ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

కరోనా వైరస్‌తో పోరాటం చేసి.. ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు నటుడు నాగబాబు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని.....

Updated : 28 Oct 2020 11:37 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో పోరాటం చేసి.. ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు నటుడు నాగబాబు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.

‘కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే. ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డా. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయాను. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయి. దీంతో వైద్యులు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఇంటికి వచ్చాక మరో వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాను.’

‘నేను ఇంటికి వచ్చే సమయానికి నా భార్య పద్మజకి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మేమిద్దరం స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. అది మాకు కఠిన సమయమే అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొగలిగాం. నా భార్య నాకంటే ఆరోగ్యవంతురాలు అందుకే తను వెంటనే కొలుకోగలిగింది. అయితే సాధారణ జీవితంలోకి రావడానికి నాకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది.’

‘ఒకవేళ మీలో ఎవరికైనా కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే పరీక్ష చేయించుకోండి. కొవిడ్‌-19 వైరస్‌తో మీ శరీరం పోరాటం చేయగలదేమో కానీ మీ పక్కనే ఉండే కొంతమంది దాన్ని తట్టుకోలేకపోవచ్చు. ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించండి’ అని నాగబాబు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని