెట్‌లో ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌లకు ఒక్కటే చెప్పారు. ‘నాగార్జున వస్తారు. ఒకళ్లిద్దరికి దెబ్బలు ఖాయం. ఆయన చేతిలో ఇప్పుడు దెబ్బలు తినడమే నయం. ఆ తర్వాత పెద్ద ఇష్యూ అవుతుంది’ అన్నారట. నాగార్జునతో పాటు ఆయన స్నేహితుడు సతీష్‌ కూడా సెట్‌కు వచ్చారు. అఖిల్‌ కంటిపై గీరుకోవడం చూసి, ‘పిల్లలకు దెబ్బలు తగలకుండా ఉంటాయా? చిన్నప్పుడు నాకు ఎన్నో దెబ్బలు తగిలాయి’ అని సర్ది చెప్పడంతో నాగార్జున కూల్‌ అయ్యారట. లేకపోతే ఆ దెబ్బతో సినిమా ఆగిపోయేదని దర్శకుడు శివనాగేశ్వరరావు ఓ సందర్భంలో చెప్పారు.

ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. రాజ్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయిల నిలబెట్టాయి. ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. టబు, పూజా భాత్రా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. క్లైమాక్స్‌లో సర్కస్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.

‘సిసింద్రీ’ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమల తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ప్రతి నటుడు/నటి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. వేల మైళ్లు, అత్యున్నత శిఖరాలను అందుకోవడమే విజయం కాదు. ఆ ఎత్తు పల్లాలను దాటి ఎలాంటి సాహసాలు చేస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ  25ఏళ్లలో నీ తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎంతో నేర్చుకున్నావు.. ఎదిగావు.. నీవు ఎంచుకున్న మార్గంలో నువ్వు పయనించు. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. శుభాభినందనలు’’ అని అమల పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని