Updated : 27/12/2020 14:40 IST

యాక్షన్‌ సీన్లు.. యానిమేషన్‌ మెరుపులు.. లేవ్‌!

‘‘ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో..., కళ్లు చెదిరే యాక్షన్‌ ఘట్టాలతో...మీ ముందుకొస్తోంది....’’అంటూ గమ్మత్తైన గొంతుతో వచ్చే హాలీవుడ్‌ యాడ్‌లు ఈ ఏడాది కరవయ్యాయి. జేమ్స్‌బాండ్‌ తూటాల శబ్దం లేదు, బ్లాక్‌విడో మెరుపుల్లేవు. యానిమేషన్‌ సినిమాల అల్లరి, అగ్రహీరోల సందడి ఇలా హాలీవుడ్‌ మెరుపులన్నింటినీ కరోనా చీకట్లోకి నెట్టింది. కరోనా దాటికి థియేటర్లలో సినిమాల సందడి లేకపోవడమే కాక, హాలీవుడ్‌ను ఆర్థికంగానూ తీవ్ర నష్టానికి గురిచేసింది 2020.

భారీ చిత్రాలను నిర్మించే సంస్థలు, స్టూడియోలు ఈ ఏడాది ఖాళీగానే ఉండిపోయాయి. హాలీవుడ్‌ సినిమాలతో కిటకిటలాడాల్సిన థియేటర్లు వెలవెలబోయాయి. సర్వశక్తులొడ్డి ప్రపంచాన్ని కాపాడే సూపర్‌ హీరోలు సైతం ఈ వైరస్‌ను ఎదుర్కోలేక తమ చిత్రాల్ని, చిత్రీకరణలనూ వాయిదావేసుకున్నారు. దీంతో హాలీవుడ్‌ భారీగానే నష్టపోయింది. ఇటు ప్రేక్షకులను నిరాశపరచడమే కాక, అటు నిర్మాతలను ఆర్థికంగా దెబ్బ  తీసింది కొవిడ్‌. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హాలీవుడ్‌ గతేడాది(2019) 42 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.3 లక్షలకోట్లు) కలెక్షన్లను ఆర్జించింది. ఆ వసూళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది 70 శాతం గండిపడిందని నిపుణుల అంచనా. 2019లో ఒక్క అమెరికాలోనే 11.32 బిలియన్‌ డాలర్లు(రూ.84వేల కోట్లు)ను ఆర్జిస్తే, 2020కిగానూ ఆ వసూళ్లు 2.3 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 18వేలకోట్లు)కు పడి  పోయింది. అంటే గతేడాదితో పోల్చితే అమెరికాలో వసూళ్లు 80 శాతం తగ్గి  పోయాయి. ఇవి నలభై ఏళ్ల క్రితం అంటే 1980లో వచ్చిన 2.75  బిలియన్‌ డాలర్లకంటే తక్కువ. అప్పటికన్నా  తక్కువ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది.

చైనా సినిమా ఆధిపత్యం

సినిమా ప్రపంచంలో హాలీవుడ్‌దే పై చేయి. రికార్డులైనే, కలెక్షన్లైనా, అవార్డులు కొల్లగొట్టడంలోనైనా వారే ముందుంటారు. ఈ సారి హాలీవుడ్‌ను మించి పోయింది చైనా సినిమా. ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధికంగా వసూళ్లు సాధించిన  సినిమాగా ‘ది ఎయిట్‌ హండ్రెడ్‌’ అనే చైనా చిత్రం 472 మిలియన్‌ డాలర్ల(రూ.3,476 కోట్లు)తో అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ద్వితీయ స్థానం ‘మై పీపుల్‌ మై హోమ్‌ల్యాండ్‌’ కూడా చైనా సినిమానే. ఇది 458 మిలియన్‌ డాలర్లు(రూ.3373 కోట్లు)  ఆర్జించింది. ఆ తర్వాతే విల్‌స్మిత్‌ ‘బ్యాడ్‌ బాయ్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ 426మిలియన్‌ డాలర్లు(రూ.3138 కోట్లు, క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘టెనెట్‌’ 362  మిలియన్‌ డాలర్ల(రూ.2666కోట్లు) కలెక్షన్లతో హాలీవుడ్‌ సినిమాలు నిలిచాయి. ఇందుకు కారణం... చైనాలో థియేటర్లు   తెరిచి ఉండటమే. 2020 టాప్‌గ్రాసర్లలో తొలి పదిస్థానాల్లో ఐదు హాలీవుడేతర సినిమాలే.

వాయిదాల పర్వం

కొవిడ్‌ కారణంగా చాలా హాలీవుడ్‌ సినిమాలు వాయిదా పడ్డాయి. డేనియల్‌ క్రేగ్‌ నటిస్తున్న ‘జేమ్స్‌బాండ్‌: నో టైమ్‌ టు డై’ సినిమా రెండు సార్లు వాయిదా పడి, ఏకంగా వచ్చే ఏడాదికి విడుదల తేదీని మార్చుకుంది. జేమ్స్‌బాండ్‌ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రమవడం. 2021లో సమ్మర్‌కు జేమ్స్‌బాండ్‌ సినిమా హాల్లో సందడి చేయనుంది. టామ్‌క్రూజ్‌ నటించిన మిషన్‌ఇంపాజిబుల్‌-7 చిత్రీకరణను కరోనా దెబ్బకు సుదీర్ఘంగా వాయిదా వేశారు. బాండ్‌ బాటలోనే ‘బ్లాక్‌ విడో’ కూడా నడిచింది. స్కార్లెట్‌ జాన్సెన్‌ నటించిన ఈ చిత్రాన్ని మార్వెల్‌ సంస్థ భారీ   బడ్జెట్‌తో తెరకెక్కించింది. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు క్రిస్మస్‌ కానుకగా ‘వండర్‌ వుమెన్‌1984’   విడుదలయింది. వీటితో పాటు ఫాస్ట్‌అండ్‌ఫ్యూరియస్‌ 9, ది క్వైట్‌ ప్లేస్‌2, పీటర్‌ ర్యాబిట్‌2, గాడ్జిల్లా వర్సస్‌ కాంగ్‌, ఘోస్ట్‌ బస్టర్స్‌ ఆఫ్టర్‌  లైఫ్‌ ఇలా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఈ వాయిదాలతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.

1 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ ఖాళీ

2019 లో 1 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను మొత్తం తొమ్మిది హాలీవుడ్‌ చిత్రాలు దాటాయి. అత్యధికంగా అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ 2.79 బిలియన్‌ డాలర్లు సాధించగా, మిగిలిన స్థానాల్లో ది లయన్‌ కింగ్‌, జోకర్‌,  ఫ్రోజెన్‌2, స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌, స్టార్‌వార్స్‌: ది రైజ్‌ ఆఫ్‌ స్కైవాకర్‌, కెప్టెన్‌ మార్వెల్‌, టాయ్‌స్టోరీ 4,  అల్లాదిన్‌ సినిమాలు నిలిచాయి. కొవిడ్‌ దెబ్బకు 2020లో ఒక్కటీ ఈ మార్క్‌ చేరలేదు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని