ఆర్జీవీ..దీనికి ఎవరు బాధ్యులు?:దిశ తండ్రి

‘దిశ’ అత్యాచార ఘటన నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీయడాన్ని ఆమె తండ్రి ఖండించారు. సినిమా చిత్రీకరణ, విడుదల ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ...

Updated : 10 Oct 2020 15:45 IST

కుమార్తెను కోల్పోయిన బాధలో మేముంటే..

హైదరాబాద్‌: ‘దిశ’ అత్యాచార ఘటన నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీయడాన్ని ఆమె తండ్రి ఖండించారు. సినిమా చిత్రీకరణ, విడుదల ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రామ్‌గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని చైతన్యపర్చేందుకు సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్‌ వర్మ అంటున్నారని.. కానీ తమకు జరిగిన అన్యాయం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఆయన డబ్బుల కోసమే ఈ సినిమా తీస్తున్నారని పేర్కొన్నారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ట్రైలర్‌పై వస్తున్న కామెంట్లు బాధపెడుతున్నాయని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని దిశ తండ్రి వర్మను ప్రశ్నించారు.

సుప్రీం కోర్టు, హైకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా వర్మ సినిమా తీయడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అభ్యంతరాలను సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయాలని దిశ తండ్రికి హైకోర్టు సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ చిత్రం ఇంకా సెన్సార్‌ బోర్డు దృష్టికి రాలేదని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

‘దిశ’ ఘటనపై వర్మ ‘దిశ’ టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. యువతి హత్య జరిగిన రోజున (నవంబరు 26న) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం చట్టాల్ని మార్చడమే కాకుండా, బాధితురాలి పేరుతో ‘దిశ’ పోలీసుస్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వర్మ ఇటీవల అన్నారు. దిశ తండ్రి ఫిర్యాదుపై వర్మ స్పందించాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని