తల్లినైనా సినిమాల్లో నటిస్తా: అనుష్కశర్మ

బాలీవుడ్‌ నటి, భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమె త్వరలోనే తల్లికాబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో శిశువుకు జన్మనివ్వబోతున్నట్లు కోహ్లీదంపతులు ఇప్పటికే...

Published : 28 Nov 2020 22:24 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి, భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో శిశువుకు జన్మనివ్వబోతున్నట్లు కోహ్లీ దంపతులు ఇప్పటికే ప్రకటించారు. అయితే.. తాను బతికి ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటానని అనుష్క స్పష్టం చేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తన సిబ్బందితో కలిసి ఆమె సెట్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తన సినిమా కెరీర్‌ గురించి మాట్లాడారు.

‘సినిమా సెట్స్‌లో ఉండటం, ఇలా అందర్నీ కలుసుకోవడం నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. రాబోయే కొన్ని రోజులపాటు చిత్రీకరణలో పాల్గొబోతున్నాను. నేను నా తొలి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్‌కు వస్తాను. ఇల్లు, వృత్తి ఇలా రెండింటినీ సమతుల్యం చేయాలని అనుకుంటున్నాను. నేను బతికి ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటాను. ఎందుకంటే నటనలోనే నాకు ఎంతో సంతోషం ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.

కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ఇలాంటి సమయంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు తనకు సహకరిస్తున్న అందరికీ అనుష్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కానీ.. అదే ఉత్సాహంతో మళ్లీ షూటింగ్‌లు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనుష్క చేతిలో రెండు సినిమాలున్నాయి. నవదీప్‌సింగ్‌ దర్శకత్వంలో అర్జున్‌కపూర్‌తో ఓ చిత్రంలో ఆమె నటిస్తోంది. దీంతో పాటు భారత మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లోనే ఆమె నటించాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రెండు సినిమాలు 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని