15 నిమిషాల్లో నేర్చుకుని.. 10 నిమిషాల్లో పాడి..!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడటంతో భారత చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు సోషల్‌మీడియాలో మాట్లాడుతున్నారు. బాలు మరణంతో తన గుండె పగిలిందని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.....

Published : 27 Sep 2020 01:40 IST

బాలు జ్ఞాపకాల్లో.. వీడియో షేర్‌ చేసిన రెహమాన్‌

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడటంతో భారత చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు సోషల్‌మీడియాలో మాట్లాడుతున్నారు. బాలు మరణంతో తన గుండె పగిలిందని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయనతో కలిసి పంచుకున్న మధుర సంఘటనల్ని తెలుపుతూ.. ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ‘ఎస్పీబీ జీవితాన్ని సెలబ్రేట్‌ చేద్దాం..’ అని పేర్కొన్నారు.

‘చాలా ఏళ్ల క్రితం సుహాసిని మణిరత్నం.. ఎస్పీబీ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. అందులో నేను ప్రదర్శన ఇచ్చా. నేను అప్పుడప్పుడే కెరీర్‌ ఆరంభిస్తున్న రోజులవి. ఆ తర్వాత ‘రోజా’ సినిమా కోసం సంగీత దర్శకుడిగా పనిచేశా. ఈ చిత్రంలోని పాట రికార్డింగ్‌ కోసం బాలు సర్‌ స్టూడియో దగ్గరికి వచ్చారు. అక్కడి వాతావరణం చూసి.. ఇక్కడ మ్యూజిక్‌ రికార్డింగ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. నేను నవ్వాను.. ఆపై ‘రోజా’ సినిమా విడుదల తర్వాత సర్‌ నా దగ్గరికి వచ్చి, సంగీతాన్ని ఎక్కడైనా సృష్టించొచ్చు అన్నారు’.

‘బాలు సర్‌ 15 నిమిషాల్లోనే పాటను నేర్చుకునేవారు. పది నిమిషాల్లో పాడేసేవారు. వెంటనే మరో రికార్డింగ్‌లోకి వెళ్లిపోయేవారు. ఇంత వేగంగా పాటలు పాడే గాయకుడ్ని, వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిని మళ్లీ చూడలేనేమో.. ఇప్పుడు మనమంతా కలిసి ఆయన సంగీతాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎస్పీబీ సర్‌.. మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. కానీ మిమ్మల్ని కోల్పోయామని మాత్రం చెప్పను’ అని రెహమాన్‌ వీడియోలో అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని