Updated : 31 Jan 2020 12:56 IST

రివ్యూ: అశ్వథ్థామ‌

చిత్రం: అశ్వథ్థామ
న‌టీన‌టులు: నాగశౌర్య, మెహరీన్, స‌త్య‌, పోసాని కృష్ణముర‌ళి, ప్రిన్స్‌, జిషు సేన్ గుప్తా, హ‌రీష్ ఉత్తమ‌న్‌, కాశీ విశ్వనాథ్‌, స‌ర్గున్ కౌర్ త‌దిత‌రులు.
ఛాయాగ్రహ‌ణం: మనోజ్‌ రెడ్డి 
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
సంభాష‌ణ‌లు: పరుశురాం శ్రీనివాస్
కథ: నాగశౌర్య 
నిర్మాత: ఉషా ముల్పూరి 
దర్శకత్వం: రమణ తేజ
సంస్థ‌: ఐరా క్రియేష‌న్స్‌
విడుద‌ల‌: 31 జ‌న‌వ‌రి 2020

నాగ‌శౌర్య చేసిన తొలి థ్రిల్లర్ చిత్రం ‘అశ్వథ్థామ‌’. ఈ క‌థ‌ని రాసింది కూడా ఆయ‌నే. సొంత క‌థ‌, సొంత నిర్మాణ సంస్థ‌, తొలి థ్రిల్లర్ చిత్రం.. ఇలా చాలా ప్రత్యేక‌త‌ల‌తో కూడిన ఈ సినిమాపై నాగ‌శౌర్య చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. గ‌త చిత్రం ‘న‌ర్తన‌శాల’ ప‌రాజయం చ‌విచూడ‌టంతో, ఈసారి విజ‌యం కోసం సొంత క‌థ‌నే న‌మ్ముకున్నారు. ప్రచార చిత్రాలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? నాగ‌శౌర్యకి విజ‌యం అందిన‌ట్టేనా? తెలుసుకునే ముందు ఈ చిత్రం క‌థేంటో చూద్దాం..

క‌థేంటంటే?: గ‌ణ (నాగ‌శౌర్య‌)కి త‌న చెల్లెలు ప్రియ (స‌ర్గున్ కౌర్‌) అంటే ప్రాణం. చెల్లెలి నిశ్చితార్థం కోసమ‌ని అమెరికా నుంచి వ‌స్తాడు. ఇళ్లంతా ఆనందోత్సాహాల మ‌ధ్యనున్న ఆ స‌మ‌యంలోనే ప్రియ ఆత్మహ‌త్యకు ప్రయత్నిస్తుంది. కార‌ణ‌మేంట‌ని ఆరా తీస్తే తాను గ‌ర్భవ‌తిన‌ని చెబుతుంది. అలాగ‌ని ఆమెకి ప్రేమ వ్యవ‌హారాలేమీ ఉండ‌వు. మ‌రి ప్రియ ఎలా గ‌ర్భవ‌తి అయ్యింది? ఈ విష‌యాన్నే ఆరా తీస్తున్న క్రమంలో మ‌రో అమ్మాయి ప్రియ‌లాంటి కార‌ణంతోనే చ‌నిపోతుంది. దాంతో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని, దీని వెన‌క కార‌కులెవ‌రో ప‌సిగ‌ట్టాల‌ని రంగంలోకి దిగుతాడు గ‌ణ‌. ఈ క్రమంలో ఎలాంటి అతడికి విష‌యాలు తెలిశాయి? నేర‌స్థుల్ని గ‌ణ ఎలా మ‌ట్టుబెట్టాడు? త‌దిత‌ర విషయాల్ని తెర‌పై చూడాల్సిందే!

ఎలా ఉందంటే?: నేర నేప‌థ్యంతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రమిది. ఒళ్లు గ‌గుర్పొడిచే చీక‌టి కోణం, అంతుచిక్కని రీతిలో వ్యవ‌హ‌రించే పాత్రలు, అడుగ‌డుగునా మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. అయితే ఇందులో సైకో పాత్ర చేసే హంగామా మాత్రం స‌గ‌టు ప్రేక్షకుడికి ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌దు. దాన్ని భ‌రిస్తే మాత్రం ఈ సినిమాతో మంచి థ్రిల్‌ని ఆస్వాదించొచ్చు. ట్రైల‌ర్‌లో వినిపించిన‌ట్టుగానే.. ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక పాత్ర‌.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న అస‌లు సూత్రధారి చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. ఆ సూత్రధారి కోసం క‌థానాయ‌కుడు చేసే ప‌రిశోధ‌న, అత‌న్ని వెంటాడే తీరు మెప్పిస్తుంది. ఆరంభంలో కుటుంబ నేప‌థ్యం ఆక‌ట్టుకుంటుంది. అన్నాచెల్లెళ్ల మ‌ధ్య బంధాన్ని చ‌క్కగా ఆవిష్కరిస్తుంది.

ఎప్పుడైతే కథానాయ‌కుడు ప‌రిశోధ‌న మొద‌లుపెడ‌తాడో అప్పట్నుంచి క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌గా మారిపోతుంది. త‌న చెల్లెలి వెంటపడ్డార‌నే కార‌ణంతో, వాళ్లే ఇందుకు కారకుల‌ని భావిస్తూ క‌థానాయ‌కుడు ఆరంభంలో చేసే హంగామా, అక్కడ యాక్షన్ ఘ‌ట్టాలు కాస్త శ్రుతిమించినట్టుగా అనిపిస్తాయి. ఆ త‌ర్వాత క‌థానాయ‌కుడు ఒకొక్క ఆధారాన్ని వెతుక్కుంటూ సూత్రధారిని క‌నుక్కునే తీరు మాత్రం మెప్పిస్తుంది. అంబులెన్స్‌ల్ని ఛేజ్ చేసే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రథ‌మార్థం వ‌ర‌కు సినిమా మంచి టెంపోతో సాగుతుంది. ద్వితీయార్థంలోనే కొన్ని లోపాలు క‌నిపిస్తాయి. అస‌లు సూత్రధారి అయిన సైకో చేసే హంగామా, ఆ నేప‌థ్యంలో వ‌చ్చే హింసాత్మక స‌న్నివేశాలు గ‌గుర్పాటుకి గురిచేసినా.. అత‌ని కోసం క‌థానాయ‌కుడు కొన‌సాగించే వేట మెప్పిస్తుంది. సైకో ఫ్లాష్‌బ్యాక్ కూడా థ్రిల్‌ని పంచుతుంది. వంద మంది రాక్షసుల‌తో స‌మాన‌మైన ప్రతినాయ‌కుడిని ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడు సుల‌భంగా అంతం చేయడంతో ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ సాదాసీదాగా ముగిసిన‌ట్టు అనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టప‌డే ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది.

ఎవ‌రెలా చేశారంటే: లవర్ బాయ్ పాత్రల‌తో మెరిసిన నాగ‌శౌర్య ఈసారి భిన్నంగా ప్రయ‌త్నించాడు. యాక్షన్ ఘ‌ట్టాల్లోనూ, భావోద్వేగాలు పండించ‌డంలోనూ మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచాడు. క‌థా ర‌చ‌యిత‌గానూ ఆయ‌న విజ‌య‌వంత‌మ‌య్యారు. ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించేలా ఈ కథ‌ని అల్లిన విధానం మెచ్చుకోత‌గ్గదే. సైకోగా ప్రతినాయ‌కుడి పాత్రలో  జిసుసేన్ గుప్తా క‌నిపిస్తాడు. ఆయ‌న పాత్రలో ఒదిగిపోయారు. జాల‌ర్లని చంపే స‌న్నివేశంలో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. నాగశౌర్య సోద‌రిగా న‌టించిన స‌ర్గున్ కూడా మెప్పిస్తుంది. మెహ‌రీన్ క‌థానాయ‌కుడి ప్రేయ‌సిగా క‌నిపిస్తుంది. ఆమె పాత్ర ప‌రిధి ప‌రిమిత‌మే. ప్రిన్స్‌, పోసాని, స‌త్య త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా కొన్ని విభాగాలు మాత్రమే మెరిశాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల బాణీలు, జిబ్రాన్ నేప‌థ్య సంగీతం ఫర్వాలేద‌నిపిస్తుంది. ద‌ర్శకుడి ప‌నిత‌నం కొన్ని స‌న్నివేశాల్లో మాత్రమే క‌నిపిస్తుంది. యాక్షన్ ఘ‌ట్టాలు, నిర్మాణంలో నాణ్యత మెచ్చుకోద‌గ్గ స్థాయిలో ఉన్నాయి.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
క‌థ - ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు
నాగ‌శౌర్య న‌ట‌న‌  
యాక్షన్ ఘ‌ట్టాలు  

చివ‌రిగా: హింస ఎక్కువైనా ‘అశ్వథ్థామ’ థ్రిల్‌ని పంచుతాడు

గమనిక: ఇది సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని