మళ్లీ తెరపై బాహుబలి

రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి చిత్రాన్ని వెండితెరపై చూసే అవకాశం మరోసారి కలుగనుంది.

Published : 05 Nov 2020 00:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్‌ నటన యావత్‌ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రాన్ని వెండితెరపై చూసే అవకాశం మరోసారి కలుగనుంది. ప్రముఖ బాలీవుడ్‌ విశ్లేషకుడు తరన్‌ ఆదర్శ్‌ ఈ సంగతిని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ఈ శుక్రవారం (నవంబర్‌ 6), రెండో భాగం ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ ఆపై శుక్రవారం (నవంబర్‌ 13) విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌ను ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలకు ఆయన ట్యాగ్‌ చేశారు.  

బాహుబలి తొలిభాగం 2015లో, రెండోది 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రాలు భారతీయ సినీ చరిత్రలోనే రికార్డు సృష్టించాయి. శివగామిగా రమ్యకృష్ణ అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు  పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌లు, మాహిష్మతి రాజ్యం సెట్‌ ఈ చిత్రాలకు అమిత ఆదరణ సంపాదించిపెట్టాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు