Updated : 05 Dec 2020 13:24 IST

హై..హై... నాయికా

కథానాయిక అంటే ఆటపాటలకు, అందాల ఆరబోతకే పరిమితం అనే మాటలకు చరమగీతం పాడేస్తున్నారు నాయికలు. హీరోలకు మేం ఏం తక్కువ కాదు... మా చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తాయంటూ దూసుకుపోతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు మహిళా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తున్నారు. అగ్ర నాయికలు మొదలు యువతరం భామల వరకూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం అంటే సై అనేస్తున్నారు. ఈ ఏడాదీ అలా పలు నాయికా ప్రాధాన్య చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నా కరోనాతో కొన్నే ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. త్వరలో మరిన్ని నాయికా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.

నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించడానికి ఎక్కువమంది ముందుకు రావడం చాలా మంచి పరిణామం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రాలు వైవిధ్యమైన కథలతో తెరకెక్కడమే కాదు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. దీంతో వీటి విజయాల శాతం బాగా పెరిగింది.  బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఏర్పడింది. దీంతో కంగనా రనౌత్, అలియాభట్, తాప్సి, విద్యాబాలన్, భూమి పెడ్నేకర్, పరిణీతి చోప్రా, కియార అడ్వాణీ తదితర హీరోయిన్‌లు బాక్సాఫీసుకి తమ పవరేంటో చూపించడానికి సిద్ధమవుతున్నారు.

మూడు అస్త్రాలతో కంగన

ఈ ఏడాది ఆరంభంలోనే ‘పంగా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా రనౌత్‌. కబడ్డీ అంటే ఎంతో ఇష్టమున్న ఓ మహిళ వివాహం తర్వాత ఆ ఆటలో విజయం సాధించిన తీరు నేపథ్యంగా సాగే చిత్రమిది. ఈ చిత్రానికి ఆశించిన వసూళ్లు దక్కకపోయినా మధ్యతరగతి భార్య పాత్రలో కంగన నటనకు ప్రశంసలు అందాయి. ఆమె నుంచి మరో మూడు మహిళా ప్రాధాన్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జయలలిత జీవిత కథతో తెరకెక్కుతోన్న ‘తలైవి’ చిత్రంలో కంగన టైటిల్‌ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. భారత వాయుసేన పైలెట్‌గా కంగన   నటించనున్న చిత్రం ‘తేజస్‌’. ఈ చిత్రంలో ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గెటప్‌లో ఉన్న కంగన ఫొటోలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. కంగన పూర్తిస్థాయి యాక్షన్‌ అవతారం ఎత్తనున్న చిత్రం ‘ధాకడ్‌’. రెండు చేతులతోనూ గన్స్‌ పట్టుకుని పోరాడుతున్న కంగన పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. రజనీష్‌ ఘయ్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రం కోసం కంగన ఇప్పటికే కసరత్తులు షురూ చేసింది. ఈ మూడింటిపైనా ఆమె చాలా ధీమాగా ఉంది. వీటిని బాక్సాఫీసుకు నాయికల సత్తాని చాటే మూడు అస్త్రాలుగా మలచడానికి కంగన శ్రమిస్తోంది.

కియార ‘కర్రమ్‌...కుర్రమ్‌’

బాలీవుడ్‌లో జోరుమీద ఉంది కియార అడ్వాణీ. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా అశుతోష్‌ గోవారికర్‌  నిర్మిస్తున్న ‘కర్రమ్‌.. కుర్రమ్‌’ చిత్రంలో నటిస్తున్నట్లు   ప్రకటించింది. ఆరుగురు గృహిణులతో ఒక సంఘంగా ఏర్పడి... అప్పడాలు తయారు చేసి మార్కెట్‌ చేసి పెద్ద వ్యాపారాన్ని సృష్టించిన ఓ స్ఫూర్తి దాయక మహిళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోవారికర్‌ వద్ద అసిస్టెంట్లుగా పనిచేసిన గ్లేన్‌ బారెట్టో, అంకుశ్‌ మెహ్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇందూ ఖీ జవానీ’. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

రాజీపడని అలియా..

‘రాజీ’ చిత్రంతో బాక్సాఫీసుకు నాయికా ప్రాధాన్య చిత్రాల సత్తా ఏంటో చాటిన మరో నాయిక అలియా భట్‌. ఇప్పుడు అలియా ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘గంగూభాయి కతియావాడి’. ఇందులో ఆమె వేశ్యావాటిక నిర్వాహకురాలిగా, మాఫియా క్వీన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ జరుగుతోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ పాత్ర కోసం కష్టపడటానికి అలియా ఎక్కడా రాజీపడటం లేదట.

దూకుడుగా తాప్సి..

గ్లామర్‌ తారగా వెలిగిన తాప్సి రూటు మార్చింది. నాయికా ప్రాధాన్య చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘సాండ్‌ ఖీ ఆంఖ్‌’ చిత్రంలో షూటర్‌ ప్రకాషి తోమర్‌ పాత్రలో నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘థప్పడ్‌’ చిత్రం మంచి విజయం సాధించింది. భర్త చెంపదెబ్బ కొట్టాడని విడాకులు కోరిన మహిళ పాత్రలో తాప్సి ఒదిగిపోయింది. ఇప్పుడు మరోసారి తనేంటో చూపించడానికి ‘రష్మి రాకెట్‌’తో సిద్ధమవుతోంది. ఇందులో రన్నింగ్‌ క్రీడాకారిణిగా నటిస్తోన్న తాప్సి ఈ చిత్రం కోసం రేయింబవళ్లు కష్టపడుతోంది. ఈ సినిమా షెడ్యూల్‌ ఇటీవలే ముగిసింది. ఆమె నటిస్తున్న మరో లేడీఓరియెంటెడ్‌ చిత్రం ‘లూప్‌ లపేటా’. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భారతీయ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథతో తెరకెక్కనున్న ‘షభాష్‌ మిథు’లో టైటిల్‌ పాత్ర పోషిస్తుంది తాప్సి. ఈ చిత్రం కోసం క్రికెట్‌ సాధన కూడా చేస్తోంది తాప్సి. జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

షేర్నీ విద్యాబాలన్‌..

‘డర్టీపిక్చర్‌’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది విద్యాబాలన్‌. ఈ ఏడాది ఆమె నుంచి వచ్చిన చిత్రం ‘శకుంతలా దేవి’. ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో విద్యా నటన అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. వాస్తవ  సంఘటనల స్ఫూర్తితో అటవీ నేపథ్యంగా సాగే చిత్రమిది. విద్య అటవీశాఖ అధికారిణిగా నటిస్తుంది.

సైనా పరిణీతి

మరో బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రా నటిస్తున్న చిత్రం ‘సైనా’. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ఇది. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైనా పాత్రకు అచ్చుగుద్దినట్టు సరిపోయిందంటూ పరిణీతికి ప్రశంసలు దక్కుతున్నాయి. సైనా గెటప్‌లో పరిణీతిని చూసి అచ్చు గుద్దినట్టు సరిపోయిందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని వచ్చే తొలినాళ్లలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మాకు గొప్ప అవకాశమిది

*వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న బాలీవుడ్‌ నాయిక భూమి పెడ్నేకర్‌. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘దుర్గామతి’. తెలుగు చిత్రం ‘భాగమతి’కి హిందీ రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించినా అశోక్‌ రీమేక్‌ని రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 11న ఓటీటీలో విడుదల కానుంది. ‘‘నాయికా ప్రాధాన్య చిత్రాలు సాధ్యమైనన్ని ఎక్కువ చేస్తాను. అది నాకే కాదు చిత్ర పరిశ్రమకు చాలా అవసరం.   మహిళల సత్తా చాటడానికి మాకు దొరికిన గొప్ప అవకాశమిది’’అంటోంది భూమి.

*మొత్తానికి రాబోయే రోజుల్లో నాయికా చిత్రాల సందడి గట్టిగానే ఉండబోతుంది. అంతేస్థాయిలో విజయాలూ దక్కాలని చిత్రసీమ కోరుకుంటోంది.

ఇవీ చదవండి

రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వెనుక ఆరేళ్ల కష్టం..!

తెరంగేట్రానికి ఈ సినీ వారసులు రెడీ

 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని