ఎనిమిదేళ్లుగా విజయం నా పక్కనే: సుధీర్‌

సుడిగాలి సుధీర్‌ - రష్మి.. ఆన్‌స్ర్కీన్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. షోలో భాగంగా ఇప్పటికే సుధీర్‌.. రష్మికి ఎన్నోసార్లు ప్రపోజ్‌ చేయడం.. ఆమె నవ్వుతూ దానిని ఆహ్వానించడం కూడా జరిగింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో ప్రచారాలు జరిగాయి.

Updated : 11 Oct 2020 12:05 IST

ఎట్టకేలకు రష్మిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన నటుడు

హైదరాబాద్‌: సుడిగాలి సుధీర్‌ - రష్మి.. ఆన్‌స్ర్కీన్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. షోలో భాగంగా ఇప్పటికే సుధీర్‌.. రష్మికి ఎన్నోసార్లు ప్రపోజ్‌ చేయడం.. ఆమె నవ్వుతూ దానిని ఆహ్వానించడం కూడా జరిగింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే వీరిద్దరూ మాత్రం ప్రేమ గురించి అధికారికంగా ఏం చెప్పలేదు. అసలు వీరి మనసులో ఏముందో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సుధీర్‌.. రష్మిపై తనకున్న అభిప్రాయాన్ని తాజాగా బయటపెట్టాడు.

రోజా, మను న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. తాజాగా ఈ షో 300 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతో సెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా.. ‘జబర్దస్త్‌’ కామెడీ షో, అందులోని కమెడియన్స్‌ గురించి రాకేష్‌ స్కిట్‌ చేసి అందర్నీ అలరించాడు. ఇందుకోసం ఆయన పేదరాశి పెద్దమ్మ గెటప్‌లో కనిపించాడు. సుధీర్‌, రామ్‌ప్రసాద్‌, బుల్లెట్‌ భాస్కర్‌ లేడీ గెటప్స్‌ వేసుకుని పంచులతో కడుపుబ్బా నవ్వించారు. మరోవైపు అప్పారావు, సత్తిపండు తమ సతీమణులతో కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. ఇదిలా ఉండగా ఓ స్కిట్‌లో భాగంగా రవి, అనసూయతోపాటు టిక్‌టాక్‌ దుర్గారావు దంపతులు ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వేడుకల్లో తళుక్కున మెరిశారు.

కాగా, సెలబ్రేషన్స్‌లో భాగంగా రష్మిపై తనకున్న అభిప్రాయం గురించి చెప్పమని.. అభిమానులందరి తరఫు నుంచి సుధీర్‌ని రోజా కోరారు. రోజా అడిగిన ప్రశ్నతో ఒక్కసారిగా సుధీర్‌, రష్మి సిగ్గుపడ్డారు. అనంతరం సుధీర్‌ మాట్లాడుతూ.. ‘సుధీర్‌ అంటే కొంతమంది గుర్తుపట్టొచ్చు. కానీ సుధీర్‌-రష్మి అంటే మొత్తం గుర్తుపడతారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. కానీ ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనుక కాదు నా పక్కనే (రష్మిని ఉద్దేశిస్తూ)ఉంది.’ అని చెబుతాడు. సుధీర్‌ చెప్పిన మాటతో రష్మి ఎంతో సంతోషిస్తుంది. రష్మి గురించి సుధీర్‌ చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే వచ్చే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే. అక్టోబర్‌ 16న ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని