
రైతన్నలకు కోటి విరాళమిచ్చిన గాయకుడు
దిల్జిత్ గొప్ప మనసు.. రైతుల దుస్తుల కోసం..
ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలో ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాల్గొన్నారు. వారి డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘కొత్త చరిత్ర సృష్టించిన రైతులందరికీ హ్యాట్సాఫ్. ఈ చరిత్ర భవిష్యత్తు తరాలకు కూడా తెలుస్తుంది. రైతుల సమస్యల్ని పక్క దారి పట్టించకూడదు. కేంద్రానికి ఇదే నా అభ్యర్థన. మా రైతుల డిమాండ్లను నెరవేర్చండి. దేశ ప్రజలంతా రైతుల వెంట ఉన్నారు. ట్విటర్‌లో పరిస్థితుల్ని భిన్నంగా చూపిస్తున్నారు. కానీ రైతులు శాంతియుతంగా నిరసనను కొనసాగిస్తున్నారు. ఇక్కడ హింస గురించి ఎవరూ మాట్లాడటం లేదు’ అని నిరసనలో పాల్గొన్న దిల్జిత్ అన్నారు.
ఎముకలు కొరికే చలిలోనూ పట్టువదలకుండా నిరసనలో పాల్గొంటున్న అన్నదాతల దుస్తుల కోసం దిల్జిత్ రూ.కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో గాయకుడు సింగా ఆయన్ను ప్రశంసించారు. ఈ రోజుల్లో రూ.10 విరాళం ఇచ్చిన వ్యక్తి మౌనంగా ఉండటం లేదని, కానీ దిల్జిత్ గుట్టుచప్పుడు కాకుండా రూ.కోటి రైతుల కోసం ఇచ్చారని, ఎవరికీ తెలియనివ్వలేదని చెప్పారు.
రైతుల ఆందోళపై కామెంట్లు చేసిన కంగనా రనౌత్‌ను తప్పుపడుతూ దిల్జీత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్నదాతలకు మద్దతు పలుకుతూ ఇటీవల పంజాబీ నటుడు దీప్ సింధు నిరసనలో పాల్గొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ కంగన ట్వీట్ చేశారు. రైతుల పేరుతో కొందరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు ఓ వృధ్ధ మహిళ గురించి కంగన చేసిన ట్వీట్‌పై దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శనలో పాల్గొనాలంటే రూ. 100 ఇస్తే ఏ మహిళైనా వస్తుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కేసు వేశారు. అంతేకాదు కంగన వ్యాఖ్యలకు గాయకుడు మికా సింగ్, నటి హిమాషీ ఖురానా, గాయకుడు అమీ విర్క్, నటి సర్గున్ మెహతా తదితరులు సైతం ఖండించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.