రష్మిక మూడు ఉద్దేశాలు.. మీకు తెలుసా?

వ్యాయామశాలలో మహిళలు బరువులు ఎత్తకూడదనేది కేవలం అపోహని కథానాయిక రష్మిక చెప్పారు. ‘యువర్‌ లైఫ్‌’లో భాగంగా ఆమె తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, శరీరంతోపాటు మనసు కూడా ఉల్లాసంగా .....

Updated : 14 Dec 2020 15:42 IST

ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌ మంత్ర

హైదరాబాద్‌: ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, శరీరంతోపాటు మనసు కూడా ఉల్లాసంగా ఉంటుందని కథానాయిక రష్మిక పేర్కొన్నారు. ‘యువర్‌ లైఫ్‌’లో భాగంగా ఆమె తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని పంచుకున్నారు. ఉపాసన ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్‌సైట్‌ ‘యువర్‌ లైఫ్‌’కు తొలుత సమంత అతిథి సంపాదకురాలుగా పనిచేశారు. ఆమె తర్వాత రష్మిక ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడిన విశేషాలు..

* మీరు ఎలాంటి వ్యాయామం చేస్తుంటారు?
రష్మిక: నా శరీరానికి వివిధ రకాల వర్కౌట్స్‌ అలవాటు చేస్తుంటా. ఓ వారం బరువులు లిఫ్ట్‌ చేస్తే.. మరో వారం కార్డియో.. ఇదంతా నేను అప్పుడున్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది.

* ఫిట్‌నెస్‌కు మీ నిర్వచనం?
రష్మిక: మీ పట్ల, మీ శరీరం, మనసు పట్ల సంతోషంగా ఉండటం. నేను దీన్నే నమ్ముతా.

* ఫిట్‌నెస్‌ పరంగా మీ లక్ష్యాలు?
రష్మిక: చేసే ప్రతి పనిలోనూ ఉత్తమంగా ఉండాలని భావిస్తుంటా. నా శరీరంలో ఈ భాగం ఫిట్‌గా ఉందని ఎదుటి వారు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో వ్యాయామం చేయను. శారీరకంగా, మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా ఉండటం కోసం నేను ఏది చేయడానికైనా రెడీ.

 

* పండగ రోజు కూడా జిమ్‌కు వెళ్లేలా.. మీలో స్ఫూర్తినింపే విషయం?
రష్మిక: క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా నన్ను ముందుకు నడుపుతున్నది ఏంటో నాకే తెలీదు. వ్యాయామం చేయకపోతే అసౌకర్యంగా, ఇబ్బందిగా భావించే స్థాయికి నేను చేరిపోయా. నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం.

* 50 ఏళ్ల వయసులో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారా?
రష్మిక: వయసు పెరిగే కొద్దీ శరీరం సహకరించదు. నాకు సాధ్యమైనంత వరకు ప్రతిదీ చేయడానికి ప్రయత్నిస్తున్నా. 50 ఏళ్ల వయసులోనూ ఇలానే వ్యాయామాన్ని కొనసాగిస్తా, దృఢంగా ఉండేందుకు ప్రయత్నిస్తా (నవ్వుతూ).

* మహిళలు బరువులు ఎత్తకూడదనే విషయంపై మీ అభిప్రాయం?
రష్మిక: మహిళలు బరువులు లిఫ్ట్‌ చేయకూడదనేది ఓ కల్పితం మాత్రమే. బరువులు ఎత్తడం వల్ల కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గడంతోపాటు ఎముకలకు కూడా మేలు జరుగుతుంది. శరీరం రంగు మెరుగుపడుతుంది.

* మీకు అవకాశం వస్తే, ఏ వ్యాయామాన్ని పక్కనపెడతారు?
రష్మిక: బరువులు లిఫ్ట్‌ చేయడాన్ని పక్కనపెట్టి.. స్పోర్ట్స్‌, కార్డియో వ్యాయామం చేస్తా. ఈ రెండు వ్యాయామాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

* మీరు ఆడే ఆటలు?
రష్మిక: ఈ మధ్యే వాలీబాల్‌ ఆడటం మొదలుపెట్టా. గతంలో ఈ ఆట గురించి నాకు తెలియదు. బ్యాడ్మింటన్‌ కూడా ఆడుతున్నా. నాకు స్విమ్మింగ్‌ చేయడం, క్రికెట్‌ ఆడటం ఎంతో ఇష్టం.

* వ్యాయామం చేయడం వెనుక ముఖ్య ఉద్దేశాలు ఏంటి?
రష్మిక: మొదటిది.. నా శరీరం చక్కగా ఉండాలి. రెండు.. ఫిట్‌గా ఉన్నాననే నమ్మకం నాకుంటే కెమెరా ముందు అందంగా కనిపిస్తాను. మూడు.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంతో అవసరం. ఇది అన్నింటి కంటే ప్రధానమైంది. దీని వల్ల మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. వర్కౌట్స్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

ఇవీ చదవండి..
భళ్లాల దేవుడిలో ఎన్నెన్ని కళలో.. మీకివి తెలుసా?

నం.1లో ‘మాస్టర్‌’.. నం.2లో ‘వకీల్‌సాబ్‌’



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని