వాళ్ల వల్ల 16 సినిమాల్లో అవకాశాలు కోల్పోయా..!

విభిన్నమైన వ్యవహారశైలి.. కామెడీ టైమింగ్‌తో.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ కిలాడీ.. చలాకీ చంటి. గుంటూరు మిర్చిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ధారావాహికల్లో మాంచి పేరు తెచ్చుకుని.. ఎన్నో సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హిమజ..

Updated : 11 Nov 2020 13:46 IST

మూడు గంటలపాటు కన్నీళ్లు ఆగలేదు: చంటి

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన వ్యవహారశైలి.. కామెడీ టైమింగ్‌తో.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ కిలాడీ.. చలాకీ చంటి. గుంటూరు మిర్చిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ధారావాహికల్లో మాంచి పేరు తెచ్చుకుని.. ఎన్నో సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హిమజ. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తమ జీవితాలకు  సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సరదా సంగతులు మీకోసం..!    

ఆలీ: మీ స్వస్థలం ఏది?

హిమజ: గుంటూరు జిల్లాలోని వీర్లపాలెం.

ఆలీ: ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేశారు?
హిమజ: డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొంతకాలంపాటు ఓ స్కూల్‌లో సోషల్‌ టీచర్‌గా పనిచేశాను. అయితే అక్కడ వచ్చిన సంపాదన చాలకపోవడంతో వేరే ఉద్యోగం చేయాలని భావించి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ కూడా నేర్చుకున్నాను. అలాంటి సమయంలో ఇండస్ట్రీలోకి వెళ్లాలనే భావన కలిగింది. పరిశ్రమ వైపు అలా తొలి అడుగులు వేశాను. ఈటీవీలో ప్రసారమయ్యే ‘భార్యామణి’ ధారావాహికలో మొదటిసారి నటించాను.

ఆలీ: నువ్వు ఏం చదువుకున్నావు? నీ అసలు పేరేంటి?
చలాకీ చంటి: నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బీకాం చదువుకున్నాను. మొదటి సంవత్సరం తర్వాత కాలేజీ‌కి వెళ్లలేదు. నా అసలు పేరు వినయ్‌ మోహన్‌. రేడియో స్టేషన్‌లో వర్క్‌ చేసినప్పుడు చంటి. జబర్దస్త్‌కి వచ్చాక చలాకీ చంటి. 

ఆలీ: నటి ఊహ వల్లే మీరు పరిశ్రమలోకి అడుగుపెట్టారట?
చలాకీ చంటి: అవును సర్‌. పదో తరగతి చదివేటప్పుడు మా స్కూల్‌లో నేనే కల్చరల్‌ లీడర్‌. దానివల్ల అందరూ నాకు కొంచెం భయపడుతూ.. గౌరవం ఇచ్చేవాళ్లు. ఓ సారి మా స్కూల్‌లో వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దానికి నటి ఊహ గారు అతిథిగా వచ్చారు. అయితే ఆమె స్టేజ్‌ ఎక్కగానే.. అప్పటివరకూ నాకు గౌరవమిచ్చిన తోటి విద్యార్థులందరూ.. ‘ఉహ గారు కనిపించడం లేదు కూర్చో’ అని తిట్టడం ప్రారంభించారు. సెలబ్రిటీ అయితే తప్పకుండా గౌరవం లభిస్తుందని నాకు అనిపించింది. చదువు పూర్తి చేశాక డబ్బులు కోసం మొదట కొన్ని ఉద్యోగాలు చేశాను. అనంతరం పరిశ్రమలోకి వచ్చాను.

ఆలీ: మీ వాయిస్‌ మీకు ప్లస్సా లేదా మైనస్సా?
చలాకీ చంటి: నా వాయిస్‌ నాకు నచ్చదు. బయటవాళ్లందరికీ అది ప్లస్సులా అనిపించినప్పటికీ నాకు మాత్రం మైనస్సే. కానీ ఈ వాయిస్‌ వల్లే కమెడియన్‌గా గుర్తింపు పొందాను. (మధ్యలో ఆలీ అందుకుని ఈ వాయిస్‌ వల్లే నీకు పెళ్లి అయ్యిందని విన్నాను. (నవ్వులు))

ఆలీ: నీది ప్రేమ వివాహమా? లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా?
చలాకీ చంటి: నాది లవ్‌ మ్యారేజ్‌. నా టాలెంట్‌, నటన చూసి తను నన్ను లవ్‌ చేసింది. పెళ్లయ్యాక నేనూ తనని ప్రేమిస్తున్నాను. మాకు ఇద్దరు పాపలు దేవసేన, ధన్విక.

ఆలీ: స్క్రీన్‌కి ఎప్పుడు పరిచయమయ్యారు?
చలాకీ చంటి: 2008లో ‘జల్లు’ చిత్రంతో వెండితెరకి పరిచయమయ్యాను. అందులో నేను హీరో స్నేహితుడిగా నటించాను. ఆ సినిమా చేయడానికి ముందు ఓ రేడియో స్టేషన్‌లో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. అక్కడ వాయిస్‌ ఓవర్‌ రాసే యతిరాజు భూపాల్‌  ‘జల్లు’ సినిమాకి రచయితగా పనిచేశారు. ‘జల్లు’ విడుదలైన రోజు ధన్‌రాజ్‌ ఫోన్‌ చేసి.. ‘అరేయ్‌ మన సినిమా రిలీజ్‌ అయ్యింది. వెంటనే క్రాస్‌రోడ్స్‌కి వచ్చేయ్‌’ అన్నాడు. మొదటి సినిమా కావడంతో నాకెంతో సంతోషంగా అనిపించి... పరిగెత్తుకుంటూ వెళ్లా. కానీ ఒక్క షోకి మాత్రమే ఆ సినిమా పరిమితమయ్యింది. దాంతో బాధపడ్డా. ‘జల్లు’ తర్వాత ఒక సంవత్సరం వరకూ ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు. చివరికి ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఆఫర్‌ నన్ను వరించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ మళ్లీ ఓ ఏడాది పాటు అవకాశాల్లేవు.

ఆలీ: మీ కుటుంబం గురించి ఏమైనా చెప్పగలరు?
హిమజ: మా నాన్న విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి. నాన్నకి భక్తి పాటలు రాయడం అంటే ఎక్కువ ఆసక్తి. నాకొక అన్నయ్య ఉన్నారు. ప్రస్తుతం అతను గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అన్నయ్య, నేనూ జీవితంలో కొంచెం స్థిరపడిన తర్వాత నాన్నని ఉద్యోగం మానిపించేశాం. దాంతో ఆయన ప్రస్తుతం భక్తి పాటలు రాసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

ఆలీ: పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి?
హిమజ: జీవితంలో పెళ్లి అనేది అంత ముఖ్యమా? చేసుకోకపోతేనే మంచిదనిపిస్తుంది.
చలాకీ చంటి: పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఓ స్టేజ్‌కి వచ్చేసరికి మనకంటూ ఓ తోడు ఉండాలి. కాబట్టి నా దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యమైన విషయం.

ఆలీ: మీకు సీరియల్స్‌లో గుర్తింపు వచ్చిందా? లేదా సినిమాల్లోనా?
హిమజ: ‘భార్యామణి’ సీరియల్‌ కోసం 2013 మార్చి నెలలో మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. ‘నేను శైలజ’ సినిమాతో 2014లో వెండితెరకు పరిచయమయ్యాను. అదే నా మొదటి సినిమా. నిజం చెప్పాలంటే.. బుల్లితెర, వెండితెర రెండూ నాకు మంచి గుర్తింపునిచ్చాయి. సీరియల్స్‌లో పనిచేసిన రెండు సంవత్సరాలూ.. ‘ఉత్తమ నటి’గా అవార్డు కూడా పొందాను.

ఆలీ: ‘జబర్దస్త్‌’ గురించి మీ అభిప్రాయం ఏంటి?
చలాకీ చంటి: సినిమాల్లో నటించిన తర్వాత మమ్మల్ని పిలిచి మరీ.. మాకు నటించేందుకు ఓ మాంచి ఫ్లాట్‌ఫామ్‌ ఇచ్చారు. నాతోపాటు దాదాపు 100 మంది వరకూ ప్రస్తుతం ఇండస్ట్రీలో సంతోషంగా బతుకుతున్నారు. దానికి కారణం ‘జబర్దస్త్‌’.

ఆలీ: ప్రభాస్‌ ఫ్యాన్‌ నిన్ను ఇబ్బందిపెట్టారా?
చలాకీ చంటి: ప్రభాస్‌ గారిని ఏదో అన్నానంటూ 2014లో సోషల్‌మీడియా వేదికగా నా గురించి పుకార్లు వచ్చాయి. అది ఎంతవరకూ నిజం అని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో వారం రోజులపాటు నాకు చుక్కలు చూపించేశారు. ఫేస్‌బుక్‌ అంతా గాలించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని కనిపెట్టి.. పోలీసుల సాయంతో అతడ్ని పట్టుకున్నా. ‘నా గురించి అసత్య ప్రచారం ఎందుకు చేశావు? నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా?’ అని ప్రశ్నిస్తే.. ‘నా స్నేహితులు చెప్పారు. అందుకే పోస్ట్‌ పెట్టా’ అని నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. కానీ ఆ వారం రోజులపాటు జరిగిన ఎటాక్‌ వల్ల నేను ఫోన్‌ నంబర్ మార్చుకున్నాను. దాంతో ఓ సినిమా ఆఫర్‌ కూడా పోయింది.

ఆలీ: ఆఫర్స్‌ రాకపోవడానికి కారణమేమిటి?
చలాకీ చంటి: ‘భీమిలి కబడ్డీ జట్టు’ మంచి పేరు తెచ్చినప్పటికీ ఒక ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు. దానికి కారణం ఇండస్ట్రీలో ఉండే కొంతమంది వ్యక్తులు. నేను టైమ్‌కి సెట్‌లో ఉండనని, క్యారవాన్‌ అడుగుతానని.. కొంతమంది వ్యక్తులు డైరెక్టర్లకు నా గురించి తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆఫర్స్‌ రాలేదు. ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమా తర్వాత కూడా నాకు అవకాశాలు రాకపోవడానికి కారణమిదే. కొంతమంది చేసిన అసత్య ప్రచారాల వల్ల 16 సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. ఎంతో బాధగా అనిపించింది.

ఆలీ: కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
హిమజ: కెరీర్‌ ఆరంభంలోనే ఇబ్బందులు పడ్డాను‌. ధారావాహికలో నటిస్తూ పేరు తెచ్చుకున్న సమయంలో ‘నేను శైలజ’ చిత్రంలో పనిమనిషి పాత్ర చేయమని అడిగారు. పెద్ద నిర్మాణ సంస్థ. పాత్ర ఏదైనా సరే చేయాలని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో మా బంధువులు, స్నేహితులు, తోటి ఆర్టిస్ట్‌లు.. ‘హీరోయిన్‌గా బుల్లితెరపై మంచి పాత్రను పోషిస్తున్నావు. ఇలాంటి సమయంలో పనిమనిషి పాత్ర చేయడం అవసరమా? అలాంటి పాత్రలు ఒప్పుకుంటే సీరియల్స్‌లో మెయిన్‌ రోల్స్‌ రావు. సినిమాల్లో సైతం పనిమనిషి పాత్రలే ఇస్తారు’ అని భయపెట్టారు. దానివల్ల చాలా ఇబ్బందిపడ్డా.  

ఆలీ: మీకు గుర్తింపు తెచ్చిన సినిమా ఏది?
హిమజ: ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని కానుక పాత్ర నాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్రను నేను ఎంజాయ్‌ చేస్తూ నటించాను. 2017లో వరుసగా ఆరు సినిమాల్లో నటించాను.

ఆలీ: మీ గురించి వచ్చిన కొన్ని మీమ్స్‌ చూసి బాధపడ్డారట?
హిమజ: అవును సర్‌.. ఒకబ్బాయి తాను సంపాదించిన దానితో ఏమైనా కొనుగోలు చేస్తే ఈ సమాజం ఏం అనుకోదు. కానీ ఒకమ్మాయి తాను సంపాదించిన డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కుంటే.. ఎవరో వ్యక్తి కొనిపెట్టారు అని చెప్పుకుంటారు. ఒకానొక సమయంలో నా గురించి అలాంటి మీమ్స్‌ రావడం చూసి నేనెంతో బాధపడ్డాను. కారు, ఇల్లు కొనుకున్నప్పుడు.. ‘హిమజ.. నువ్వు ఏదో చేసి ఉంటావ్‌ అందుకే నీకు కొనిపెట్టారు’ అంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. వాటిని చూసి బాధపడ్డా. కోపం వచ్చింది. ఇలాంటి పోస్టులు చూస్తే నా తల్లిదండ్రులు కుంగిపోతారు అనిపించింది‌. ఒకర్ని సంతోషపెట్టక పోయినా పర్వాలేదు కానీ, తెలియని విషయాల గురించి మాట్లాడి ఎదుటివారిని మాత్రం దయచేసి బాధపెట్టకండి.

ఆలీ: దేవుడు వరమిస్తే ఏ సంవత్సరంలోకి మళ్లీ వెళతారు?
హిమజ: 2005‌. స్కూల్‌డేస్‌ అవ్వగానే మళ్లీ జీవితాన్ని ప్రారంభించవచ్చు.

ఆలీ: సింగింగ్‌ అంటే ఇష్టమా?
హిమజ: నాకు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అప్పుడప్పుడు పాడుతుంటాను. ఇటీవల రఘుకుంచె గారి కంపోజిషన్‌లో ఓ సాంగ్‌ పాడాను.

ఆలీ: అమ్మ ఎలా చనిపోయారు?
చలాకీ చంటి: ఇంట్లో గ్యాస్‌ లీక్‌ అవ్వడం వల్ల అగ్నిప్రమాదం జరిగి నా కళ్లెదురుగానే అమ్మ చనిపోయింది. అప్పుడు నాకు ఐదేళ్లు. ఆ సమయంలో నాకు ఏం తెలీదు. పదిరోజుల తర్వాత అమ్మ చనిపోయిందని అర్థమయ్యింది. ఆ రోజు బాగా ఏడ్చాను. ఆ తర్వాత మళ్లీ ఏడ్చింది నా కూతురు పుట్టాకే. మా పాప పుట్టాక మూడు గంటలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ తిరిగి నా దగ్గరకు వచ్చేసిందనిపించింది.

ఆలీ: స్నేహితుల ఇంటికి వెళ్తే ఎందుకని అక్కడ ఎక్కువ సమయం ఉండరు?
చలాకీ చంటి: 1987లో మా నాన్న మమ్మల్ని వదిలేశారు. అప్పటి నుంచి అమ్మే పెంచింది. 1992లో అమ్మ కన్నుమూసింది. మాకు కుటుంబసభ్యుల ప్రేమానుబంధాలు అంతగా దొరకలేదు. దీంతో ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్తే.. వాళ్ల ఇంట్లో ఉన్న అనుబంధాలు చూసి నాకు బాధగా అనిపించేది. అందుకే ఎవరి ఇంటికైనా వెళితే వెంటనే బయటకు వచ్చేస్తాను.

ఆలీ: ఓ వ్యక్తిని కొట్టావట?
హిమజ: ఓ రోజు షూటింగ్‌ జరిగే లొకేషన్‌కి కొత్త కారుతో వెళ్లాను. లొకేషన్‌లోనే కారుని పార్క్‌ చేశాను. మాతోపాటు వర్క్‌ చేసే ఓ వ్యక్తి..  కారు పార్కింగ్‌ గురించి నాతో గొడవపడ్డాడు. నాకు కోపం వచ్చేసింది. సెట్‌లోనే కొట్టేశాను.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని