‘మత్తుమందిచ్చి.. అత్యాచారం చేశాడు’

ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తిపై కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబరు 15న ఓషివారా పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2015 నుంచి మహాక్షయ్‌తో ప్రేమలో ఉన్నానని బాధితురాలు ఫిర్యాదులో....

Published : 18 Oct 2020 02:50 IST

మిథున్‌ చక్రవర్తి కుమారుడిపై కేసు నమోదు

ముంబయి: ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తిపై కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబరు 15న ఓషివారా పోలీసులు ఆయనపై అత్యాచారం కేసు‌ను నమోదు చేశారు. 2015 నుంచి మహాక్షయ్‌తో ప్రేమలో ఉన్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ సారి అతడు మత్తుమందు కలిపిన డ్రింక్‌ తాగించి, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. తమ బంధం నాలుగేళ్లు సాగిందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, బలవంతంగా గర్భస్రావం కూడా చేయించాడని తెలిపారు.

2018లో మహాక్షయ్‌ నటి మదాలస శర్మను వివాహం చేసుకున్న తర్వాత ఆయనపై ముంబయిలో కేసు పెట్టడానికి ప్రయత్నించానని, కానీ పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు చెప్పారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని ఆదేశించిన తర్వాత ఓషివారాలో కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు. కేసు వెనక్కి తీసుకోవాలని ఆయన తల్లి యోగితా బాలీ బెదిరించారని కూడా పేర్కొన్నారు.

మహాక్షయ్‌ భార్య ఏమన్నారంటే?

తన భర్త మహాక్షయ్‌పై అత్యాచారం కేసు నమోదైన నేపథ్యంలో మదాలస శర్మను మీడియా ప్రశ్నించింది. అయితే.. అసలు తన భర్తపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తనకు తెలియదని ఆమె అన్నారు. ‘కేసు పెట్టారా!, ఎందుకు?.. అది నిజం కాద’ని చెప్పారు. అనంతరం బాధితురాలి ఆరోపణల గురించి చెబితే.. ‘అవి పాత కథలు. మూడేళ్ల క్రితమే ఈ ఆరోపణలు చేశారు. అప్పుడే వాటిని పరిష్కరించుకున్నాం’ అని అన్నారు. తాజాగా కేసు నమోదైందని ప్రశ్నించగా.. ‘నాకు ఇప్పటి వరకు దాని గురించి తెలియదు’ అని పేర్కొన్నారు. మదాలస ‘ఫిటింగ్‌ మాస్టర్‌’, ‘ఆలస్యం అమృతం’, ‘మేం వయసుకు వచ్చాం’, ‘చిత్రం చెప్పిన కథ’, ‘రామ్‌ లీలా’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహాక్షయ్‌ కూడా పలు హిందీ సినిమాల్లో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని