‘రైతులు.. ఆహారాన్ని అందించే సైనికులు’

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గత కొన్నిరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ పలు రాజకీయ పార్టీలు మంగళవారం భారత్‌....

Updated : 07 Dec 2020 15:15 IST

అన్నదాతల నిరసనకు బీటౌన్‌ సెలబ్రిటీల మద్దతు

ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గత కొన్నిరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ పలు రాజకీయ పార్టీలు మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు అన్నదాతల నిరసన పట్ల బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చీలింది.

నటి కంగనా రనౌత్‌, వివేక్‌ అగ్నిహోత్ర.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుండగా.. దిల్జిజ్‌, ప్రీతీ జింటా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, రిచా చద్దా, హన్సల్‌ మెహ్తా, అనుభవ్‌ సిన్హా, తదితరులు రైతుల తరఫున తమ గళాన్ని వినిపిస్తున్నారు. పంజాబీ సింగర్‌ దిల్జిత్‌ ఆదివారం దిల్లీ సరిహద్దులకు చేరుకుని రైతులతోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఎముకలు కొరికే చలిలోనూ నిరసనలో పాల్గొంటున్న అన్నదాతలకు దుస్తులు కొనుగోలు చేయడం కోసం రూ.కోటి విరాళంగా అందించారు. మరోవైపు అన్నదాతల నిరసనకు సంఘీభావం తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు.

‘మన దేశానికి ఆహారాన్ని అందించే సైనికులే ఈ అన్నదాతలు. వారి భయాలు తొలగిపోవాలి.. ఆశలు చిగురించాలి. ప్రజాస్వామ్య దేశంగా పేరుపొందిన మన దేశంలో వారి కష్టాలకు త్వరితగతిన చరమగీతం పాడాలి.’ -ప్రియాంకా చోప్రా

‘మనం ఈరోజు కడుపునిండా భోజనం తింటున్నామంటే దానికి కారణం అన్నదాతలు. కాబట్టి వాళ్లకి కృతజ్ఞతలు తెలుపుదాం. మన దేశంలో ఉన్న ప్రతి రైతుకూ నా సంఘీభావం తెలుపుతున్నా. జై కిసాన్‌’ -రితేశ్‌ దేశ్‌ముఖ్‌

‘అన్నదాతలు చేస్తున్న నిరసన గురించి పూర్తిగా తెలియని కొంతమంది.. వారి ఆందోళనలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో గత రెండు దశబ్దాలుగా రైతన్నలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా 12000 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే రోజుకు దాదాపు 30 మంది. మనం ప్రతిరోజూ ఎవరివల్ల అయితే భోజనం తింటున్నామో ఆ రైతులు చేస్తున్న అతి పెద్ద పోరాటం ఇది’ -రిచా చద్దా

‘కరోనా, ఎముకలు కొరికే చలి.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ పోరాటం చేస్తున్న రైతన్నలకు, వారి కుటుంబాలకు నా సంఘీభావం తెలుపుతున్నాను. మన దేశం ముందుకు సాగేవిధంగా పని చేస్తున్న నేల తల్లి సైనికులు వాళ్లు. ప్రభుత్వం-రైతుల మధ్య చర్చలు సానుకూలమైన ఫలితాలను అందిస్తాయని ఆశిస్తున్నాను.’ -ప్రీతీ జింటా

ఇవీ చదవండి

రైతన్నలకు కోటి విరాళమిచ్చిన గాయకుడు

డిలీట్‌ చేసిన ట్వీట్‌ వివాదాల్లోకి లాగింది..!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని