6 నెలలు..3 వేల పాటలు..రూ.85 లక్షలు!

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో గొంతెత్తి మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ లైంగిక వేధింపుల గురించి తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కాగా ఆమె లాక్‌డౌన్‌ కాలాన్ని నలుగురి సంక్షేమం కోసం కేటాయించారు. గత ఆరు నెలల్లో దాదాపు 3 వేల ఆడియోలు ....

Published : 16 Sep 2020 15:19 IST

విరాళం సేకరించిన చిన్మయి
డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..

హైదరాబాద్‌: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో గొంతెత్తి మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ లైంగిక వేధింపుల గురించి తరచూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కాగా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్‌డౌన్ సమయాన్ని ఆమె కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కేటాయించారు. గత ఆరు నెలల్లో దాదాపు 3వేల ఆడియోలు రికార్డు చేశారు. వీటిని శ్రోతలకు షేర్‌ చేసి.. రూ.85 లక్షల విరాళం సేకరించారు. ‘గత కొన్ని రోజులుగా ప్రజల కోరిక మేరకు.. నేను వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేయడం, శుభాకాంక్షలు చెప్పడం.. చేస్తున్నా. ఇప్పటివరకు 3 వేల వీడియోలు పంపా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది దాతలు డబ్బును నేరుగా అవసరాల్లో ఉన్న వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇప్పటివరకు రూ.85 లక్షల విరాళం సేకరించా. ఇలాంటి క్లిష్టసమయంలో నిత్యావసర సరకులు కూడా కొనలేని స్థితిలో ఉన్న వారి కోసం, ఫీజులు కట్టలేని వారి కోసం.. ఈ కార్యక్రమాన్ని నేను ఇలానే కొనసాగించాలనుకుంటున్నా’ అని తెలిపారు. 

‘‘ఏ మాయ చేసావె’లో జెస్సీలా హలో చెప్పమని, అలా మాట్లాడండని.. గత పదేళ్లుగా చాలా మంది నన్ను అడిగారు. కానీ ఆ అవకాశాన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని అప్పుడు నాకు తెలియలేదు. మొత్తానికి విభిన్నమైన వ్యక్తుల కోసం ఇలా చేయడం ఫన్‌గా ఉంది. ఏ రోజూ ఇంత మొత్తం విరాళంగా ఇవ్వండని మేం అడగలేదు. ఓ ఎన్నారై 20 కుటుంబాలకు రూ.1.5 లక్షలు విరాళం ఇచ్చారు, ఓ విద్యార్థి రూ.27 విరాళంగా ఇచ్చాడు. రకరకాల వ్యక్తులు ఈ మంచి పనిలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎంతో దయ ఉంది. ఇది మానవత్వం ఇంకా ఉందనే నా నమ్మకాన్ని రెట్టింపు చేసింది’ అని చిన్మయి అన్నారు. ఆమె మంచితనాన్ని నటి సమంత సోషల్‌ మీడియా వేదికగా మెచ్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని