Bheemla nayak: చాలా ప్రయోగాలు చేశాం

‘‘ధృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని  వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. ‘అయ్యప్పానుమ్‌ కోషియుమ్‌’ అలాంటి కథే. కాబట్టి ఆ మాతృక ప్రేమ నుంచి బయటకొచ్చి ‘భీమ్లానాయక్‌’ను చేయడానికి చాలా ప్రయోగాలు చేశామ’’న్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది.

Updated : 27 Feb 2022 08:39 IST

త్రివిక్రమ్‌

‘‘ధృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని  వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. ‘అయ్యప్పానుమ్‌ కోషియుమ్‌’ అలాంటి కథే. కాబట్టి ఆ మాతృక ప్రేమ నుంచి బయటకొచ్చి ‘భీమ్లానాయక్‌’ను చేయడానికి చాలా ప్రయోగాలు చేశామ’’న్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. సాగర్‌ కె.చంద్ర తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రానా మరో హీరో. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పారు. దాన్ని భీమ్లానాయక్‌ కోణం నుంచి   ఎలా చెప్పాలన్నదే.. మాకెదురైన తొలి సవాల్‌. అడవికి సెల్యూట్‌ చేస్తూ భీమ్లా పాత్రను పరిచయం చేస్తే సరైన జస్టిఫికేషన్‌ దొరుకుతుందనిపించింది.   పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు కృత్రిమంగా ఉండకూడదు. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్‌ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్‌ చేయడానికే మేం ఎక్కువ కష్టపడ్డాం. అభిమానులు మెచ్చేలా పవన్‌ని తెరపై చూపించడానికి సాగర్‌ బాగా శ్రమించారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ పవన్‌, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పని చేశారు. సినిమాకి మంచి టీమ్‌ కుదిరింది. చిన్న చిన్న పాత్రలకీ పేరొచ్చింది. ఇప్పటితరం నటులకు సినిమాపై ఉన్న ప్రేమ, ప్రతి విషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నా. సాగర్‌ ఆలోచనతోనే టైటిల్‌ పాటను మొగిలయ్యతో పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం ఎంతో ఆనందం కలిగించింది. తమన్‌ ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు. అందుకే అంత గొప్పగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పుడుతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం తొలిసారి త్రివిక్రమ్‌ని కలిసినప్పుడు ‘ఇది రీమేక్‌ అనే విషయం మర్చిపోయి.. మన చిత్ర రీమేక్‌ రైట్స్‌ వేరే వాళ్లు కొనాలి అనేట్లు చేద్దాం సాగర్‌’ అన్నారు. ఈ సినిమా   విషయంలో ఆయన హారానికి దారంలా పనిచేశారు. కథను అర్థం చేసుకుని.. దానికి తగ్గ సంగీతాన్ని అందించారు తమన్‌. ఈ చిత్ర సక్సెస్‌ రీ సౌండ్‌కు కారణం త్రివిక్రమ్‌ ఆలోచనే. వసూళ్లు చూశాక చాలా ఆనందంగా ఉంద’’న్నారు దర్శకుడు సాగర్‌ కె.చంద్ర. తమన్‌ మాట్లాడుతూ.. ‘‘పవన్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో పని చేయాలన్నది నా కల. అదింత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఈ సినిమా ఓ కార్చిచ్చు లాంటిది. ఈ మంటని ఆపడం చాలా కష్టం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, సంయుక్త మేనన్‌, గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, నటి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని