ఇంతమందిని నవ్వించినందుకా మాకీ శిక్ష

తెలుగు సినిమా చరిత్రలో వారిద్దరిదీ చెరిగిపోని సువర్ణాధ్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు. మరొకరు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్య నటుడు. వారివురి కాంబినేషన్‌ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

Updated : 02 Dec 2020 09:57 IST

తెలుగు సినిమా చరిత్రలో వారిద్దరిదీ చెరిగిపోని సువర్ణాధ్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు. మరొకరు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్య నటుడు. వారివురి కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వారే కోట శ్రీనివాసరావు-బాబు మోహన్‌. వారి నట జీవితం గురించి, వారిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది, వారు ఎదుర్కొన్న సవాళ్లు, బాధలు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వారి కామెడీ టైమింగ్‌తో ఎంతో చలాకీగా ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు. అవన్నీ వారి మాటల్లోనే...

నమస్కారం. వెల్‌కమ్ టు మై షో బాబాయి..!
కోట శ్రీనివాసరావు: నమస్కారం. ఇంటర్వ్యూకి పిలిచి బాబాయి ఏంటయ్యా? నమస్కారం ఆలీ గారు. గౌరవప్రదంగా పిలవాలి(నవ్వులు)
బాబూ మోహన్‌: నేను నమస్కారం చెప్పను. హాయ్‌ అని చేతులను ఊపుతాను. 

ఇంతకీ మీ ఇద్దరి వయసెంత?
కోట శ్రీనివాసరావు: వయసుదేముంది? నాకంటే నువ్వు(ఆలీ) సీనియర్‌ నటుడివి. నాకు 77 ఏళ్లు పూర్తవుతాయి. ఇంకో విషయం నేను జులైలో పుట్టాను. జులాయిగాడిని.(నవ్వులు)

బాబూ మోహన్‌: నేను ఏప్రిల్ 14న పుట్టాను. అక్కడితో నా వయసు ఆగిపోయింది.

మరి మీ ఇద్దరిలో చిన్న వారెవరు?
బాబూ మోహన్‌: నేనే. కావాలంటే నా చేతి రేఖలు చూసుకోండి.
కోట శ్రీనివాసరావు: రేఖలను చూసి చెప్పేది నిలిచి ఉండదు. ప్రతిభను బట్టి చూసి చెప్పేది నిలిచి ఉంటుంది. (నవ్వులు)

బాబూ మోహన్‌: ఆ ప్రతిభ ఎక్కడ ఉంటుందో తెలిస్తే చెప్పొచ్చు కదా! వెళ్లి తెలుసుకొని వస్తాను!

కోట శ్రీనివాసరావు: నన్ను విడిచి ఎక్కడకు వెళ్తావు. నేను లేకపోతే నువ్వు లేవు.

ఏ సినిమాతో మీ ఇద్దరి పరిచయం ప్రారంభమైంది?

బాబూ మోహన్‌: ‘బొబ్బిలి రాజా’.

కోట శ్రీనివాసరావు: నేను అప్పటికి కొన్ని చిత్రాలు చేశాను. మొదటిసారిగా ‘బొబ్బిలి రాజా’ చిత్రం సందర్భంగానే కలిశా. మా ఇద్దరి మధ్య బెస్ట్‌ కాంబినేషన్‌ ‘మామగారు’తో మొదలైంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బాబూమోహన్‌ ఒక టైమింగ్‌ ఉన్న నటుడు. ఎలా అంటే మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో నా చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినేవాడు. అవి చూసి, ఆ దెబ్బలన్నీ ఎలా భరించాడని అందరూ అనుకుంటారు. కానీ, నేను అలా టచ్‌ చేస్తే చాలు.. వెళ్లి పడిపోయేవాడు. టైమింగ్‌తోనే అంత గొప్పనటుడయ్యాడు.

మీరిద్దరూ కలిసి ఎన్ని చిత్రాలు చేశారు?

కోట శ్రీనివాసరావు: మా కాంబినేషన్‌లో 60-70 చిత్రాలు వచ్చాయి.

మీ ఇద్దరి మధ్య ఏమైనా ఆసక్తికర సంఘటనలు జరిగాయా?

కోట శ్రీనివాసరావు: బాబూమోహన్‌ వల్ల నేను ఇబ్బంది పడిన సందర్భాలు రెండు, మూడున్నాయి. అప్పట్లో ప్రొడక్షన్‌ వాళ్లు చివరి నిమిషంలో టికెట్‌ ఇచ్చి రైలు ఎక్కించేవారు. అలా ఒకసారి రైలులో రాజమహేంద్రవరం బయలుదేరాం. ఇద్దరం కలిసి నాంపల్లిలో రైలెక్కాం. టీటీ వచ్చి టికెట్‌ అడిగితే, చేతిలో ఉన్న టికెట్‌ ఇచ్చాం. అది ఫ్లాట్‌ఫాం టికెట్‌ అని అప్పటివరకూ మాకూ తెలియదు. ‘సినిమాల్లోనే కాదు, బయట కూడా కామెడీ చేస్తారేంటండీ’ అన్నాడు టీటీ. జేబులో రూ.36 మినహా మా దగ్గర డబ్బుల్లేవు. అదే సమయంలో నటుడు రాజా సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాడు. విషయం తెలిసి తన డబ్బులతో టికెట్‌ తీసుకున్నాడు.

ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో బాబూమోహన్‌ నిద్రలేచి ‘అన్నా.. వచ్చాం, దిగండి’ అన్నాడు. రైలు దిగి చూస్తే, పది ఫ్లాట్‌ఫామ్‌లు కనపడ్డాయి. ‘రాజమండ్రిలో ఇన్ని ఫ్లాట్‌ఫామ్‌లు లేవు కదా’ అని అక్కడే ఉన్న కూలీని అడిగితే, ‘ఇది రాజమండ్రి కాదు. బెజవాడ’ అన్నాడు. మళ్లీ గబగబా సామాను లోపల వేసి ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్లి రైలెక్కాం. ‘ఎందుకిలా చేశావు’ అని అడిగితే.. ‘బ్రిడ్జి సౌండ్ విని రాజమండ్రి వచ్చిందేమో అనుకొని లేపాను’ అని అన్నాడు. ఇలాంటి సంఘటనలతో బాబూమోహన్‌ను చూసి కొంత నటన నేర్చుకున్నా.

మరొకసారి బ్రహ్మానందంతో కలిసి మేము రైలులో ప్రయాణం చేస్తున్నాం. రాజమండ్రిలో 20 నిమిషాల పాటు ట్రైన్‌ ఆగిపోయింది. అక్కడ రైలులో మామిడితాండ్ర ఎక్కువగా అమ్ముతుంటారు. అలా ఒకడు అమ్ముకుంటూ మా కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు. నన్ను చూడగానే ‘అరేయ్‌.. కోటగాడురా’ అన్నాడు. అంతే జనాలు ఒక్కసారిగా వచ్చేశారు. బ్రహ్మానందం వాళ్లకు కనపడకుండా పక్కన దాక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో బాబూమోహన్‌ పక్కకు పడుకొని ఉన్నాడు. అక్కడున్న వాళ్లలో ఒకడు ‘ఏంటి మందు ఎక్కువైందా’ అన్నాడు. ఆ మాట వినగానే బాబూమోహన్‌కు కోపం వచ్చి వాడితో గొడవకు వెళ్లిపోయాడు. రైలు కదులుతున్నా కూడా అక్కడే గొడవపడుతూ కూర్చొన్నాడు. అస్సలు మాట వినేవాడు కాదు. ఏదైనా అంటే ‘చదువుకున్న వాడిని’ అనేవాడు.

షూటింగ్‌ సందర్భంగా ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగాయా?

కోట శ్రీనివాసరావు: మా ఇద్దరి కాంబినేషన్‌లో బాగా పేరు తెచ్చిపెట్టిన చిత్రాలు రెండు, మూడున్నాయి. ‘మామగారు’, మరొకటి ‘చినరాయుడు’. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో మా ఇద్దరి మధ్య చివరి సన్నివేశం షూట్‌ చేయాల్సి ఉంది. మరోవైపు బాబూమోహన్‌ ఇంకో చిత్రం కోసం రాజమండ్రి వెళ్లాల్సిన సమయం అవుతోంది. చెరువు గట్టుపై సీన్‌. నేను తన్నగానే బాబూమోహన్‌ కిందపడిపోవాలి. చెరువుకట్ట నుంచి కిందకు 20 అడుగుల లోతు ఉంది. ‘ఈ చెట్టుకి కాయలెన్ని ఉన్నాయో లెక్కపెట్టరా?’ అని నేను ఒక్క తన్ను తన్నాను. అంతే అక్కడి నుంచి దొర్లుకుంటూ కిందకు పడిపోయాడు. ఆ తర్వాత లేచి ‘అన్నయ్యా.. నేను వెళ్తున్నా’ అంటూ అలా వెళ్లిపోయాడు.

బాబూ మోహన్‌: ఆ సన్నివేశంలో పడిపోవాలి. అలా పడిపోగానే నడుచుకుంటూ కారు వరకూ వెళ్లి, ‘అన్నా.. వెళ్లొస్తా’ అని చెప్పి వెళ్లిపోయాను.

కోట శ్రీనివాసరావు: బ్రహ్మానందంతో చాలా చిత్రాలు చేశాను కానీ, కాంబినేషన్‌ తక్కువ. బాబూమోహన్‌తోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి.

ఇంతకీ ఇండస్ట్రీలో మీ ఇద్దరిలో ఎవరు సీనియర్‌?

కోట శ్రీనివాసరావు: నేను అక్టోబర్‌ 11, 1985లో ఇండస్ట్రీలోకి వచ్చాను. నేనెప్పుడూ ఫొటోలు పట్టుకుని స్టూడియోలు చుట్టూ తిరగలేదు. ఎందుకంటే, ఎవరినైనా అవకాశం అడిగితే ‘నీ ముఖం అద్దంలో చూసుకున్నావా’ అంటారేమోనని భయం. అందుకు సినిమా ప్రయత్నాలు చేయలేదు. 1985లో రాజశేఖర్‌ హీరోగా ‘వందేమాతరం’లో ఓ పాత్ర కోసం స్టేజ్‌ ఆర్టిస్ట్‌ను తీసుకుందామని అనుకున్నారు. ముత్యాల సుబ్బయ్యగారు దానికి సహాయ దర్శకుడు. ఆయన ఆయన నా విషయాన్ని టి.కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు నేను వేసిన ఓ నాటకాన్ని వారిద్దరూ చూశారు. అది గుర్తు పెట్టుకుని గాయకుడు రమణారెడ్డి ద్వారా నా చిరునామా సంపాదించారు. అలా టి.కృష్ణగారి చిత్రంతో నేను నటించడం మొదలు పెట్టా.

‘ప్రాణం ఖరీదు’లో నటించారా?

కోట శ్రీనివాసరావు: అవును నటించాను. అయితే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నటన గురించి పట్టించుకోలేదు. ఇక్కడ అందరికీ ఒక విషయం చెబుతాను. ‘మనకి గుమ్మడి కాయంత ప్రతిభ ఉంటే సరిపోదు... ఆవగింజంత అదృష్టం సైతం ఉండాలి’. అలా ఆ రెండూ ఉన్నవాడే కోట.

ఇప్పటివరకూ ఎన్ని చిత్రాల్లో నటించారు?

కోట శ్రీనివాసరావు: 750 చిత్రాలకు పైగా నటించాను. రోజుకు 20 గంటలు పనిచేసేవాడిని. ఒక్కో సారి రోజుకు మూడు రాష్ట్రాల్లో పనిచేసేవాడిని.

బాబూ మోహన్‌: రైలులో టాయ్‌లెట్‌ మగ్గులతో స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి. టికెట్ లేకపోతే పేపర్‌ వేసుకొని టాయ్‌లెట్స్‌ దగ్గర పడుకున్నాం.

చాలా బిజీగా ఉండేవాళ్లు కదా. అలాంటి సమయంలో కుటుంబాన్ని మిస్‌ అవుతున్నామని ఎప్పుడైనా అనిపించిందా?

కోట శ్రీనివాసరావు: నా జీవితంలో పోగొట్టుకున్నవి రెండు. ఒకటి కుటుంబ జీవితం. పిల్లల్ని నెలకో, నెలా పదిహేను రోజులకోసారి చూసేవాళ్లం. అసలు ఆ జీవితం అంటే ఏంటో నేను మర్చిపోయాను. రెండు జనరల్ నాలెడ్జ్‌‌. ఫోన్‌ ఆన్‌ చేయటం, ఆఫ్‌ చేయటం తప్ప నాకు ఇంకేమీ తెలియదు.

బాబూ మోహన్‌: సేమ్ టు సేమ్   

మీ మనవళ్లు ఏం చేస్తున్నారు? కోట శ్రీనివాస్‌ ఏం చేస్తున్నాడు?
కోట శ్రీనివాసరావు: పెద్దవాడు. నా మనవడని కాదు కానీ, వాడు పుట్టినప్పుడే మా అబ్బాయి ‘నీ పేరు పెట్టుకుంటున్నా’ అని చెప్పాడు. పెద్దమ్మాయికి ఇద్దరు కవలలు. ఒకరు మెరైన్‌ ఇంజినీరింగ్, మరొకరు ఎరోనాటిక్స్‌ చదువుతున్నారు. 

ఇండస్ట్రీలో మీతో మాట్లాడాలంటే కౌంటర్‌ల మీద కౌంటర్లు వేస్తారని టాక్‌. ఎందుకొచ్చింది ఆ పేరు?

కోట శ్రీనివాసరావు: ‘ఇద్దరూ ఇద్దరే’ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి ‘ఏమయ్యా నీ గురించి చాలా విన్నాను. ఈ చిత్రం గురించి నీ కామెంట్ ఏంటి’. అని అడిగారు. ‘ఏముంది లేండి. ‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రానికి నిద్దరే నిద్దరండి’ అని అన్నాను. చాల్లేదు నీ లెవల్‌కి అని అన్నారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునల మధ్య ఓ సీన్‌ ఉంటుంది. నాగార్జున తాగి వస్తే, నాగేశ్వరరావుగారు క్లాస్‌ తీసుకుంటూ ఉంటారు. ‘వాళ్లిద్దరూ ఏదో కుటుంబ విషయలు మాట్లాడుకుంటున్నారు. మనం వినడం బాగుండదని జనాలు థియేటర్‌ నుంచి వెళ్లిపోతున్నారండీ’ అన్నాను. ‘నీ దుంపతెగ, పెద్ద జోక్‌ వేశావు కదా’ అని అన్నారు. అప్పట్లో మా మధ్య సంభాషణలు అలా ఉండేవి. కానీ, యువతరానికి నేను చెప్పేది ఒకటే. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనేది అందరికీ తెలిసిందే. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే ‘గోల్డ్‌ ఓల్డ్‌గా ఎన్నటికీ మారదు’ అంటే ‘బంగారాన్ని కాల్చిన కొద్దీ మెరుగులు దిద్దుకుంటుంది’

అన్నా... నీ ఎంట్రీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏర్పడింది?

బాబూ మోహన్‌: ‘ఈ ప్రశ్నకు బదులేది’, ఆ తర్వాత ‘ఆహుతి’, ‘అంకుశం’ చిత్రాల ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాను. వారం రోజుల్లో పది సినిమాలకు బుక్కయ్యాను. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

మీ ఇద్దరి కాంబినేషన్‌ చాలా సక్సెస్‌ అయింది కానీ మీరెప్పుడూ రెమ్యూనరేషన్‌ పెంచాలని అనుకోలేదా?

కోట శ్రీనివాసరావు: చాలా సార్లు అనుకున్నాం. అప్పట్లో చాలా డిమాండ్ ఉండేది. అయితే, వాళ్లు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాళ్లం. డబ్బు కన్నా అభిమానం ముఖ్యమని భావించేవాళ్లు. కొన్నిసార్లు మా దగ్గరకే వచ్చి షూటింగ్‌ చేసుకుని వెళ్లేవారంటే, మేమంత బిజీగా ఉండేవాళ్లమో అర్థం చేసుకోవచ్చు.

బాబాయి.. ఎన్ని భాషల్లో నటించారు?

కోట శ్రీనివాసరావు: ఐదు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ. మొదట్లో కష్టంగా ఉండేది. ఆ తర్వాత నేర్చుకున్నాను. తమిళంలో 42 చిత్రాలు చేశాను.

తినేందుకు కూడా సమయం లేని పరిస్థితి నుంచి ఒక్కసారిగా సినిమాలు తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి?

బాబూ మోహన్‌: ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేశాను. మంత్రిగా ఉన్నప్పుడు చేయకూడదు. కేబినెట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికీ చంద్రబాబునాయుడు గారిని అడిగాను. కానీ, ఆయన అంగీకరించలేదు. ‘కామెడీ చేసుకునేవాడికి కేబినెట్‌ ఇచ్చారంటూ నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోవద్దు’ అని సూచించారు. ఈ విషయాన్ని కొంత మంది ‘బాబు మోహన్‌ సినిమాలు చేయట్లేదు. మానేశాడు’ అని ప్రచారం చేశారు. ఇక అలా సినిమాలు తగ్గిపోయాయి. ఇటీవల రెండు, మూడు సినిమాలు ఒప్పుకొన్నా, కానీ, కరోనా కారణంగా ప్రస్తుతం అవి వాయిదా పడ్డాయి. ఇక్కడ నీకో(ఆలీ) విషయం చెప్పాలి. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారిని నువ్వు చాలా బాగా ఇంటర్వ్యూ చేశావు. నేను కన్నార్పకుండా చూశా. అది నీకు దక్కిన అదృష్టం.

కోట శ్రీనివాసరావు: బాలుగారి గురించి ఒక్క మాట చెబుతా. ఆయన పాట ఎలా ఉన్నా. ఆయన మంచి మాటలు మాట్లాడేవారు. 20ఏళ్లకు పైగా ‘పాడుతా తీయగా’ నడపటం ఆయన వల్లే సాధ్యమైంది.

మీ కలర్‌ మీకు ప్లస్సా? మైనస్సా?
బాబూ మోహన్‌: ప్లస్సే.

మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, ‘నన్ను కోట గారు చాలా ఏడిపిస్తున్నారండి. మీరు ఎలాగైనా ఆయనకు వార్నింగ్‌ ఇవ్వాలి’ అని పెద్ద హీరోయిన్‌కి కంప్లెయింట్‌ చేశారంట? ఎవరు ఆ హీరోయిన్‌?
బాబూ మోహన్‌: వాణిశ్రీ గారు.
కోట శ్రీనివాసరావు: ఆమెకు కోపం ఎక్కువ. మా ఇంటికి వచ్చేది. చాలా సార్లు భోజనం చేసింది.

మీ ఇద్దరి జీవితంలో ఓ చేదు సంఘటన!

కోట శ్రీనివాసరావు: మా ఇద్దరి జీవితంలో ఒక సారూప్యత ఉంది. అది ఎక్కువ తలచుకుంటే బాగుండదు. మా ఇద్దరికీ అబ్బాయి చనిపోయాడు. బాబూమోహన్‌కు చిన్న అదృష్టం ఏంటంటే, తనకు ఇంకో కొడుకు ఉన్నాడు. నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు.(కన్నీళ్లు)
బాబూ మోహన్‌: మా ఇద్దరు పిల్లలు సేమ్ టు సేమ్ యాక్సిడెంట్‌లో మరణించారు. ‘ఇంత మందిని నవ్వించినందుకా మాకీ శిక్ష’ అని చాలా రోజులు ఏడుస్తూనే ఉన్నాం. 

ఎవరికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నారు? ఏ దర్శకులకు, నిర్మాతలకు చెప్పాలనుకుంటున్నారు?

కోట శ్రీనివాసరావు: చాలా మంది మహానుభావులు నాకు మంచి పాత్రల్లో నటించేందుకు అవకాశమిచ్చారు. ఈవీవీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు చెబుతా. ఎక్కువ సినిమాలు, విభిన్న పాత్రలు ఇచ్చారు.

బాబూ మోహన్‌: చాలా మంది ఉన్నారు. కోడి రామకృష్ణ, ఈవీవీ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణ, బి.గోపాల్ గార్లకు ధన్యవాదాలు చెబుతున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని