డ్రగ్స్‌కేసు: తప్పుగా మాట్లాడితే ఎలా ఊరుకుంటా: హేమ

డ్రగ్స్‌ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని మొత్తం చిత్రపరిశ్రమను తప్పుపట్టడం సరికాదంటూ మంగళవారం పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలతో నటి హేమామాలిని ఏకీభవించారు. బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ తనకెంతో ఇచ్చిందని.. అలాంటిది ఇప్పుడు దాని గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఊరుకోగలను...

Published : 16 Sep 2020 18:38 IST

జయాబచ్చన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించిన నటి

ముంబయి: డ్రగ్స్‌ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని మొత్తం చిత్రపరిశ్రమను తప్పుపట్టడం సరికాదంటూ మంగళవారం పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలతో నటి హేమామాలిని ఏకీభవించారు. బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ తనకెంతో ఇచ్చిందని.. అలాంటిది ఇప్పుడు దాని గురించి కొంతమంది వ్యక్తులు తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఊరుకోగలను అని ప్రశ్నించారు. ‘బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఎవరూ దెబ్బతీయలేరు. ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అది చిన్న విషయం మాత్రమే. ఇది బట్టలకి పట్టిన మురికి లాంటిది. కాబట్టి శుభ్రంగా కడిగివేయాలి. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానాలు పొందాను. ఎవరైనా వ్యక్తులు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా చూస్తూ ఉండగలను’ అని హేమామాలిని అన్నారు. ఇదిలాఉండగా తాప్సీ, సోనమ్‌ కపూర్‌, దియామీర్జాతోపాటు పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు.. పార్లమెంట్‌ వేదికగా జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. జయాబచ్చన్‌ చక్కగా చెప్పారంటూ ట్వీట్లు చేశారు.

జయాబచ్చన్‌ ఎవర్ని కాపాడాలనుకుంటున్నారు: భాజపా నాయకుడు

రాజ్యసభ వేదికగా చిత్రపరిశ్రమ గురించి జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ భాజపా నేత కృష్ణసాగర్‌ రావు ఖండించారు. ‘మంగళవారం జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో బాధ్యతారహితమైన రాజ్యసభ సభ్యురాలిగా జయాబచ్చన్‌ వ్యవహరించారు. దేశవ్యాప్తంగానే తనకి ఎంతో సుపరిచితమైన చిత్రపరిశ్రమలో సైతం ఉన్న డ్రగ్స్‌ కల్చర్‌ గురించి స్పందించకుండా చిత్రపరిశ్రమకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర జరుగుతోందంటూ జీరో అవర్‌లో నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. జయాబచ్చన్‌ ఎవర్ని కాపాడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని