Published : 27 Nov 2020 23:19 IST

అగ్రతారతో ఆడుతూ.. కుర్రకారుతో పాడుతూ

‘ఛాన్స్‌ పట్టు.. హిట్టు కొట్టు..స్టార్‌ హీరోతో జట్టు కట్టు..’ వెండితెరపై మెరుపులు మెరిపించాలని తాపత్రయపడే ప్రతి కథానాయిక లక్ష్యం దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఇక ఒక్కసారి స్టార్‌ నాయికగా ముద్ర పడిందంటే చాలు.. తర్వాత ప్రయాణమంతా ఆ ఇమేజ్‌కు తగ్గట్లుగా కొనసాగించేస్తుంటారు. స్టార్‌ హీరో.. అగ్ర దర్శకుడు.. బడా నిర్మాణ సంస్థ.. ఇలా అన్నీ తగ్గట్లుగా చూసుకొని సినిమాలు ఒప్పుకొంటుంటారు. నవతరం నాయికలు ఈ మూస సూత్రాల్ని పక్కకు నెట్టి.. కొత్త పంథాలో దూసుకెళ్తున్నారు. కథ.. కథనాలు మనసుకు నచ్చాయంటే చాలు ఇమేజ్‌ చట్రాల్ని పక్కకు పెట్టి మరీ సినిమాలకు సై అంటున్నారు. ఇటు అగ్ర తారలతో ఆడిపాడుతూనే.. అటు కుర్ర హీరోలతో జోడీ కట్టేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

కాజల్‌ సినీప్రయాణం మొదలై దశాబ్దంన్నర కాలం దాటింది. దక్షిణాదిలోని స్టార్‌ హీరోలందరితోనూ జోడీ కట్టి మెప్పించింది. నేటికీ స్టార్‌ నాయికగా జోరు చూపిస్తోంది. అయినా సరే.. ఆమె ఇప్పటికీ యువ హీరోలతో ఆడిపాడేందుకు వెనకాడటం లేదు. ప్రస్తుతం ఆమె అగ్ర హీరో చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తూనే.. మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్లు’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా త్వరలో రానుంది.

స్టార్‌ నాయికగా ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ మెరిపిస్తోంది పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ స్టార్‌ హీరోల చిత్రాలే. వీటిలో ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’తో పాటు సల్మాన్‌ ఖాన్‌తో చేయాల్సిన మరో ప్రాజెక్టు ఉన్నాయి. ఇవే కాక ఆమె ఖాతాలో ఓ యువ కథానాయకుడి చిత్రమూ ఉంది. అదే అఖిల్‌తో చేస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’.  వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘మహానటి’తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. దీని తర్వాత ఆమె నాయికా ప్రాధాన్య, స్టార్‌ హీరోల సినిమాలకూ ప్రధాన ఎంపికగా మారింది. అయితే ఇన్ని అవకాశాలున్నా.. మంచి కథ దొరికితే యువ హీరోలతో జోడీ కట్టేందుకూ వెనకాడటం లేదు. త్వరలో మహేష్‌బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’లో సందడి చేయనున్న ఆమె..యువ హీరో నితిన్‌తో ‘రంగ్‌దే’, ఆది పినిశెట్టితో ‘గుడ్‌లక్‌ సఖీ’ చేస్తోంది. ఈ రెండు తుది దశ చిత్రీకరణలోనే ఉన్నాయి.

తమన్నా స్టార్‌ కథానాయిక హోదాని ఎప్పుడో చేరుకుంది. తెలుగులోని స్టార్‌ హీరోలందరితోనూ జోడీ కట్టిన అనుభవం ఆమె సొంతం. అంతేకాదు అవకాశాలొచ్చినప్పుడల్లా ఆమె కుర్ర హీరోలతో ఆడిపాడి మెప్పించింది. ఇప్పుడామె ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రం కోసం మరోసారి ఇదే ప్రయత్నం చేసింది. యువ హీరో సత్యదేవ్‌తో జోడీ కట్టేందుకు సిద్ధమైంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోందీ సినిమా.

మరో నాయిక రష్మిక కొన్నాళ్లుగా అగ్ర హీరోల సరసనే ఆడిపాడుతోంది. ఈ ఏడాది మహేష్‌కు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’తో మెప్పించిన ఆమె.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఆమె ఇటీవల యువ హీరో శర్వానంద్‌ చిత్రానికి పచ్చజెండా ఊపి అందరినీ ఆశ్చర్యపరిచింది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని