‘నువ్వేకావాలి’ భయం లేకుండా తీశాం: త్రివిక్రమ్‌

సూపర్‌ హిట్‌ చిత్రం ‘నువ్వే కావాలి’ని ఎంతో స్వేచ్ఛగా తీశామని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గుర్తు చేసుకున్నారు. తరుణ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన సినిమా ఇది. రిచా కథానాయికగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై.....

Published : 13 Oct 2020 16:36 IST

హైదరాబాద్‌: సూపర్‌ హిట్‌ చిత్రం ‘నువ్వే కావాలి’ని ఎంతో స్వేచ్ఛగా తీశామని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గుర్తు చేసుకున్నారు. తరుణ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన సినిమా ఇది. రిచా కథానాయికగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. విజయ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాటల రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ రోజుల్ని నెమరువేసుకున్నారు.

‘‘నువ్వే కావాలి’ సినిమా అనగానే నాకు ముందు ఓ విషయం గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం రెయిన్‌బో ల్యాబ్‌లో ‘నీరం’ సినిమా షో వేశాం. పూర్తయిన తర్వాత నేను, రవి కిశోర్‌ గారు, రామోజీరావు గారు బయటికి వచ్చి 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నాం. ఆ 20 నిమిషాల మాటలు.. ఇప్పుడు 20 ఏళ్లు గడుస్తున్నా ‘నువ్వే కావాలి’ సినిమాను ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేసింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఎలా చూపించబోతున్నారని రామోజీరావు గారు అడిగారు. దీనికి ముందే నేను, రవి కిశోర్‌, విజయ్‌ భాస్కర్‌ సినిమాలో చేయాల్సిన మార్పుల గురించి మద్రాసులో మాట్లాడుకున్నాం. అవన్నీ నేను వివరించా. ‘మీకు పూర్తి నమ్మకం ఉందా?’ అని రామోజీరావు గారు ప్రశ్నించారు. ‘ఉందని’ చెప్పాం. ‘అయితే సరే.. చిత్రం తీయండి’ అన్నారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అలా సినిమా మొదలైంది. 50 రోజులలోపు తీసిన సినిమా.. 365 రోజులకంటే ఎక్కువ ఆడిన సినిమా.. 20 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గుర్తున్న సినిమా ఇది. రికార్డుల కోసం ఈ సినిమా తీయలేదు.. రెండు నెలలపాటు సరదాగా పనిచేశామంతే. నేను సెట్‌కు కేవలం నాలుగు సార్లు వెళ్లుంటా’.

‘సినిమా అనేది చాలా మంది ఎనర్జీ. మేమంతా అప్పుడు సరైన ఆలోచనలతో ఉన్నాం అనుకుంటా. మాటలు రాసే విషయంలో.. నేను ఆ సినిమా వరకు ప్రాస కోసం ప్రయత్నించా. అంతకు మించి నేను ఎక్కువగా ప్రయత్నించింది లేదు. మమ్మల్ని బాగా డైరెక్ట్‌ చేసింది మాత్రం రవి కిశోర్‌ గారు. ఆయన అనుకున్న దారిలోకి మమ్మల్ని నడిపారు. చివరికి అదే వర్కౌట్‌ అయ్యింది.. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. విజయ్‌ భాస్కర్ గారికి హాస్యచతురత ఎక్కువ. సున్నితత్వం ఉన్న వ్యక్తి. అందుకే ఎమోషన్స్‌ను అంత చక్కగా తీశారు’.

‘భయం లేకుండా తీసిన సినిమా అది. అందుకే చాలా స్థిరంగా ఉంటుంది. టెక్నికల్‌గా ఏదో నిరూపించాలనే ఆలోచన లేకుండా స్వేచ్ఛగా తీశాం. తప్పకుండా ఆడాలి, ఆడకపోతే ఏం అవుతుందో.. అనే భయాలు లేవు. ఏం జరిగినా.. మనల్ని చూసుకోవడానికి రామోజీరావు గారు ఉన్నారనే ధైర్యం. ఆయన దేనికీ అడ్డు చెప్పరు అనే నమ్మకం. సినిమా సమయంలో రామోజీరావు గారిని మేం కలిసింది నాలుగైదు సార్లే.. కానీ మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. దేవుడి దయ వల్ల ఆయన మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాం. 20 ఏళ్లు గడిచినా.. ఇంకా తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తూనే ఉంది. మన హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. చాలా కొద్ది సినిమాలు మాత్రమే మనతో ప్రయాణం చేస్తాయి. ‘నువ్వే కావాలి’లో నా భాగస్వామ్యం ఉండటం నా అదృష్టం. ‘స్వయంవరం’ తర్వాత విరామం తీసుకుని భీమవరం వెళ్లా. అక్కడున్న నన్ను విజయ్‌ భాస్కర్‌గారు, రవి కిశోర్‌ గారు కలిసి.. మాట్లాడారు. స్క్రిప్టు పూర్తయిన తర్వాత ‘నువ్వే కావాలి’ అనే టైటిల్‌ విజయ్‌ భాస్కర్‌ గారు పెట్టారు. ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు రామోజీ రావు గారికి, విజయ్‌ భాస్కర్‌ గారికి, రవి కిశోర్‌ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని త్రివిక్రమ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని