అమ్మ చీరలో తారలు.. వివాహంలో తళుకులు

అమ్మానాన్న.. ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ వెంటాడే ఓ ఏమోషన్‌. అమ్మలా ఓపికగా ఉండాలి.. నాన్నలా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల నుంచి ఇలాగే స్ఫూర్తి పొందుతారు. చిన్నప్పుడు అమ్మ చీరను కట్టుకుని

Updated : 07 Dec 2020 18:42 IST

చిన్నప్పుడు అమ్మ చీరను కట్టుకుని ముస్తాబవడం, నాన్న చొక్కాను వేసుకొని ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే భలే సరదాగా ఉంటుంది. పెద్దయ్యాక కూడా వివిధ సందర్భాల్లో తల్లిదండ్రుల అపురూప వస్తువులను పిల్లలు వాడుతుంటారు. అలా ఇటీవల కొందరు సెలబ్రిటీలు వివాహం, ప్రత్యేక సందర్భాల్లో తమ తల్లి ధరించిన దుస్తులను, ఆభరణాలను ధరించి అలరించారు. ఇటీవల నిహారిక తన తల్లి చీరను ధరించడం ఆకట్టుకుంది. ఇలా ఆకట్టుకున్న సెలబ్రిటీలు ఎవరో చూద్దామా!

* మెగా డాటర్‌ నిహారిక-చైతన్య వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నిహారిక తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీరలో మెరిశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా భాగంగా తన తల్లి అప్పట్లో కట్టుకున్న పట్టుచీరకు మెరుగులు అద్ది తాజాగా ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

భారతీయ చలన చిత్ర పరిశ్రమపై అలనాటి తార శ్రీదేవి చెరగని ముద్రవేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె 2018లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘మామ్‌’లో నటనకు గానూ ఆమె ‘ఉత్తమ నటి’గా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే, అప్పటికే ఆమె కన్నుమూయడంతో తన తల్లి తరపున జాన్వీ కపూర్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె శ్రీదేవి చీరను ధరించి అవార్డు అందుకోవడం విశేషం. ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర స్వల్ప మార్పులతో సరికొత్తగా ఆ చీరను తీర్చిదిద్దారు. అప్పట్లో జాన్వీ ధరించిన ఆ చీర ఎంతగానో ఆకట్టుకుంది.

ఒకప్పుడు యువతను తన అందాలతో కట్టిపడేసిన బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌.. ఆ తర్వాత నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని పటౌడీ కుటుంబంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 1962లో తన అత్త షర్మిలా ఠాగూర్‌ ధరించిన గాగ్రాను ధరించి పెళ్లికుమార్తెగా ముస్తాబయ్యారు. గోల్డ్‌ ఎంబ్రయిడరీ చేసిన ఆ చీరను డిజైనర్‌ రీతూ కుమార్‌ సరికొత్త తీర్చిదిద్దారు.

బాలీవుడ్‌ను దాటి ప్రస్తుతం హాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్న నటి ప్రియాంక చోప్రా. నిక్‌ జోనస్‌తో వివాహం తర్వాత ఆమె అక్కడే స్థిరపడిపోయారు. ప్రియాంక-నిక్‌ల వివాహం ఇటు భారతీయ సంప్రదాయంతో పాటు, అటు క్రైస్తవ సంప్రదాయంలోనూ జరిగింది. క్రైస్తవ వివాహ పద్ధతిలో జరిగిన వేడుకకు ప్రియాంక ఒక ప్రత్యేకమైన గౌను ధరించారు. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ  గౌనుకు ఒక ప్రత్యేకత ఉంది. నిక్‌ తల్లి వివాహం సందర్భంగా ధరించిన గౌనులోని కొంత భాగాన్ని తీసుకుని ప్రియాంక గౌనును తయారు చేయడం విశేషం. అంతే కాదండోయ్‌ దీని పొడవు ఏకంగా 75 అడుగులు.

చాలా మంది సెలబ్రిటీలు తమ తల్లులు ధరించిన దుస్తులను రీడిజైన్‌ చేయించుకుంటే, అనిల్‌ కపూర్‌ తనయ, బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ మరో అడుగు ముందుకు వేశారు. తన తల్లి వివాహం సందర్భంగా ధరించిన నగలను ఆమె ధరించారు. సోనమ్‌ ధరించిన ప్రతి నగ తన తల్లి సునీతా కపూర్‌దే కావడం విశేషం. అంతేకాదు, దుస్తుల్లో కూడా స్వల్ప మార్పులు చేసి వాటినే ధరించారు.

సినిమా తారలే కాదు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీల కుమార్తె అయిన ఇషా అంబానీ ఇదే బాటలో పయనించారు. తన తల్లి వివాహం సందర్భంగా ధరించిన చీరకు నేటి ఆధునిక హంగులను అద్ది తన వివాహంలో తళుక్కున మెరిశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని