Updated : 30 Jul 2020 15:13 IST

ఈ సెలబ్రిటీలు కరోనా బాధితులే!

హైదరాబాద్‌: ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల ఎప్పుడు? ‘కేజీఎఫ్‌2’లో రాఖీభాయ్‌-అధీరల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ‘భారతీయుడు2’ థియేటర్లలోకి ఎప్పుడు వస్తాడు? మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొనియన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది కరోనా వైరస్సే. ఆ మహమ్మారి సామాన్యులనే కాదు, సాధ్యమైనంత వరకూ అన్ని జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలను సైతం వదల్లేదు. మొదట్లో కనికాకపూర్‌కు సోకితే అందరూ భయపడ్డారు. ఇటీవల అమితాబ్‌, విశాల్‌ వంటి వారూ ఈ వ్యాధి బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో రాజమౌళి పేరు చేరింది.

అన్నీ అనుకూలంగా ఉంటే నిత్యం షూటింగ్‌లతో, వారానికి ఒక కొత్త సినిమాతో చిత్ర పరిశ్రమ కళకళలాడుతూ ఉండేది. కరోనా రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. అప్పట్లో లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు జరగకపోగా, ఇప్పుడు మొదలు పెట్టాలన్నా కుదరని పరిస్థితి. పేద, ధనిక అనే భేదం లేకుండా ఎవరినీ వదలడం లేదు ఈ మహమ్మారి. మొదట బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ రాగా, ఆ తర్వాత బిగ్‌ బి అమితాబ్‌ కుటుంబం దీని బారిన పడింది. ఇప్పుడు అగ్ర దర్శకుడు రాజమౌళికి కరోనా సోకడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తనతో పాటు కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చినట్లు జక్కన్న స్వయంగా వెల్లడించారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కుటుంబంతో పాటు తానూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మాదానం చేయనున్నట్లు తెలిపారు.

అటు కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారితో విశాల్‌ యుద్ధం చేశాడు. తొలుత తన తండ్రి జీకే రెడ్డి దీని బారిన పడగా, ఆయన నుంచి విశాల్‌కు, అతని మేనేజర్‌కూ వచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కేవలం వారం రోజుల్లోనే తాను కోలుకున్నట్లు విశాల్‌ చెప్పారు.

బాలీవుడ్‌ దిగ్గజాలు కూడా కరోనా బాధితులే

మరోవైపు బాలీవుడ్‌లో బిగ్‌ బి అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడింది. అమితాబ్‌తో పాటు, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలకు ఈ వైరస్‌ సోకింది. ఐశ్వర్య, ఆరాధ్యలు ఇప్పటికే కొలుకొని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జీ అయ్యారు. మరో నటుడు అనుపమ్‌ ఖేర్‌ కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించింది. వీళ్లతో పాటు, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు కిరణ్‌కుమార్‌ సహా, జోయా మోనాలి కరోనా బారినపడి దానితో పోరాడి విజయం సాధించారు. పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొందరు ప్రముఖులను కరోనా కబళించింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన వాజిద్‌ఖాన్‌ కన్నుమూశారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈతరం ఫిల్మ్స్‌ అధినేతల్లో ఒకరైన పోకూరి రామారావు సైతం కోవిడ్‌ సోకి మృతి చెందారు.

అప్పటివరకూ షూటింగ్‌లు ఆపితే మంచిది

ఇటీవల అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సైతం సినిమా షూటింగ్‌లపై స్పందించారు. ‘కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అందరూ భౌతిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగ్‌లు మొదలు పెడితే కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు కలిశారు. ఇరు ప్రభుత్వాలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాయి. అయినా, చిత్రీకరణలు జరిపే పరిస్థితులు లేవు. ఆ సమయంలో ఎవరు కరోనా బారిన పడినా ఇబ్బందే. అంతెందుకు బిగ్‌బి అమితాబ్‌జీ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ నిస్సహాయతతో అంతా వేచి చూడాల్సిందే’’ అని పవన్‌ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని