
ట్రెండింగ్‌లో ‘బుర్జ్ ఖలీఫా’..!
ఆకట్టుకుంటోన్న అక్షయ్-కియారా డ్యాన్స్
ముంబయి: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘లక్ష్మిబాంబ్’. కియారా అడ్వాణీ కథానాయిక. ‘కాంచనా’ చిత్రానికి రీమేక్‌గా రానున్న ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించింది. ట్రైలర్లో అక్షయ్ నటన చూసి ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు.
దీపావళి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ‘లక్ష్మిబాంబ్’ నుంచి మొదటి వీడియో సాంగ్‌ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ‘బుర్జ్ ఖలీఫా’ అంటూ సాగే ఈ పాటలో అక్షయ్-కియారా డ్యాన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో దూసుకెళ్తోంది. నవంబర్ 9న డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ వేదికగా ‘లక్ష్మిబాంబ్’ విడుదల కానుంది.