Chiranjeevi: శుభం కార్డు పడినట్లే.. ఈ నెలాఖరుకు జీవో వస్తుందని భావిస్తున్నాం: చిరంజీవి

సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.

Updated : 10 Feb 2022 16:29 IST

అమరావతి: సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.


సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అటు సామాన్య ప్రజలకు, ఇటు ఇండస్ట్రీ వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గతంలో నేను చర్చించిన అంశాల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం మట్లాడారు. అందరికీ లాభదాయకంగా ఉండేలా ఆయన తీసుకున్న నిర్ణయం సంతోషపరిచింది. పరిశ్రమ చక్కగా ఉండాలంటే చిన్న సినిమా నిర్మాతలు, దర్శకులు బాగుండాలి. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరగా.. సీఎం ఆమోదం చెప్పారు. ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్‌ చిత్రాలకు ప్రత్యేకించి వెసులుబాటు కోరగా.. దానిపై మరోసారి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తెలంగాణలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందిన విధంగా ఏపీలోనూ సినిమా వృద్ధి చెందాలని ముఖ్యమంత్రి  అన్నారు. అందుకు కావాల్సిన ప్రోత్సహాన్ని అందిస్తానని కూడా చెప్పారు. వైజాగ్‌ని సినిమా షూటింగ్స్‌కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అందుకు మేము సైతం మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. ఈ చర్చల విషయంలో ముందు నుంచి మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. నాని చొరవ వలనే ఈ సమస్యకు త్వరితగతిన శుభం కార్డు పడిందనుకుంటున్నా. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈ నెల మూడో వారంలోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉంది

- చిరంజీవి


సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,  చర్చలు నిర్వహించేలా చొరవ తీసుకున్నందుకు చిరంజీవికి ధన్యవాదాలు. గత ఆరు నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ అయోమయ వాతావరణంలో ఉంది. ఈ రోజుతో పెద్ద రిలీఫ్‌ వచ్చింది. పేర్ని నాని, సీఎం జగన్‌కు ధన్యవాదాలు. వారం, పది రోజుల్లో గుడ్‌ న్యూస్ వింటాం

- మహేశ్‌బాబు


సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలపై జగన్‌కు ఉన్న చొరవ చూసి ఆనందం కలిగింది. మా ప్రతిపాదనలన్నీ విని మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే చిరంజీవికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే ఆయనకు నచ్చదు కానీ, చేసే పనుల వల్ల ఆయన పెద్దరికం తెలుస్తోంది. సీఎంతో తనకున్న సాన్నిహిత్యంతో చిరు ఈ చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ వృద్ధి కోసం శ్రమించారు

- రాజమౌళి


తెలుగు రాష్ట్రాల్లో సగటు సినిమా మనుగడ కష్టంగా మారింది. భారీ సినిమాలు రిలీజైనప్పుడు చిన్న సినిమాల రిలీజ్‌కు థియేటర్లు ఉండటం లేదు. అలాంటి సగటు చిత్రాన్ని కాపాడాలనే సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ మొత్తం చర్చల్లో చిరంజీవి పెద్ద పాత్ర పోషించారు. మీకున్న సాన్నిహిత్యంతో సీఎంకు ఇండస్ట్రీ సమస్యలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అదే మాదిరిగా.. నంది అవార్డులు సైతం అందజేసే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడాలని కోరుకుంటున్నా

- ఆర్‌. నారాయణ మూర్తి 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని